మైండ్ గేమ్ ప్రారంభించిన వైసీపీ...ఏపీ లో రివర్స్ గేర్ లో వలసలు

మైండ్ గేమ్ ప్రారంభించిన వైసీపీ...ఏపీ లో రివర్స్ గేర్ లో వలసలు
x
Highlights

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పవన్ కల్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా స్పష్టత రానప్పటికీ, తెలుగుదేశం,...

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పవన్ కల్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా స్పష్టత రానప్పటికీ, తెలుగుదేశం, వైసీపీ మధ్య పోరు మాత్రం జోరుగా సాగుతోంది. మొన్నటి వరకూ తెలుగుదేశంలోకి వలసలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అలా ఎందుకు జరుగుతోంది ? వలసల్లో ఎవరు కీలకపాత్ర వహిస్తున్నారు? ఎందుకు ఇంతగా వలసలు చోటు చేసుకుంటున్నాయి? అది దేనికి సంకేతం? ఏపీలో వైసీపీ టీఆర్ఎస్ తరహా వ్యూహాన్ని అనుసరిస్తుందా?

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఏళ్ళుగా టీడీపీలో ఉన్న వారు ఒక్కసారిగా ఫ్యాన్ కింద సేద తీరేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబునాయుడు ఇకపై ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది కీలకంగా మారింది.

గత కొన్ని రోజులుగా రకరకాల ప్రజాకర్షక పథకాలను ప్రకటించడంలో చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడంలో హడావుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో సాధారణంగా విపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడం సహజం. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో అలానే జరిగింది. విపక్షాలకు చెందిన నాయకులు భారీసంఖ్యలో అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. మొన్నటి వరకూ వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు భారీగా టీడీపీలో చేరారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా గాలి మారిపోయింది. రివర్స్ వలసలు మొదలయ్యాయి. ఇక దీన్ని అడ్డుకునేందుకు అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎలాంట ి చాణక్యం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పార్టీల్లోకి వలసలు జరగడం సహజమే. అయితే ఈ వలసలు ఏకపక్షంగా ఉంటే మాత్రం బాధిత పార్టీకి ఇబ్బందికరమే. కొంతకాలం క్రితం దాకా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జోరుగా వలసలు కొనసాగాయి. ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు తమ విధేయత మార్చుకున్నారు. అందులో కొందరు ఏకంగా మంత్రిపదవులు కూడా పొందారు. దీంతో వైసీపీ తీవ్ర ఆందోళనకు గురైంది. సరిగ్గా ఈ సమయంలోనే ఎన్నికలు దగ్గరపడ్డాయి. చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన విజయసాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పై ఆకర్షణ అస్త్రం సంధించారు. రకరకాల కారణాలతో తెలుగుదేశం పట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో చర్చలు జరిపారు. వారిని వైసీపీలోకి వచ్చేలా చేశారు. వలస వచ్చిన నేతలంతా మొదట విజయసాయిరెడ్డితోనే చర్చలు జరిపారు. ఆ తరువాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఛోటా మోటా నాయకులు పార్టీని వీడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉన్న నాయకులు, మొదటి నుంచీ పార్టీకి అండగా నిల్చిన నాయకులు కూడా వైసీపీ వైపు చూడడం తెలుగుదేశాన్ని కలవరపరుస్తోంది. గత కొన్ని రోజుల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వీరిలో ఉన్నారు. అదే విధంగా ఇద్దరు ఎంపీలు కూడా వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పి.రవీంద్ర బాబు వీరిలో ఉన్నారు. ఇక ఆళ్ళగడ్డ నుంచి రాంపుల్లారెడ్డి లాంటి బలమైన నాయకులు కూడా వైసీపీలో చేరారు. ఈ జాబితా రోజురోజుకు పెరగడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. మరో వైపున ఇలా వెళ్ళిపోయిన వారంతా కూడా టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయడం కూడా తెలుగుదేశం పార్టీకి డామేజ్ చేసే అంశంగా మారిపోయింది.

ఏపీ రాజకీయాలు రెండు ప్రధాన కులాల చుట్టూ తిరుగుతుంటాయి. అదే సమయంలో బీసీలు కూడా కీలకపాత్ర పోషిస్తుంటారు. తాజాగా కాపు కులం వారిని ఆకట్టుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఆ కులానికి చెందిన వారు టీడీపీ పై క్రమంగా నమ్మకాన్ని కోల్పోతున్నారు. తమను బీసీల్లోకి చేర్చాల్సిందిగా ఆ కులం వారు కోరుతున్నారు. టీడీపీ మాత్రం అగ్రకులాల కోటాలో 5 శాతం కేటాయించి వారిని చల్లబర్చాలని చూసింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సూచనల మేరకు కాపు వర్గం తెలుగుదేశానికి కొంతమేరకు అండగా నిలిచింది. ఈ దఫా మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరో వైపున బీసీలకు, తెలుగుదేశం పార్టీకి మధ్య అంతరం కూడా పెరిగిపోతున్నది. అలాంటి వారు సైతం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. మొదటి నుంచి కూడా బీసీలు టీడీపీ కి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు బీసీలను కూడా వైసీపీ వైపు మార్చేలా ప్రయత్నాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్, వైసీపీ మధ్య ప్రత్యక్ష పొత్తు ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్ష రాజకీయాలకు టీఆర్ఎస్ దూరంగా నే ఉంటోంది. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడాన్ని టీఆర్ఎస్ ఎంతో తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే రిటర్న్ గిఫ్ట్ అందిస్తామంటున్న టీఆర్ఎస్ నాయకులు ఏపీలో బీసీలను తెలుగుదేశానికి దూరం చేసేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. ప్రముఖ బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య లాంటి వారు ఇప్పటికే చంద్రబాబుకు దూరమయ్యారు. ఇవన్నీ పరోక్షంగా వైసీపీకి ప్రయోజనం చేకూర్చనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories