ఎవరీ సంజయ్ బారు... మన్మోహన్‌తో సాన్నిహత్యమేంటి?

ఎవరీ సంజయ్ బారు... మన్మోహన్‌తో సాన్నిహత్యమేంటి?
x
Highlights

సంజయ్‌ బారు. మన తెలుగువాడు. పక్కా హైదరాబాదీ. రాజకీయ వ్యాఖ్యాత, విశ్లేషకుడు. ఫిక్కీ ప్రధాన కార్యదర్శిగా, ఐఐఎస్ఎస్‌లో జియో ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజీ...

సంజయ్‌ బారు. మన తెలుగువాడు. పక్కా హైదరాబాదీ. రాజకీయ వ్యాఖ్యాత, విశ్లేషకుడు. ఫిక్కీ ప్రధాన కార్యదర్శిగా, ఐఐఎస్ఎస్‌లో జియో ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా సేవలందించారు. ది ఎకనామిక్ టైమ్స్‌, టైమ్స్ ఆఫ్ ఇండియాకు, అసోసియేట్ ఎడిటర్‌గా, బిజినెస్ స్టాండర్డ్‌కు చీఫ్‌ ఎడిటర్‌గా పని చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా మే, 2004 నుంచి చాలా ఏళ్ల వరకు, మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పని చేశారు.

2004లో పీఎంగా మన్మోహన్‌ బాధ్యతలు చేపడుతున్న వేళ, స్వయంగా ఆయనే ఫోన్‌ చేసి, హైదరాబాద్‌లో అప్పడే ఫ్లైట్‌ దిగిన సంజయ్ బారును ఢిల్లీకి రప్పించుకున్నారు. తనకు మీడియా సలహాదారుగా పని చేయాలని కోరారు. సంజయ్ బారుతో ఎందుకంత బంధమంటే, సంజయ్ బారు నాన్న బీపీఆర్ విఠల్, మన్మోహన్‌తో కీలక ప్రభుత్వ విభాగాల్లో పని చేశారు. సంజయ్‌ బారు గురించి బాగా తెలిసిన మన్మోహన్‌, ఏరికోరి తన మీడియా అడ్వైజర్‌గా నియమించుకున్నారు.

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు, ఎన్నో ఏళ్లు దగ్గరుండి చూశారు సంజయ్ బారు. అనేక కీలక నిర్ణయాల విషయమై, మన్మోహన్‌తో చర్చించానని, గొడవ కూడా పడ్డానని ఇంటర్వ్యూల్లో తన అనుభవాలను పంచుకున్నారు. మన్మోహన్‌ మానసిక సంఘర్ణణను అత్యంత సన్నిహితంగా గమనించానని చెప్పుకున్నారు. అయితే, మీడియా సలహాదారు పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత, కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న సంజయ్ బారు, 2014లో ది యాక్సిడెంటల్‌ ప్రైమ్ మినిస్టర్‌ అన్న పుస్తకం రాసి, సంచలనం సృష్టించారు.

సరిగ్గా 2014 ఎన్నికల ముంగిట్లో పెంగ్విన్ సంస్థ, బారు పుస్తకాన్ని రిలీజ్ చేసింది. మన్మోహన్ సింగ్ జీవితం, ఆర్థిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన అదించిన సేవలు వంటివి పుస్తకంలో చోటుచేసుకున్నాయి. అయితే, మన్మోహన్‌ను సోనియా కీలుబొమ్మగా ఆడించి, మన్మోహన్‌ పేరుతో పెత్తనం చెలాయించారని అందులో రాశారు. మన్మోహన్‌కు క్లీన్‌చీట్‌ ఇచ్చి, యూపీఏ రెండు టర్మ్‌‌లలో వెలుగుచూసిన కుంభకోణాల్లో, ఆయన పాత్రేమీలేనట్టుగా చూపారు. మన్మోహన్ దగ్గర పని చేసి, తన అనుభవాలను పుస్తకం రూపంలో వెల్లడించడంతో, సహజంగానే పుస్తకంపై అందరి దృష్టిపడింది. 2014 ఎన్నికల మూమెంట్‌లో, ఈ పుస్తకం బీజేపీకి ఆయుధమైంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ, ఈ పుస్తకంలోని విషయాలను ప్రస్తావిస్తూ, ప్రధాని అభ్యర్థిగా మోడీ, సోనియా, రాహుల్‌, ప్రియాంక, రాబర్ట్ ‌వాద్రాలపై అనేక ఆరోపణలు చేశారు. ఈ పుస్తకాన్ని అప్పుడే కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పుస్తకంలో అన్నీ కల్పితాలేనని వ్యాఖ్యానించింది. కానీ అన్నీ వాస్తవాలనీ, తన అనుభవాలే రాశానని సంజయ్ బారు చెప్పుకున్నారు. ఇదే పుస్తకం ఆధారంగా, ఇప్పుడు ది యాక్సిడెంటల్‌ ప్రైమ్ మినిస్టర్ సినిమా తీశారు. విజయ్ రత్నాకర్‌ గుట్టే దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా కాంట్రావర్సీపై వ్యాఖ్యానించేందుకు, నిరాకరించారు సంజయ్.

పీఎంవో కార్యాలయాల్లో పని చేసిన మాజీ ఐఏఎస్‌లు, పుస్తకాలు రాయడం, అవి సంచలనంగా మారడం మామూలే. గతంలోనూ అనేక పుస్తకాలు వివాదమయ్యాయి. పుస్తకాలు కేవలం విద్యాధికులే చదువుతారు. అవి కాస్త సినిమాల రూపంలో వస్తే, క్షేత్రస్థాయిలో సామాన్య జనానికీ వెళతాయి. సామాన్య జనాలకు తమ కుటుంబాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నదే సోనియా, రాహుల్‌ల ప్రశ్న. కానీ సినిమాను సినిమాగా చూడాలని గతంలో కాంగ్రెస్‌ చెప్పిన మాటలనే, గుర్తు చేస్తూ అటాక్ చేస్తోంది బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories