బెంగాల్‌ వర్సెస్‌ సీబీఐ : కేంద్రానికి గవర్నర్‌ నివేదిక

బెంగాల్‌ వర్సెస్‌ సీబీఐ : కేంద్రానికి గవర్నర్‌ నివేదిక
x
Highlights

పశ్చిమ్ బెంగాళ్‌లో సీబీఐ ఎపిసోడ్ రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ విషయంలో మమతాబెనర్జీ సీబీఐ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగగా బీజేపీ నేతలు సైతం...

పశ్చిమ్ బెంగాళ్‌లో సీబీఐ ఎపిసోడ్ రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ విషయంలో మమతాబెనర్జీ సీబీఐ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగగా బీజేపీ నేతలు సైతం ప్రతివిమర్శలు చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీ ఒక రహస్య నివేదికను కేంద్ర హోంశాఖకు పంపించారు.

శారదా చిట్‌ఫండ్ కేసులో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లడంతో కోల్‌కతాలో హైడ్రామా మొదలయింది. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేంద్రం సీబీఐని ఉసిగొల్పుతోందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె చేపట్టిన ఈ ధర్నాకి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది.

కేంద్ర ప్రభుత్వ వేధింపులకు వ్యతిరేకంగా మడం తిప్పని పోరాటం కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే కానీ, సీబీఐ కాదని అన్నారు. కేంద్ర సంస్థల బాధితురాలిగా రాష్ట్రం మారుతోందంటూ మండిపడ్డారు. ధర్నా వేదక నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని మమత చెప్పారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అన్ని ప్రభుత్వ సంస్థలను కేంద్రం ఉసి గొలుపుతూ ప్రజాస్వామ్యాన్ని కళంకిత చేస్తోందన్నారు. ప్రజలను భయపట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. ధర్నా వేదిక నుంచి కదలేది లేదని తెగేసి చెప్పారు. ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని తెలిపారు.

పశ్చిమ బెంగా‌ల్‌లో కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా తృణమూల్‌ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. సభ ప్రారంభం కాగానే టీఎంసీ ఎంపీలు కోల్‌కతా వ్యవహారాన్ని లేవనెత్తారు. తాజా పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ సీబీఐ అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. కోల్‌కతా ఘటన దేశ రాజకీయ వ్యవస్థకు ముప్పు లాంటిదని అన్నారు. శారదా కుంభకోణంలో బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిందనే విషయాన్ని ప్రస్తావించారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించడం కోసం మమతా బెనర్జీ చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

సీబీఐ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ భారత సమాఖ్య నిర్మాణాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను ప్రత్యర్థి పార్టీలపై ఉసిగొల్పుతూ, ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

సీబీఐని పశ్చిమ్ బెంగాళ్ ప్రభుత్వం అడ్డుకోవడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ రాష్ట్రంలోకి రావడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ్ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగడాన్ని ఆమె తప్పుబట్టారు.

కోల్‌కతా‌ ఘటన నేపథ్యంలో తమ కేసును తక్షణ విచారణకు చేపట్టాలన్న సీబీఐ అభ్యర్థనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తోసిపుచ్చారు. సీబీఐ అధికారుల అరెస్టుపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు. సీబీఐ అధికారులను అన్యాయంగా అరెస్టు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ లొంగిపోయేలా అదేశాలివ్వాలని కోరారు. విచారణ ఆధారాలను రాజీవ్ కుమార్ మరుగునపడేలా చేశారని వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ వాటికి ఆధారాలు ఉంటే చూపాలని సీబీఐని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories