logo
ప్రపంచం

కిమ్‌ కోటను వణికిస్తున్న కరోనా

Coronavirus Cases Increasing Rapidly in North Korea | Kim Jong Un | Live News Today
X

కిమ్‌ కోటను వణికిస్తున్న కరోనా

Highlights

North Korea: *వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్ *ప్రాణాపాయం తక్కువగా ఉండడంతో కిమ్‌కు ఊరట

North Korea: రెండేళ్ల తరువాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కోటలో కరోనా పాగా వేసింది. 2020 నుంచి కరోనాతో ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తుంటే... కిమ్‌ మాత్రం ఇన్నాళ్లు సైనిక బలగాన్ని పెంచుకోవడంతో పాటు ప్రమాదకరమైన క్షిపణులను పరీక్షిస్తూ.. కాలం గడిపాడు. వైరస్‌తో ఒకవైపు అల్లాడుతుంటే.. గత రెండేళ్లలో కిమ్‌ దేశంలో మాత్రం ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ ఈనెల 12న తొలికేసు నమోదైన తరువాత.. విలయతాండవం ఆడుతోంది.

నాలుగైదు రోజుల్లోనే వైరస్‌ విజృంభించింది. 24 గంటల్లో 12 లక్షలకు పైగా కేసులు నిర్ధారణయ్యాయి. ఒక్క రోజులోనే 50 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నా.. కిమ్‌ మాత్రం ప్రపంచ దేశాల సాయాన్ని ఇప్పటికీ కోరకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో ఉత్తర కొరియాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటివరకు టీకాలు తీసుకోకపోవడం... కనీస ఔషధాలు లేకపోవడంతో నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి.

కిమ్‌ పాలనలో ఇంతటి భారీ విపత్తు సంభవించడం ఇదే తొలిసారి. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ వేగంగా విజృంభిస్తున్నప్పటికీ.. మృతుల సంఖ్య మాత్రం అదుపులోనే ఉండడం కిమ్‌కు కలిసొస్తోంది. ఒకవేళ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపి ఉంటే.. మరణమృదంగం మోగేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరీక్షల నిర్వహణ శక్తి కిమ్‌ ప్రభుత్వానికి లేకపోవడంతో భారీగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మందులను పేదలకు అందజేస్తామని కిమ్‌ ప్రభుత్వం చెబుతోంది.

పలు దేశాల్లో ఒమిక్రాన్‌ విజృంభించినప్పటికీ.. కోవిడ్‌ వ్యాక్సిన్లతో ప్రజల్లో ఇమ్యూనిటీని భారీగా పెరిగింది. ఫలితంగా వైరస్‌తో ముప్పు తక్కువగా ఉంది. కానీ.. మొదట్లో సోకిన వేరియంట్ల ప్రభావం ఉత్తర కొరియన్లపై లేదని కొరియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిమ్‌ వోజూ తెలిపారు. కేవలం ఒమిక్రాన్‌ వేరియంట్ మాత్రమే సోకిందని.. మొత్తం జనాభాపై దాడి చేయనున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వైద్య ఆరోగ్య సేవలు దారుణంగా ఉన్నాయని.. ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉందన్నారు. టీకాలు, యాంటీ వైరల్‌ మందులు అందుబాటులో లేకపోవడంతో ఫలితాలు ప్రమాదకరంగా ఉండొచ్చని డాక్లర్‌ కిమ్‌ వోజూ వివరించారు.

ఉత్తర కొరియాలో ఆసుపత్రుల్లో చేరికలు భారీగా పెరుగుతున్నాయని.. భారీగా వైరస్‌ బాధితులు మృతి చెందే ప్రమాదం ఉందని.. అంతర్జాతీయ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జెరోమ్‌ కిమ్‌ తెలిపారు. ఇప్పటికే ఆహార కొరతో ఇబ్బంది పడుతున్న ఉత్తర కొరియన్లకు ఎలాంటి వ్యాక్సిన్లు, మందులు అందే అవకాశం లేదన్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి మెడిషన్లు అందుకోవడం తన అహంను దెబ్బతీస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా వైరస్‌తో ప్రజలు విలవిలలాడుతారని విశ్లేషిస్తున్నారు. గతంలో వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చైనా, రష్యా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చినా.. కిమ్‌ తిరస్కరించారు. తాజాగా కూడా దక్షిణ కొరియా, చైనా కరోనా కిట్లు, మందులను పంపిణీకి సంసిద్ధత వ్యక్తం చేసినా.. కిమ్‌ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

Web TitleCoronavirus Cases Increasing Rapidly in North Korea | Kim Jong Un | Live News Today
Next Story