కాషాయంలోనైనా గీత కుదురుగా ఉంటారా?

కాషాయంలోనైనా గీత కుదురుగా ఉంటారా?
x
Highlights

పేరుకు బెస్ట్ పార్లమెంటేరియన్...కాని ప్రజలకు మాత్రం అందుబాటులో లేని పొలిటీషియన్. పార్టీలు మారడం జస్ట్ కామన్...వివాదాలు సృష్టించడంలో మోస్ట్‌ సెన్సేషన్....

పేరుకు బెస్ట్ పార్లమెంటేరియన్...కాని ప్రజలకు మాత్రం అందుబాటులో లేని పొలిటీషియన్. పార్టీలు మారడం జస్ట్ కామన్...వివాదాలు సృష్టించడంలో మోస్ట్‌ సెన్సేషన్. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి పార్లమెంట్‌‌ దాకా ఎదిగిన వుమన్. ఆమె ఎవరో మీకిప్పటికే అర్థమై వుంటుంది కదా. యస్. వివాదాల గీత, కొత్తపల్లి గీత. ఏ పార్టీలో అడుగు పెట్టినా గీత దాటడడమే ఆమె చరిత. వైసీపి నుంచి గెలిచి, టీడీపీ చెంత చేరి, సొంత పార్టీ పెట్టి, చివరికి, కమలంలో వికసించితీరుతానంటూ బీజేపీ కండువా కప్పుకున్నారు. కాషాయంలో కొత్తకథ వినిపిస్తానంటున్నారు కొత్తపల్లి గీత.

2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా అరకు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు కొత్తపల్లి గీత. అంతకు ముందు డిప్యూటీ కలెక్టర్‌గా పబ్లిక్ సర్వీస్‌లో పనిచేసిన గీత, ప్రజాసేవ అంటూ రాజకీయ బాట పట్టారు. తనకున్న పరిచయాలతో వైసీపీలో సీటు సంపాదించుకుని ఎంపీగా పార్లమెంట్ గడప తొక్కారు. లోక్‌సభలో 77 చర్చల్లో పాల్గొని, 535 ప్రశ్నలను లేవనెత్తి 97శాతం మార్కులు పొందారు గీత. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. కాని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో ప్రజలకు, అందుబాటులో వుండరనే ఆరోపణలు ఎదుర్కొంటూ అతిథిగానే ముద్రపడ్డారు.

అరకు నియోజకవర్గానికి ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు గీత. అయితే గీత మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేశారు. ఎస్టీ సామాజిక వర్గం విషయంలో తప్పుడు అఫిడవిట్ పెట్టారంటూ ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నారు. తన భర్త కిడ్నాప్ కేసులో, ఆర్ధిక విషయాల్లో పలు అరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతపార్టీలో ఆమెకు వ్యతిరేకత మొదలైంది. పైగా గీత నోటీదురుసు వ్యవహారశైలి మరిన్ని తలనొప్పులు తెచ్చింది. దీంతో వైసీపీ అధిష్టానం ఆమె పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలో తనకు వ్యతిరేక పవనాలు తీవ్రమయ్యాయని గమనించిన గీత, ఎంపీగా ఉంటూనే తెలుగుదేశానికి దగ్గరయ్యారు. టీడిపీతోనే సావాసం చేస్తూ సొంతపార్టీపైన విమర్శనాస్త్రాలు గుప్పంచి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారారు.

ఇక కొత్తపల్లి గీత సైకిల్ ఎక్కబోతున్నారంటూ జరుగుతున్న ప్రచార సమయంలోనే, ఆమె మరో సంచలనానికి తెరతీసారు. 2019 ఎన్నికల్లో జనజాగృతి అంటూ సొంత పార్టీని అనౌన్స్ చేసారు. అట్టహాసంగా పార్టీ ప్రారంభించారు. తానే అధ్యక్షత వహిస్తూ ఎన్నికలో పోటీ చేశారు. అయితే గీతకు సొంతపార్టీ గుర్తు రాకపోవడంతో ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ పెట్టినా, మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. వన్ ఫైన్ డే, తనకు అలవాటైన రీతిలో మళ్లీ పాత పాటే పాడారు గీత. పార్టీ మార్చేసి కమలం కండువా కప్పేసుకున్నారు. ఇక నమో నరేంద్ర మోడీ అంటూ కొత్త పాట అందుకున్నారు. దీంతో ఆమెను నమ్ముకుని జన జాగ్రుతి పార్టీలో చేరిన వారంతా, కథ కంచికి మనం ఇంటికి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ పార్టీకి సెండాఫ్ చెప్పేశారు. పార్టీ కోసం లక్షలాది రూపాయల విరాళాలు, డిపాజిట్లు చేశాం, ఇక తమ గతేం కావాలని ఏకంగా విశాఖలో ధర్నా సైతం చేశారు. వీటిపై ఇంతవరకు నోరు విప్పలేదు గీత.

మొత్తానికి రకరకాల గీతలు దాటుకుని, కమలంలో కొత్త గీత గీసుకున్న కొత్తపల్లి గీత, ఈ పార్టీలోనైనా కుదురుగా ఉంటారా అన్న సందేహాలు అదే పార్టీలోనే వ్యక్తమవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ఉత్తరాంధ్రలో వికసించాలని ఉబలాటపడుతున్న కమలానికి కొత్తపల్లి గీతను అస్త్రమవుతుందా...భస్మాసుర హస్తమవుతుందో కాలమే సమాధానం చెప్పాలని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories