తెలంగాణ రివైండ్@2018.. ఏడాది చెప్పిన నిజాలు

తెలంగాణ రివైండ్@2018.. ఏడాది చెప్పిన నిజాలు
x
Highlights

తెలంగాణ రాష్ట్రాన 2018లో అతి ముఖ్యమైన పొలిటికల్‌ డెలప్‌మెంట్‌ ఎన్నికలు. ప్రతిపక్షాల ఊహకు ఏమాత్రం అందకుండా... ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎన్నికలను...

తెలంగాణ రాష్ట్రాన 2018లో అతి ముఖ్యమైన పొలిటికల్‌ డెలప్‌మెంట్‌ ఎన్నికలు. ప్రతిపక్షాల ఊహకు ఏమాత్రం అందకుండా... ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎన్నికలను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... తెలంగాణ రాజకీయాన్ని అనూహ్యంగా వేడెక్కించారు. పదునైన మాటలను తూటాల్లా వదులుతూ... విపక్షాలను టార్గెట్‌ చేస్తూ... ఎందుకు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందో చెబుతూ... పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ను మార్చేశారు.

రాస్కో సాంబ.. వందకు వంద సీట్లు మావే నంటూ టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ విపక్షాలకు సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దు తర్వాత మీడియా ముందుకొచ్చిన కేసిఆర్ తాము ముందస్తుకు వెళ్లడానికి కారణాలను వివరించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ పురోగతిని గణాంకాలతో సహా ప్రస్తావించడమే కాదు.. అసంపూర్తిగా మిగిలిన సంక్షేమ పథకలపైనా తనదైన రీతిలో స్పందించారు. ముందస్తు ఎన్నికల గంట మోగించి కేసిఆర్ తెలంగాణ రాజకీయాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. చెప్పినవే కాదు.. చెప్పనివీ చేశామంటూ ప్రజల ముందు తమ ప్రభుత్వ పనితీరును చాటుకున్నారు.

తెలంగాణ రాజకీయాన్ని ఎన్నికల తెరపై ఆవిష్కరించిన దృశ్యం. రాజకీయ సమరాంగణమున కేసీఆర్‌ను ఓడించేందుకు విపక్షాలన్నీ ఒక్కటవగా... కేసీఆర్‌ మాత్రం ఒక్కడై నిలిచాడు. అంతే కాదు గెలిచాడు. ప్రతిపక్షాల నుంచి పోటీ చేసిన హేమాహేమీలను, ఉద్దండ పిండాలను ఎన్నికల ఊబిలోకి నెట్టేసిన కేసీఆర్‌.... మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

టీఆర్ఎస్ బలం, బలగం కేసీఆరే. తనకున్న సానుకూలాంశాలను బేరీజు వేసుకునే, కాన్ఫిడెన్స్‌తో ముందస్తుకు సై అన్నారు గులాబీ బాస్. కేసీఆర్ వర్సెస్‌ ఎవరక్కడా అన్నట్టుగా సాగిన సమరంలో, గులాబీ బాస్‌కే పట్టం కట్టారు జనం. అసెంబ్లీ రద్దు తర్వాత ప్రజాశీర్వాదం పేరుతో బహిరంగ సభలు మొదలుపెట్టి శంఖారావం పూరించారు. అసలు ప్రత్యర్థుల ఊహకందకుండా, జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లారు. ప్రజాకూటమికి అందనంత దూరంలో కారును పరుగులు పెట్టించారు. కేసీఆర్‌ మాటే మంత్రం. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్‌ చేసింది, ప్రజాకూటమి వస్తే రాష్ట్రం ఏమవుతుందన్న యాంగిల్‌లో ప్రసంగించారు. కరెంటు, సంక్షేమ పథకాలు, అభివృద్ది ఆగిపోతాయని మాట్లాడారు. జనంలో ఈ మాటలు బాగా ప్రభావం చూపాయనడానికి, చరిత్ర సృష్టించేలా వెల్లడైన ఫలితాలే నిదర్శనం.

ఇక- శాసనసభ విజయంతో, మాంచి ఊపుమీదున్న గులాబీ దళాధిపతి, ఇక హస్తిన సామ్రాజ్యంపై దండెత్తుందుకే సకల అస్త్రాలూ సిద్దం చేసుకోవడం ఈ ఏడాది మరో విశేషం. బీజేపీ, కాంగ్రెస్‌ కూటములకు దీటుగా మరో ఫ్రంట్‌ పెట్టేందుకు చకచకా పావులు కదిపారు. ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి, ఫెడరల్‌ ప్రంట్‌‌ ప్రయత్నాలు స్పీడప్ చేశారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనపై జాతీయస్థాయిలో హాట్‌హాట్‌గా చర్చ సాగుతోంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. టీఎంసీ అధినేత మమత, డీఎంకే స్టాలిన్, జేడీఎస్‌ దేవేగౌడ, ఎస్పీ అఖిలేష్‌ యాదవ్‌లను కలిశారు. అయితే ఇప్పడు వీరిలో ఎస్పీ, బీఎస్పీ తప్ప మిగిలిన పార్టీ నేతలంతా, మొన్న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ కూటమి సమావేశానికి హాజరయ్యారు. మరి కేసీఆర్‌తో వచ్చే పార్టీలేవీ అన్న దానిపై చర్చ జరుగుతోంది.

ఇక ఈ ఏడాది గులాబీ పార్టీలో మరో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ తన స్థానాన్ని కార్య నిర్వాహక అధ్యక్షుడి హోదాలో తనయుడికి కట్టబెట్టడం. అసెంబ్లీలో తిరుగులేని విజయంతో, అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు కొత్త నాయకుడి మార్గనిర్దేశనంతో ముందుకు సాగుతుంది. ఆ సారథే కేటీఆర్‌ సన్నాఫ్‌ కేసీఆర్‌.

జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో పని భారం ఎక్కువగా ఉందని, అందుకే కేటీఆర్‌‌కు పార్టీ బాధ్యతలు అప్పగించానని కేసీఆర్ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధానకర్తగా కేటీఆర్ ఉంటారని స్పష్టత ఇచ్చారు. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధంచేయడం, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగతంగా టీఆర్‌ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతను కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కేటీఆర్‌కు సూచించారు.

మరో కీలకమైన అంశం. హైకోర్టు విభజన. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఏ రాష్ట్రానికి ఆ హైకోర్టే ఉంటుందని కేంద్రం నోటిఫై చేసింది. దీనిపై తెలంగాణ, ఏపీ న్యాయవాదుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవగా... ఎలాంటి వసతులు లేకుండా పనులు ఎలా చేస్తామంటూ ఏపీ లాయర్లు భగ్గుమన్నారు. ఏమైనా వచ్చే ఏడాది తొలి రోజు నుంచే ఏపీ హైకోర్టు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో 2019 జనవరి 1 నుంచి విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. తెలంగాణకు 10మంది, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల విభజన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 1500 మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్‌బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను ఇరు హైకోర్టులకు కేటాయించనున్నారు. వీరి నుంచి ఆప్షన్ల స్వీకరణ కూడా పూర్తయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories