China: జిన్‌జియాంగ్‌లో జీరో కోవిడ్‌ అరాచకం

Chinas Xinjiang city under a pandemic lockdown
x

China: జిన్‌జియాంగ్‌లో జీరో కోవిడ్‌ అరాచకం

Highlights

China: అకలి కేకలతో అల్లాడిపోతున్న ప్రజలు

China: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అంతమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2020తో పోల్చితే భారీగా కేసుల సంఖ్య పడిపోయిందని.. నిర్లక్ష్యం కారణంగానే కొన్ని దేశాల్లో కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. అయితే ఆ కేసుల విషయంలో భయపడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కానీ.. చైనాలో జీరో కోవిడ్‌ భయంకరంగా మారింది. జీరో కోవిడ్ పేరుతో జిన్‌ జియాంగ్‌ ప్రాంతంలో డ్రాగన్‌ కంట్రీ దారుణ నేరాలకు పాల్పడుతోందంటూ ఇటీవల ఐక్యరాజ్య సమితి-యూఎన్‌ ప్రకటించింది. అయితే యూఎన్‌ ప్రకటించిన నేరాల కంటే.. ఆ ప్రాంతంలో దారుణ ఘోరాలకు బీజింగ్‌ పాల్పడుతోంది. కరోనా ప్రారంభంలో నెలకొన్న పరిస్థితులే ఇప్పటికీ నెలకొన్నట్టు తెలుస్తోంది.

మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణ మృదంగం మోగించింది. 61 కోట్ల మంది వైరస్‌ భారిన పడ్డారు. 65 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని దారుణాలను మానవాళికి కోవిడ్‌ చూపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇప్పటికీ పలు దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ అంత్య దశకు చేరుకున్నట్టు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. తాజాగా 2020 మార్చి నుంచి ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా మరణాల సంఖ‌్యను పోలిస్తే... ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి చేరినట్టు తెలిపింది. కరోనా ముప్పు తొలగకపోయినా, ఈ మహమ్మారి ముగింపు మటుకు కనుచూపు మేరలోనే ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ తెలిపారు. అందుకు గత వారం రోజులుగా నమోదైన మరణాలే నిదర్శనమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వారం రోజుల్లో కేవలం 11వేల మరణాలే నమోదైనట్టు వివరించారు. కొత్త కేసులు 31 లక్షల మేర ఉన్నట్టు వెల్లడించారు. ఈ కేసులు కూడా.. కొన్ని దేశాల్లో కొవిడ్‌ పరీక్షలు, జాగ్రత్తల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నందున కేసులు బయటపడని ఉదంతాలు కూడా ఉన్నట్లు తెలిపారు. శీతాకాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగి, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే ఇప్పటిదాకా సాధించిన పురోగతి వృథా అవుతుందని టెడ్రోస్‌ హెచ్చరించారు.

ప్రపంచ దేశాలు కూడా కరోనాను లైట్‌ తీసుకుంటున్నాయి. కొత్త కేసులు నమోదవుతున్నా.. ప్రజలు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. భారత్‌లోనూ నిత్యం 5వేల నుంచి 6వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఏనాడో పట్టించుకోవడం మానేశాయి. కానీ.. చైనా అలా కాదు.. జీరో కోవిడ్‌ పేరుతో అతి కిరాతకంగా వ్యవహరిస్తోంది. తాజాగా జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో మరింత క్రూరమైన విధానాలను అమలు చేస్తోంది. 40 రోజులుగా జీరో కోవిడ్‌ పాలసీని అమలుచేస్తూ.. ఈ ప్రావిన్స్‌ను బీజింగ్‌ మూసేసింది. జిన్‌జియాంగ్‌ ప్రజలు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. జిన్‌జియాంగ్‌లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. కొందరు గత్యంతరం లేక.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాల్పడుతున్నారు. ఉపాధి లేక.. ఆకలి తీర్చుకునే మార్గంలే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బయటకు వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో బిల్డింగ్‌ల నుంచి దూకి బలవన్మరణ పాల్పడుతున్నారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో నిత్యకృత్యంగా మారాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు చైనీస్‌ సోషల్‌ మీడియాలో వెల్లుత్తుతున్నాయి. అక్కడి దారుణ పరిస్థితులు ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

సాధారణంగా ఒక్క కోవిడ్‌ కేసు నమోదైనా.. సీరియస్‌గా స్పందించి.. వెంటనే వేలాది మందిని క్వారంటైన్‌కు తరలిస్తుంది చైనా ప్రభుత్వం. కానీ.. జిన్‌జియాంగ్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ముఖ్య నగరాల్లో తప్ప.. మిగతా చోట్ల ఎలాంటి వసతులు లేవని ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రజలను వారి అదృష్టానికి చైనా ప్రభుత్వం వదిలేసింది. వైరస్‌ బారిన పడిన వారు మందులు లేక.. ఆహారం అందకనే చనిపోతున్నారు. 40 రోజులుగా ఇదే పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్లన్నీ మూతపడ్డాయి. వైరస్‌ బాధితులకు కేవలం చైనా సంప్రదాయ ఔషధాన్ని మాత్రమే అందిస్తున్నారు. అదైతే పెద్ద ఖర్చుతో కూడున్న విషయం కాదు.. అయితే ఈ ఔషధంతో ఎలాంటి ఉపయోగం లేదని నిపుణులు చెబుతున్నారు. జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉంటారు. వారి పట్ల డ్రాగన్‌ కంట్రీ వివక్ష చూపుతోందంటూ ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఇక్కడ చైనా పాల్పడుతున్న దురాగతాలను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అక్కడి ప్రజలను దారుణంగా అణచివేస్తున్నట్టు వెల్లడించింది. వారి హక్కులను హరించి వేస్తున్నట్టు మానవ హక్కుల విభాగం ఆరోపించింది. అయినా చైనా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. నిజానికి జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ స్వయం ప్రపత్తి కలిగినది. అయితే చైనా మాత్రం ఆ ప్రాంతాన్ని కూడా ఓ ప్రావిన్స్‌లానే చూస్తుంది. ఇతర ప్రావిన్సుల్లో కల్పిస్తున్న వసతులను మాత్రం ఇక్కడ కల్పించడం లేదు.

చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల మందిపైగా వైరస్‌ బారిన పడ్డారు. 24వేల 806 మంది వైరస్‌ బారిన పడి.. మృతి చెందారు. తొలిసారి కరోనా విజృంభించిన సమయంలోనే వైరస్‌ కట్టడికి జిన్‌పింగ్‌ ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే 2021 చివరి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ అదుపులోకి వచ్చింది. భారత్‌తో సహా పలు దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా ఏ దేశంలోనూ పెద్దగా కరోనా నిబంధనలు అమలు చేయడం లేదు. కానీ.. చైనా మాత్రం ఇప్పటికీ వైరస్‌ పేరు చెబితే ఉలిక్కిపడుతోంది. ఒక్క కేసు నమోదైతే.. వెయ్యి కేసులు నమోదవుతున్నట్టుగా భయాందోళనకు గురవుతోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. డ్రాగన్‌ మాత్రం వైరస్‌ను పారదోలేకపోతోంది. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. జిన్‌పింగ్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. జిన్‌పింగ్‌ ప్రభుత్వం చేస్తున్న ఓవర్‌ యాక్షన్‌కు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఎక్కడ లాక్‌డౌన్‌ ప్రకటిస్తారోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస లాక్‌డౌన్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధిని కోల్పోయి.. తినడానికి తిండిలేని పరిస్థితి నెలకొన్నది.

చైనా అక్కడి ముస్లింలను టార్గెట్‌ చేయడానికి అనేక కారణాలున్నాయి. నిజానికి జిన్‌ జియాంగ్‌ చైనాలో భాగంగా ఉన్నప్పటికీ అది స్వయం ప్రపత్తికలిగిన ప్రాంతం. వీగర్‌ ముస్లింల పాలనలో తాము జోక్యం చేసుకోమని చైనా పాలకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే డ్రాగన్‌ కంట్రీ మాత్రం ఒప్పందాలను విస్మరించింది. జిన్‌ జియాంగ్‌ను తమ దేశంలోని అన్ని ప్రావిన్సుల్లాగే అది కూడా ఓ ప్రావిన్స్‌ అన్నట్టుగా చూస్తోంది. అక్కడి ముస్లింలపై మత వివక్షను చూపుతోంది. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామని ఆందోళనలకు దిగిన వీగర్‌ ముస్లింలను చైనా ఉక్కుపాదంతో అణిచివేసింది. ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా నిర్బంధించింది. అక్కడి మహిళపై చైనా అధికారుల అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.. అక్కడి అకృత్యాలను బయటకు రాకుండా డ్రాగన్ తొక్కి పెడుతోంది. ఇన్నాళ్లు చైనా అదే పని చేసింది.. అయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం అధినేత మిచెల్‌ బాచిలెట్‌ చివరి నిమిషంలో విడుదల చేయడంతో మరిన్ని దారుణాలు బయటకు వస్తున్నాయి.

జీరో కోవిడ్ పాలసీ, జిన్‌జియాంగ్‌ మానవ హక్కుల విషయంలో చైనాను పలు దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. జీరో కోవిడ్‌ విధానమే సరైనదంటూ బీజింగ్‌ సమర్థించుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories