Top
logo

స్థానాలు మారిన ప్రపంచ కుబేరులు : ఒక్క స్థానం తగ్గిన బిల్ గేట్స్

స్థానాలు మారిన ప్రపంచ కుబేరులు : ఒక్క స్థానం తగ్గిన బిల్ గేట్స్
X
Bill Gates overtaken as world's second richest person
Highlights

తన దాతృత్వం తో ఒక స్థానం కోల్పోయారొకరు.. తన భార్యకు విడాకులిచ్చి భరణంగా భారీగా ఆస్తులు ఇచ్చినా ఒక స్థానం...

తన దాతృత్వం తో ఒక స్థానం కోల్పోయారొకరు.. తన భార్యకు విడాకులిచ్చి భరణంగా భారీగా ఆస్తులు ఇచ్చినా ఒక స్థానం పైకెదిగారు ఇంకొకరు. ప్రపంచ కుబేరులకు సంబంధించిన తాజా జాబితాలో చోటు చేసుకున్న విచిత్రమిది. మిలిండా అండ్ ఫౌండేషన్ కు 35 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం నుంచి మూడో స్థానం లోకి జారిపోయారు. అయితే, తన భార్యకు భారీ భరణాన్ని చెల్లించి కూడా ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని రెండో స్థానంలోకి ఎగబాకారు. మొదటి స్థానం లో ఉన్న అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ స్థానం మాత్రం పదిలంగా ఉంది. తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలియనీర్ ఇండెక్స్ తెలిపిన వివరాలివి. బిల్ గేట్స్ 107 బిలియన్ డాలర్లు ఆస్తితో ఉండగా, బెర్నార్డ్ ఆర్నాల్డ్ 108 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రస్తుతం ఉన్నట్టు బ్లూంబర్గ్ తెలిపింది.

కాగా, తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత, భారీగా భరణం చెల్లించినా, బెజోస్ 125 బిలియన్ డాలర్ల ఆస్తులతో అగ్ర స్థానంలోనే ఉన్నారు. ఆయన భార్య 40.3 బిలియన్ డాలర్లతో మహిళా ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో, మొత్తం మీద 22వ స్థానంలో ఉన్నారు. గేట్స్ తన సంపదలోని 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ కు విరాళం ఇవ్వగా ఆయన ఆస్తి తగ్గిపోయింది. ఇక ఈ సంవత్సరం అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలోనూ ఆర్నాల్ట్ తొలి స్థానంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా భారత దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తొలి స్థానాన్ని కొనసాగించారు. ఆయన సంపద మొత్తం 51.8 బిలియన్‌ డాలర్లు కాగా, ప్రపంచ వ్యాప్తంగా 13వ స్థానంలో అంబానీ ఉన్నారు. అంబానీ తరువాతి స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌ జీ 20.5 బిలియన్‌ డాలర్లతో భారత కుబేరుల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అజీమ్ ప్రేమ్ జీది 48వ ర్యాంకు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్‌ 92వ స్థానంలో, కోటక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కోటక్ 96వ స్థానంలో ఉన్నారని బ్లూంబర్గ్ పేర్కొంది.

Next Story