ఆంక్షలను ఉల్లంఘింస్తున్న ఐరోపా దేశాలు

Europe is facing an energy crisis as Russia cuts gas
x

ఆంక్షలను ఉల్లంఘింస్తున్న ఐరోపా దేశాలు

Highlights

*రష్యాతో గ్యాస్‌ ఒప్పందాలు రద్దు

Europe Gas Politics: రెండు నాల్కల ధోరణి అంటే ఐరోపా దేశాలదేనేమో ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై కఠిన ఆంక్షలను విధించాయి. అందులో భాగంగానే సహజ వాయువు దిగుమతుల కొత్త ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. మరే దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయరాదంటూ ఒత్తిడి తెస్తున్నాయి. మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ఐరోపా దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇదేమి పద్దతంటూ మండిపడుతున్నాయి. కానీ ఆ దేశాలు మాత్రం ఇప్పటికీ రష్యన్‌ గ్యాస్‌నే కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచానికి నీతులు చెబుతున్న ఐరోపా దేశాలు మాత్రం తమ ద్వంద్వ నీతిని బయట పెడుతున్నాయి. తమ తీరు ఇంతే అని ఆ దేశాలు తమకు తామే చాటుకుంటున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ఫై రష్యా సైనిక చర్యకు దిగింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఐరోపా దేశాలకు ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి నేరుగా యుద్ధంలోకి దిగడం లేదా ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ఈ క్రమంలో పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలనే ఎంచుకున్నాయి. రష్యా ఆటకట్టించడమే లక్ష్యమని భావించాయి. ముందూ వెనుకా ఆలోచించకుండా రష్యా నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయవుల కొత్త ఒప్పందాలను కూడా రద్దు చేసుకున్నాయి. పాత ఒప్పందాల ప్రకారం ఈ ఏడాది చివరి వరకు రష్యా గ్యాస్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇక్కడే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు గేమ్‌ ప్లాన్‌ను అమలు చేశారు. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తూ తమపై ఆంక్షల విధించిన ఐరోపా దేశాలను ఊరికే వదిలేయరాదంటూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా వారం రోజుల క్రితం నార్త్‌ స్ట్రీమ్‌లోని అతి పెద్ద పైపులైన్‌ నుంచి గ్యాస్‌ సరఫరాను నిలిపేశారు. పరోక్షంగా ఐరోపా దేశాలపై పుతిన్‌ యుద్ధం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు సహాయం నిలిపేసేవరకు గ్యాస్‌ను సరఫరా చేసేది లేదంటూ భీష్మించారు. పుతిన్‌ నిర్ణయంతో యుద్ధంలో ధ్వంసమవుతున్న ఉక్రెయిన్‌ కంటే.. ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గ్యాస్‌ లేకపోతే ఆ దేశాల్లో ఒక్క రోజు కూడా గడవడం కష్టమే అసలు శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో గ్యాస్‌ నిల్వలు లేకపోతే.. ఆ దేశాల్లోని ప్రజలు చలికి చచ్చిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.

ఇప్పుడు ప్రపంచంలోనే సహజ వాయువును విక్రయించే రష్యా, అమెరికా, ఇండోనేషియా కంటే చైనానే ఎక్కువగా ఎగుమతులు చేస్తోంది. నిజానికి చైనా వద్ద ఎలాంటి గ్యాస్‌ నిక్షేపాలు లేవు. కేవలం మాస్కో నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్‌నే బీజింగ్‌ విక్రయిస్తోంది. 2021లో 10 వేల 950 కోట్ల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను చైనా దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే 60శాతానికి పైగా కొనుగోలు చేసింది. ఇందులో అత్యధికంగా రష్యా నుంచే కొనుగోలు చేసింది. 2022 సంవత్సరంలో మొదటి 6 నెల్లలో 216 కోట్ల డాలర్ల విలువైన గ్యాస్‌ను మాస్కో నుంచి బీజింగ్‌ కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు.. డ్రాగన్‌ కంట్రీకి గ్యాస్‌ సరఫరా చేసే దేశాల్లో రష్యా ఆరోస్థానంలో ఉండేది. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం చైనాలో వరుస లాక్‌డౌన్లతో గ్యాస్‌ వినియోగం భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభం వెంటాడుతుండడంతో డ్రాగన్‌.. మిగులు గ్యాస్‌ను విక్రయించాలని నిర్ణయించింది. అలా ప్రకటించిందో లేదో.. అసలే గ్యాస్‌ కోసం మొహం వాచిన ఐరోపా దేశాలు క్యూలో అందరికంటే ముందే నిల్చుంటున్నాయి. అంటే పరోక్షంగా రష్యన్ గ్యాస్‌నే కొనుగోలు చేయడానికి ఆరాటపడుతున్నాయి. అంతేకాదు రష్యా కన్నా చైనా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నా సరే.. గ్యాస్‌ దొరకడమే అదృష్టం అన్నట్టుగా ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. ఐరోపా దేశాలు 2022లో మొదటి ఆరు నెలల్లో 60 శాతం గ్యాస్‌ దిగుమతులు పెరిగాయి. అందులో 40 లక్షల టన్నుల గ్యాస్‌ చైనా నుంచి కొనుగోలు చేసిన గ్యాసే ఉంది.

రష్యా భారీగా చైనాకు గ్యాస్‌ను ఎగుమతి చేస్తోంది. భారత్‌తో సహా చైనాకు కూడా సబ్సిడీ ధరలకే మాస్కో చమురు, గ్యాస్‌లను విక్రయిస్తోంది. దీన్నే జిత్తులమారి డ్రాగన్‌ కంట్రీ క్యాస్‌ చేసుకోవాలని భావించింది. ఆ గ్యాస్‌నే ఇప్పుడు ఐరోపా దేశాలకు విక్రయిస్తోంది. సాధారణ ధరల కంటే.. మూడు, నాలుగు రెట్ల ధరలను పెంచింది. అయినా చైనా నుంచి గ్యాస్‌ను కొనుగోలుకు ఐరోపా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అంటే.. ఇప్పటికీ రష్యా నుంచి ఐరోపా దేశాలు గ్యాస్‌ను భారీగానే దిగుమతి చేసుకుంటున్నట్టే లెక్క. అయితే అది నేరుగా రష్యా నుంచి కాకుండా.. పరోక్షంగా చైనా నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే ఇలా రష్యా చమురును పరోక్షంగా ఐరోపా దేశాలు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఐరోపా దేశాలు ఇలానే వ్యవహరించాయి. గతంలో పలు రష్యన్‌ ఆయుల్‌ నౌకలు.. పోర్టు నుంచి వెళ్లిపోయిన తరువాత కనిపించకుండా పోయాయి. రాడార్ నిఘా నుంచి తప్పించుకున్నాయి. వాటి ప్రయాణ వివరాలను కూడా వెల్లడించలేదు. ఇలా ఇరానియన్‌, వెనుజులియన్‌ షిప్పులు తరచూ ఇలా అదృశ్యమవుతున్నాయి. అవి నేరుగా ఐరోపా దేశాలకే వెళ్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అలా చేయాల్సిన అవసరం ఏమిటంటే.. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే అని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికీ రష్యన్‌ గ్యాస్‌నే ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో రష్యన్‌ గ్యాస్‌, చమురును కొనుగోలు చేయరాదంటూ ఇతర దేశాలపై ఐరోపా దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. తాము రష్యన్‌ గ్యాస్‌ను కొనుగోలు చేయడం లేదంటూ చిలకపలుకులు పలుకుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్‌ పెంచిందని తెలియడంతో.. అమెరికా, ఐరోపా దేశాలు.. భారత్‌ను కట్టడి చేయడానికి తీవ్రంగా యత్నించాయి. ఉక్రెయిన్‌కు ఢిల్లీ ద్రోహం చేస్తోందంటూ మండిపడుతున్నాయి. అయితే భారత్‌ మాత్రం చమురు ధరల విషయంలో ఘాటుగానే స్పందిస్తోంది. తాము పరోక్ష కొనుగోళ్లు చేయడం లేదంటూ పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ చురకలంటించారు. తమ దేశ ప్రయోజనాల కోసం బహిరంగంగా, నిజాయితీగానే కొనుగోలు చేస్తున్నామని స్ఫస్టం చేశారు. తమ దేశ ప్రజలు పేదలని, ధిక ఇంధన ధరలను భరించే శక్తి వారికి లేదని స్పష్టం చేశారు. ఐరోపా దేశాలు కొనుగోలు చేసిన దాని కంటే.. తాము రష్యా నుంచి తక్కువగానే చమురు కొనుగోలు చేసినట్టు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. పశ్చిమ దేశాలు అలా వ్యవహరించకపోతేనే ఆశ్చర్యపోవాలని.. ఇందులో కొత్తేమీ లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మార్కెట్లలో వెనుజులా, ఇరాన్ చమురు సరఫరా తగ్గడంతో సంక్షోభం నెలకొన్నది. అంతేకాకుండా. ఓపెక్‌ ప్లస్ నుంచి కూడా చమురు రోజువారి ఉత్పత్తిని లక్ష బ్యారెళ్లకు తగ్గించాలని నిర్ణయించింది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆ ధరలతో ముడి చమురును కొనుగోలు చేయాలంటే.. భారత్‌కు భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా చమురును కొనుగోలు చేయాలని ఢిల్లీ నిర్ణయించింది. అంతేకాకుండా... రష్యా కూడా భారత్‌కు డిస్కౌంట్‌పై చమురును విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యాకు భారత్ అనుకూలంగా వ్యవహిస్తున్నాయని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. తాము చేస్తున్న పనిని మాత్రం వెస్ట్‌ కంట్రీస్‌ సమర్థించుకుంటూ తమ రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories