కొలువుదీరిన తెలంగాణ కొత్త కేబినెట్‌

కొలువుదీరిన తెలంగాణ కొత్త కేబినెట్‌
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన 66 రోజుల తర్వాత తెలంగాణ మంత్రివర్గం కొలువుదీరింది. తొలి విడతలో తనతో పాటు మహమూద్‌అలీకి చోటు కల్పించిన సీఎం...

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన 66 రోజుల తర్వాత తెలంగాణ మంత్రివర్గం కొలువుదీరింది. తొలి విడతలో తనతో పాటు మహమూద్‌అలీకి చోటు కల్పించిన సీఎం కేసీఆర్‌... రెండో విడతలో తాజాగా పదిమందికి చోటు కల్పించారు. తొలిసారిగా ఆరుగురు ఎమ్మెల్యేలకు అమాత్యయోగం పట్టింది. సామాజిక సమీకరణలు పరిగణనలోకి తీసుకొని లెక్క తప్పకుండా పక్కా పకడ్బందీగా మంత్రివర్గాన్ని విస్తరించారు... తన మార్కు చూపించారు కేసీఆర్‌.

తెలంగాణ కేబినెట్‌ విస్తరణతో ఉత్కంఠకు తెరపడింది. రాజ్‌భవన్‌ వేదికగా ఉదయం పదకొండున్నర గంటలకు పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళకు తానే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. అమాత్య పదవులు అందుకున్న వారిలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌, వి. శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేమకూర మల్లారెడ్డిలు ఉన్నారు. అనుభవానికే పెద్దపీట వేసిన కేసీఆర్‌... అమాత్యులుగా వారినే ఎన్నుకున్నారు.

ఇక- మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేల విషయానికొస్తే... వనపర్తి నుంచి తొలిసారి ఎన్నికైన నిరంజన్‌రెడ్డి గత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మొదటి నుంచి పార్టీలో ఉండటం, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో అమాత్య యోగం పట్టింది. ఇక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 2001 నుంచి టీఆర్ఎస్‌లోనే ఉన్నా... 2014లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేసి ఇప్పుడు మంత్రి అయ్యారు.

మొదటి నుంచి టీఆర్ఎస్‌లోనే ఉన్న ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల ఈశ్వర్ వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేసిన అనుభవం ఇప్పుడు మంత్రిని చేసింది. పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి మూడు టర్మ్‌లు వర్ధన్నపేట నుంచి, రెండోసారి మూడుసార్లు పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డబల్ హ్యాట్రిక్ సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరి 2019లో మంత్రి పదవి సాధించారు.

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి 2014లో మొదటిసారి గెలుపొందారు. గత ప్రభుత్వంలో విద్యుత్, షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ది శాఖల మంత్రిగా పని చేయడం, కేసీఆర్‌ సన్నిహితుడు కావడం కలిసి వచ్చింది. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అనుభవం, మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అచ్చొచ్చింది. నిర్మల్‌ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి గతంలో రెండుసార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో బీఎస్పీ నుంచి ఎన్నికై పార్టీని టీఆర్ఎస్‌లో చేరారు. గత ప్రభుత్వంలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యారు.

మేడ్చల్‌ గెలిచిన చామకూర మల్లారెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇంతలోనే అనూహ్యంగా అమాత్యయోగం పట్టింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్ 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఉద్యోగ సంఘం నాయకునిగా పనిచేశారు. ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పనిచేసిన అనుభవంతో పాటు.. 2014 ప్రభుత్వంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల నిర్వహించడం కలసివచ్చింది.

మొత్తానికి రెండో విడత విస్తరణలో... రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదుగురికి, బీసీల నుంచి ముగ్గురికి, ఎస్సీ నుంచి ఒకరు, వెలమ నుంచి మరోకరికి చోటు దక్కింది. ఉమ్మడి పాలమూరు కరీంనగర్‌‌ల నుంచి ఇద్దరిద్దరికి, ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ నుంచి ఒక్కొకరికి ఛాన్స్‌ వచ్చింది.

రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం అంటే 120 మందిలో సీఎంతో కలిపి 18 మందికి క్యాబినెట్లో చోటు కల్పించే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం 10 మందితో కలిపి మంత్రివర్గంలో మొత్తం 12 మంది అయ్యారు. ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. వీటిని లోక్‌సభ ఎన్నికల తరవాత భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీలకు, మహిళలకు క్యాబినెట్లో చోటు కల్పించడంలాంటి సామాజిక సమీకరణాలపై ముఖ్యమంత్రి అప్పుడే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి చోటు దక్కని మరికొంత మందికి అప్పుడు చాన్స్‌ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories