Afghanistan: కుటుంబ పోషణ కోసం 9 ఏళ్ల కూతురిని 55ఏళ్ల వృద్ధుడికి అమ్మిన తండ్రి

Father Sold her Nine Years Daughter to 55 Years old man with Financial Problems in Afghanistan
x

కుటుంబ పోషణ కోసం 9 ఏళ్ల కూతురిని 55ఏళ్ల వృద్ధుడికి అమ్మిన తండ్రి  

Highlights

*మరింత దిగజారుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక పరిస్థితులు *ఆఫ్ఘనీయులకు పూట గడవటమే కష్టంగా మారిన పరిస్థితులు

Afghanistan: తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆఫ్ఘాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇతర దేశాలు గుర్తించకపోవడం, విదేశాల్లో చిక్కుకుపోయిన నిధులు విడుదల కాకపోవడంతో ఆఫ్ఘాన్ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనీయులకు పూటగడవటమే కష్టంగా మారింది అనడానికి ఉదాహరణగా.. కళ్లు చెమ్మగిల్లే ఘటన జరిగింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఓ వ్యక్తి తన కుటుంబం కడుపు నింపేందుకు 9 సంవత్సరాలు కన్న కూతురిని అమ్మేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పర్వానా మాలిక్‌ను 55 ఏళ్ల వ్యక్తికి విక్రయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని శరణార్థి శిబిరంలో ఉన్న పర్వానా మాలిక్‌ను అతని తండ్రి అబ్దుల్ మాలిక్ అమ్మేయడం అక్కడి పరిస్థితులను కళ్లకు కడుతోంది. పూర్తిగా లోకజ్ఞానం తెలీని చిన్నారిని 55 ఏళ్ల వృద్ధుడికి అప్పజెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి అబ్దుల్ మాలిక్. ఆ సమయంలో బోరున విలపిస్తూ తన కూతురిని కొట్టవద్దని వేడుకున్నాడు. దీనికి సంబందించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

మరోవైపు తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఎలాంటి సంపాదనా లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అబ్దుల్ మాలిక్ తెలిపాడు. 8మంది కుటుంబ సభ్యులను సజీవంగా ఉంచడానికి తన చిన్నారిని అమ్మడం తప్ప వేరే మార్గం కనిపించలేదన్నాడు. ఇది.. ఒక్క అబ్దుల్ మాలిక్ పరిస్థితి మాత్రమే కాదు. ఆఫ్ఘనిస్థాన్‌లోని చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. తినడానికి తిండి కట్టుకోడానికి సరైన బట్టలు లేక అల్లాడుతున్నారు.

ఓ వైపు ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నా తాలిబన్లలో మాత్రం ఎలాంటి మార్పులూ కనిపించడం లేదు. రోజుకో నిర్ణయంతో ప్రజలను మరింత భయాంతోళనలకు గురిచేస్తున్నారు. రూపాయి ఆదాయం కనిపించని పరిస్థితుల్లోనూ విదేశీ కరెన్సీ వినియోగంపై తాలిబన్లు నిషేధం విధించారు. దేశ ఆర్థిక పరిస్థితి అవసరాల దృష్ట్యా ఆఫ్ఘానీలు లావాదేవీల్లో దేశీయ కరెన్సీని మాత్రమే వినియోగించాలన్నారు. విదేశీ కరెన్సీ వినియోగం నుంచి కచ్చితంగా బయటపడాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు అమెరికా దళాలు ఉన్న సమయంలో అఫ్గానిస్థాన్‌లో అత్యధికంగా డాలర్‌నే వినియోగించేవారు. కానీ, అమెరికన్లు ఆఫ్ఘాన్ నుంచి వెళ్లిపోయాక డాలర్ల సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా అమెరికా ఫెడ్‌ దగ్గర దాదాపు 9 బిలియన్‌ డాలర్ల అఫ్గాన్‌ రిజర్వులు ఉన్నాయి. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత అమెరికా వాటిని నిలిపివేసింది. ఈ నిధులను విడుదల చేయాలని ఇప్పటికే తాలిబన్లు కోరినా ఎలాంటి ఫలితం లేదు. దీనికి తోడు విదేశీ సహాయం కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు నిధుల సరఫరాను నిలిపివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిలియన్ల మంది ఆఫ్ఘన్లు పేదరికంలోకి జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories