America: అమెరికాను ముంచేయనున్న సంక్షోభం

America still has an inflation problem | Telugu News
x

అమెరికాను ముంచేయనున్న సంక్షోభం

Highlights

America: నిత్యావసర ధరలు రెట్టింపు అయ్యే అవకాశం

America: ప్రపంచానికే సూపర్‌ పవర్ ఆర్థికంగా సంపన్న దేశం పలు దేశాలు సంక్షోభంతో కుంగిపోతున్నా అగ్రదేశానికి ఎలాంటి సెగలు తగల్లేదు ఇప్పటివరకు అమెరికా గురించి మనకు తెలిసిన నిజాలు కానీ పైన పటారం లోన లొటారం అన్న చందంగా అమెరికా పరిస్థితి మారింది. ప్రపంచం ఏమైనా నాకేంటి నేను మాత్రమే బాగుండాలనే నైజమున్న అగ్రదేశం ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఆహారం, చమురు ధరలు మండుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అనుమానంతో తాజా అమెరికా మార్కెట్లు వేల కోట్ల డాలర్లను నష్టపోయాయి. సంపన్నుల సంపద ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. తాజాగా ద్రవ్యోల్బణం డేటా విడుదలవడంతోనే అమెరికా ప్రజలను కొత్త భయాలు వెంటాడుతున్నాయి.

తమ గురించి ఎవరూ మాట్లాడకపోతే తాము మంచివారమని అంతా సాఫీగా జరుగుతున్నట్టు కొందరు భావిస్తారు. ఇప్పటి వరకు అమెరికా కూడా ఇలా భావించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి పాఠాలు బోధించే అమెరికా తాను కూర్చున్న కొమ్ము విరుగుతున్నా గుర్తించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గురించే జోరుగా చర్చ సాగుతోంది. పెడరల్‌ రిజర్వ్‌ తాజాగా నాలుగు నెలలకు సంబంధించిన ద్రవ్యోల్బణం వివరాలను వెల్లడించింది. మేలో 8.6 శాతం, జూన్‌లో 9.1 శాతం, జులైలో 8.5 శాతం, ఆగస్టులో 8.3 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్టు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు 5 శాతం పైగా ఉన్న ద్రవ్యోల్బణం మన దేశంలో 6 శాతానికి చేరుకున్నది. దీంతోనే దేశంలో నిత్యావసరాలు, చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అదే 8 శాతానికి చేరుకుంటే ఇక సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా అమెరికాలో అవే పరిణామాతో ప్రజలు అల్లాడుతున్నారు. నిజానికి గత 4 నెలల ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆగస్టులో తగ్గింది. అయినా అక్కడ ప్రజల్లో భయాందోళనలు మాత్రం పెరుగుతున్నాయి.

అమెరికాలో ప్రజలు భయపడడానికి మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మార్కెట్లు అంచనాలకు తగ్గట్టుగా పరిస్థితులు లేకపోవడం అంటే 8 శాతం ద్రవ్యోల్బణం ఉందని లెక్కలు చెబుతున్నా వాస్తవానికి అంతకు మించి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. రెండో కారణం నిత్యావసరాల ధరలు జూలై నుంచి పోల్చితే 0.1 శాతం పెరిగాయి. అంటే ధరల్లో ఎలాంటి తగ్గుదల లేదు మూడో కారణం ప్రధాన ద్రవ్యోల్బణం సగటు వినియోగదారుల కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడమే. జూన్‌, జులైలో 5.9 శాతంగా నమోదైన ప్రధాన ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.3 శాతానికి చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం అమెరికన్లు ఆశించిన రీతిలో లేదు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గించాలని మార్కెట్‌ వర్గాలు కోరుతున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను వడ్డించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ విషయం బయటకు పొక్కగానే మార్కెట్లు ఏకంగా 9వేల 300 కోట్ల డాలర్లను సంపదను నష్టపోయాయి. అమెరికాకు చెందిన సంపన్నులు జెఫ్‌ బేజోస్‌, ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జూకర్‌ బర్గ్, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు వేల కోట్ల రూపాయలను కోల్పోయారు.

తాజా అమెరికా సెంట్రల్ బ్యాంకు నిర్ణయంతో రుణాల చెల్లింపులు, పెట్టుబడులు పడిపోయాయి. లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా పయనించనున్నది. ఈ నేపథ్యంలో అమెరికాలో నెలకొంటున్న సంక్షోభాన్ని నివారించడానికి బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి విజయం సాధించినట్టు బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు 43వేల కోట్ల డాలర్లను బైడెన్ ప్రకటించారు. నెల క్రితం తాను ద్రవ్యోల్బణానికి తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నట్టు బైడెన్‌ తెలిపారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దారుణంగా మారుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ప్రభావం ప్రపంచ దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లోని నిఫ్టీ 0.3 శాతానికి పడిపోయింది. జపాన్‌కు చెందిన నికాయ్ 2.8 శాతానికి, ఉత్తర కొరియాకు చెందిన కాస్పీ 1.56 శాతం షాంగై కాంపోజిట్‌ 0.8 శాతం నష్టాలతో ముగిశాయి.

అమెరికా ఆర్థిక సంక్షోభం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఇప్పుడు 80 రూపాయలు ఉంది. ఆ దేశ సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచితే డాలర్‌ విలువ మరింత పెరుగుతుంది. అంటే ఇది కాస్తా మరో 2 నుంచి 4 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. దీంతో భారీగా దిగుమతులు చేసుకుంటున్న భారత్‌ కొన్ని వేల కోట్ల రూపాయలను చెల్లిస్తోంది. ఒక్క రూపాయి పెరిగినా భారత్‌పై తీవ్ర ప్రభావం పడనున్నది. చమురు, ఇతర దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. దీన్నే దిగుమతి సంక్షోభం అంటారు. ఇలాంటి పరిస్థితి కారణంగానే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అమెరికా సంక్షోభం కారణంగా భారత్‌లో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసరాలు, చమురు ధరలు ఆశాన్నంటుతున్నాయి. ఇవి సమీప భవిష్యత్తులో ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సామాన్యుల నడ్డీ విరగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇక వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడుదారులు అస్థిర ఆస్తులైన ఈక్విటీలు, క్రిప్టో కరెన్సీలు, వస్తువుల కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపరు. దీంతో మార్కెట్లకు భారీ నష్టం వాటిల్లుతుంది.

అమెరికా ఆర్థిక సంక్షోభంతో ముంచుకొస్తున్న ముప్పును భారత్‌ ఎలా ఎదుర్కొంటున్నదన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి భారత రిజర్వ్‌ బ్యాంకు ఈ సమస్య అత్యంత క్లిష్టమైనదే. భారత్‌కు చెందిన హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం జులైలో 13.93 శాతంగా, ఆగస్టులో 12.41 శాతంగా నమోదయ్యింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం జులైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతంగా నమోదయ్యింది. వీటి ద్వారా భారతీయ మార్కెట్లు అటు లాభాలు, ఇటు నష్టాలతో ఆర్‌బీఐకి మిశ్రమ సందేశాలను ఇస్తున్నాయి. అందుకు భారత్‌లో ఆర్థిక వృద్ధి నమోదవడమే కారణం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ 13.5 శాతం నమోదయ్యింది. అయితే అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులను ఆర్‌బీఐ ఎలా పరిష్కరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకపోతే మాత్రం దిగుమతుల ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రూపాయి మరింత పతనమై మార్కెట్లు భారీగా నష్టపోతాయని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే మాత్రం ఆర్థిక వృద్ధి రేటు పడిపోనున్నది. అయితే వడ్డీ రేట్లను పెంచేందుకే ఆర్‌బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే అందుకు సంకేతాలు ఇచ్చారు. దీంతో భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మొత్తంగా ఉక్రెయిన్‌ యుద్ధంతో మొదలైన ప్రపంచ ఆర్థిక మాంద్యం అమెరికా ద్రవ్యోల్బణంతో మరింత ప్రమాదకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోనున్నాయి. సమీప భవిష్యత్తులో మరెన్నే దేశాలు శ్రీలంక బాట పట్టనున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories