Top
logo

సియాచిన్‌ ప్రమాదకర యుద్ధక్షేత్రం... డేంజరస్‌ గ్లేసియర్‌

సియాచిన్‌ ప్రమాదకర యుద్ధక్షేత్రం... డేంజరస్‌ గ్లేసియర్‌
Highlights

భారత్-పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం. దీన్ని...

భారత్-పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం. దీన్ని మృత్యుక్షేత్రమని కూడా అంటారు. ఎందుకంటే వందలాది మంది సైనికులను పొట్టనపెట్టుకుంది ఈ సియాచిన్ గ్లేసియర్. దాదాపు 22వేల అడుగుల ఎత్తైన మంచుశిఖరం సియాచిన్. ఎముకలే కాదు రక్తమూ గడ్డకట్టుకుపోయే చలి. ప్రతికూల పరిస్థితులకు పరాకాష్ట. సియాచిన్‌ అత్యంత డేంజరస్‌ ఏరియా బేస్‌క్యాంప్‌. ఎప్పుడు మంచుచరియలు విరిగిపడతాయో తెలీదు. ఎప్పుడు మంచు తుపాను చెలరేగుతుందో తెలీదు. నిత్యం మారే వాతావరణం. అయినా ప్రాణాలు పణంగాపెట్టి, దేశం కోసం పహారా కాస్తుంటారు జవాన్లు. వాస్తవానికి స్వాతంత్ర్యం తర్వాత, మూడున్నర దశాబ్దాల వరకు సియాచిన్‌లో భయానక వాతావరణం దృష్ట్యా సైనికులను గస్తీకి ఉంచలేదు. అయితే పాకిస్తాన్‌ చొరబాట్లకు ప్రయత్నించడం, యుద్ధ కవ్వింపులు, వ్యూహాత్మక ప్రాంతం నేపథ్యంలో, 1984 నుంచి సియాచిన్‌లో మన సైనికుల కవాతు మొదలైంది. ప్రతి ఏడాది మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ కాస్తుంది.

ఇక అక్కడి సైనికుల దినచర్య విషయానికొస్తే... సైనికులు చెక్క బళ్లలపై స్లీపింగ్ బ్యాగ్స్‌లో పడుకుంటారు. కానీ నిద్ర కూడా వాళ్లకు ప్రమాదకరమే. ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ఒక్కోసారి నిద్రలోనే వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి సైనికులను గార్డులు మధ్య మధ్యలో మేల్కొలుపుతుంటారు. నిజానికి అంత ఎత్తులో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇక స్నానం గురించి ఆలోచించే సాహసం కూడా వారు చేయరు. ఆ వాతావరణానికి చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. షేవింగ్ చేసుకుంటే చర్మం ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ పనికి కూడా వాళ్లు దూరంగా ఉంటారు. ఒక్కో సైనికుడికి మూడు నెలల పాటు అక్కడ పోస్టింగ్ వేస్తారు. వాళ్లకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే సైనికులు ఆ మూడు నెలలూ పహారా కాయాల్సి ఉంటుంది. భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో సైనికులకు అక్కడ పెద్దగా పనుండదు. ఉన్నంత సేపు ఖాళీగానే సమయాన్ని గడపాల్సి వస్తుంది.

సియాచిన్‌ను గస్తీ కాయడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ సేవలందించే హెలికాప్టర్ పేరు చీతా. అంత ఎత్తుకు ఆ హెలికాప్టర్లు మాత్రమే వెళ్లగలవని ఆర్మీ చెబుతుంది. కాల్పుల విరమణకు ముందు ఒక్కో చెక్ పాయింట్ దగ్గర కేవలం 30 సెకన్లు మాత్రమే అవి ఆగేవి. ప్రత్యర్థులు స్పందించే లోగానే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇలా చేసేవి. ఇప్పుడు కూడా సైనికులను అన్ని పరిస్థితులకు సమాయత్తం చేసేందుకు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు.

సైనికులకు అక్కడ వినోదానికి ఎలాంటి సాధనాలూ అందుబాటులో ఉండవు. ఎటు చూసినా తెల్లగా మెరిసే మంచు కొండల మధ్యే నిత్యం అప్రమత్తంగా ఉంటూ కఠిన వాతావరణాన్ని ఎదుర్కొంటూ కాలం గడపాలి. ముందే చెప్పినట్టు సియాచిన్‌ యుద్ధక్షేత్రమే కాదు, మృత్యుక్షేత్రం కూడా. ఇప్పటివరకూ దాదాపు 900 మంది భారత జవాన్ల వీరమరణం పొందారు. మొన్న లాన్స్ నాయక్ హనుమంతప్ప కూడా ఇలాగే ప్రాణాలు త్యాగం చేశాడు. పొరుగుదేశం కాల్పులే కాదు, విభిన్న వాతావరణ పరిస్థితులు, మంచు చరియలు విరిగిపడటం, ఇలా ఎన్నో కారణాలకు ప్రాణాలు కోల్పోయారు జవాన్లు. అందుకే ప్రపంచంలో అత్యంత భయంకరమైన యుద్ధక్షేత్రాల్లో ఒకటి సియాచిన్‌ గ్లేసియర్.

Next Story

లైవ్ టీవి


Share it