బంగ్లాలో పావులు కదుపుతున్న సైన్యం..యూనస్ పాలనపై తిరుగుబాటు?


బంగ్లాలో పావులు కదుపుతున్న సైన్యం..యూనస్ పాలనపై తిరుగుబాటు?
Bangladesh Coup: బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతోందా?
Bangladesh Coup: బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతోందా? అక్కడి సైన్యం అధికారాన్ని కైవసం చేసుకోడానికి పావులు కదుపుతోందా? బంగ్లాతో పాటు భారత్‌లోనూ గుసగుసలు మొదలయ్యాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఏర్పడ్డ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మీద పెరిగిపోతున్న వ్యతిరేకత, అపనమ్మకం నేపధ్యంలో సైన్యం జోక్యం చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను అటు సైన్యం, ఇటు యూనస్ ఖండించారు. మరోవైపు ప్రధాని మోదీతో భేటీ కోసం యూనస్ ప్రయత్నాలు చేస్తుంటే, భారత్ ఇందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందా? ప్రసుత్తం అక్కడి మీడియా హాట్ హాట్‌గా ఈ అంశంపై కథనాలను వండేస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో హసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతో పాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. యూనస్‌ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు వరుసగా కథనాలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగ్లాలో సైన్యానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, విద్యార్థి నాయకులు స్వరం వినిపించారు. ఈక్రమంలోనే యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగనున్నట్లు సమాచారం అందింది. దీంతో దేశంలోని సైన్యం అలెర్ట్ అయ్యింది. ఢాకా అంతటా కట్టుదిట్టమైన గస్తీని ఏర్పాటుచేయడంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు పెట్టింది.
ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్- ఉజ్- జమాన్ నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్‌తో సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి బంగ్లా ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈక్రమంలో దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందనే దానిపై అధికారులు చర్చించారు. ఈసమావేశంలో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని యూనస్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆర్మీ అధికారులు నిర్ణయించారు. అంతేకాక.. సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తుంది.
అయితే ఈ వార్తలను బంగ్లాదేశ్ సైన్యం ఖండించింది. సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని తేల్చిచెప్పింది. మీడియా తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది. బంగ్లాదేశ్ సైన్యం సాధారణంగా నిర్వహించే ఒక సమావేశానికి తప్పుడు సమాచారం జోడించి ఈ కథనం రాశారని పేర్కొంది. ‘బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారుపై తిరుగుబాటుకు అవకాశాల నేపథ్యంలో బంగ్లాదేశ్ సైన్యం అత్యవసర సమావేశం’ అన్న శీర్షికతో ప్రచురితమైన వార్త పాత్రికేయ దుష్ప్రవర్తనకు నిదర్శనమని బంగ్లాదేశ్ సైనిక ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా చేసేందుకు సైన్యం ఒక ప్రణాళికను రూపొందిస్తుందని విద్యార్థి పార్టీలు ఆరోపించాయి. అయితే, వీటిని సైన్యం ఖండించింది.
తాజాగా మహమ్మద్ యూనస్ సైతం దీనిపై స్పందించారు. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మీడియాలో వందతుల పండగ కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకా పెరుగుతాయన్నారు. ‘గతేడాది జులై- ఆగస్టుల్లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఓడిపోయిన వారు ఈ వదంతులను సాధనాలుగా మార్చుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు ఈ తప్పుడు కథనాల వెనక ఎవరు ఉన్నారు, ఎవరు వీటిని నడిపిస్తున్నారనేది. వీటిని వ్యాప్తి చేసేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ.. 24 గంటలూ ఇదే పనిమీద ఉన్నారు. మనందరి ఐక్యత వారిని కల్లోలానికి గురిచేస్తుంది. దీన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. వారి వినూత్నమైన ఆటలకు ఎప్పుడు పావుగా మారతారో మీకే తెలీదు. మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నామని గుర్తుంచుకోండి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వదంతులు మరింత పెరిగిపోతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని యూనస్ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించే ఆలోచన ఏదీ లేదని యూనస్ ప్రభుత్వం వెల్లడించింది. హత్య, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు పాల్పడిన ఆ పార్టీకి చెందిన నేతలు కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌ల మధ్య ద్వైపాక్షిక భేటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఏడు దేశాలతో కూడిన బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ -బిమ్‌స్టెక్ కూటమి సమావేశం ఏప్రిల్ 3-4 మధ్య థాయ్‌లాండ్‌లో జరగనుంది. సందర్భంగా వీరు చర్చలు జరిపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇద్దరు నేతల మధ్య భేటీ కోసం బంగ్లా అధికారులు భారత విదేశాంగ శాఖను సంప్రదించారు. అయితే వీరిద్దరి మధ్య అధికారిక సమావేశం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తాజా సమాచారం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి ప్రతిరోజు ఏదో ఒక విమర్శలు వస్తున్న సమయంలో అధికారిక సమావేశం కష్టమే. పరిస్థితులు సమావేశానికి అనుకూలంగా లేవని భారత అధికారులు అంటున్నారు. మరోవైపు సదస్సుకు హాజరయ్యే నేతల మధ్య సమావేశాన్ని కొట్టిపారేయలేం. అంతకుమించి ఊహించడం లేదు అని కూడా చెబుతున్నారు. ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో యూనస్ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. చైనా- బంగ్లాల మధ్య సంబంధాల్లో మార్పునకు ఈ పర్యటన దోహదపడుతుందని ఢాకా అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల భారత్ పర్యటకు వచ్చిన అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఓ ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు హింసకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు ‘బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారీటీలపై దాడులు జరగడం అధ్యక్షుడు ట్రంప్‌నకు, ఆయన పరిపాలనకు ఆందోళన కలిగించే అంశం. దీనిపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంతో ట్రంప్ చర్చలు ప్రారంభించారు’ అని తులసీ గబార్డ్ పేర్కొన్నారు.
అయితే తులసి వ్యాఖ్యలను బంగ్లా తీవ్రంగా ఖండించింది. సరైన ఆధారాలు లేకుండా.. తప్పుదారి పట్టించే ప్రకటనను చేశారని పేర్కొంది. ‘తులసీ గబార్డ్ అన్యాయమైన బ్రష్‌తో దేశం మొత్తానికి మరకలు అంటించే ప్రయత్నం చేశారు. సరైన ఆధారాలు లేకుండానే ఆమె ఈ ఆరోపణలు చేశారు. బంగ్లా ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే తీవ్రవాద సవాళ్లను ఎదుర్కొంటుంది. మా భాగస్వామ్య దేశాల మద్దతుతో వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.’ అని పేర్కొంది.
అటు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై ఇటీవల తమ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ అమెరికా ఎలాంటి హింసనైనా.. మైనార్టీలపై వివక్షను ఖండిస్తుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకొన్న చర్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని తాము గమనిస్తున్నామని.. భవిష్యత్తులో కూడా ఆ దేశం వాటిని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



