logo

అభినవ బసవణ్ణ ఆచరించిన మార్గం... మనకు ఆచరణీయం... ఎలా?

అభినవ బసవణ్ణ ఆచరించిన మార్గం... మనకు ఆచరణీయం... ఎలా?

వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికైనా అత్యవసరం.. అది మన జీవితాలను సరైన దారిలో నిలబెడుతుంది.. సమాజంలో ప్రతీ వ్యక్తి సత్యనిష్టాగరిష్టుడైతే.. ఇక సమస్యలే ఉండవు.. సమాజం ప్రశాంతంగా, సత్య నిష్టతో సాగాలంటే ముందు మనం సరైన దారిలో నడవాలి.. వ్యక్తిగత క్రమశిక్షణకు బాటలు వేసేది ఆధ్యాత్మిక మార్గం.. అలాంటి మార్గాన్ని బోధించిన మహనీయుడు శివైక్యం చెందడం యావత్ భారతదేశాన్ని విచారానికి గురి చేసింది. బతికినన్నాళ్లూ మంచిని బోధించి, దైనందిన సమస్యలకు ఆధ్యాత్మిక మార్గంతో పరిష్కారం చూపారు శివకుమారస్వామి.

అతడు నడిచే దైవం.. గొప్ప సంఘ సేవకుడు.. సమాజంలో శాంతి సుమాలు వెల్లి విరియడానికి తన వంతు కృషి చేసిన ధీరోదాత్తుడు.. మఠాన్ని మతాలకు అతీతంగా నడిపిన గొప్ప మానవతా వాది... అందుకే యావద్దేశం ఆయన శివైక్యం చెందడం పట్ల కన్నీరు పెడుతోంది.. ఆయన లేని లోటు తీరనిదని ఆవేదన పడుతోంది. నడిచే దైవం ఆయన.. మహారుషి, అభినవ బసవణ్ణ.. సమాజాన్ని శాంతి పథంలో పయనింప చేసిన మహా మనిషి.. మనుషుల్లో దేవుడిగా పూజలందుకున్న మౌనముని.. కర్ణాటకలోని తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి పద్మభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాల గ్రహీత డాక్టర్. శ్రీ శివకుమార స్వామి శివైక్యం యావజ్జాతిని శోక సంద్రంలో ముంచెత్తింది. వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన ఈ స్వామీజీ శతాధిక ధార్మికవేత్త..111 ఏళ్ల పాటూ తన బోధనలతో కన్నడ జాతిని చైతన్యవంతం చేసిన ధన్యజీవి..

శివకుమారస్వామి ఆశీస్సుల కోసం రాజకీయనేతలు పరితపిస్తారు. ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు తెన్నులు చూస్తారు.. ఆయన చూపు తమపై పడితే చాలని తపించిపోతారు.. దూర తీరాల నుంచి స్వామి దర్శనం కోసం వస్తుంటారు.. ఆయన ఆశీస్సుల కోసం ఎంత సేపైనా నిరీక్షిస్తారు.. కారణం ఆయన సర్వమానవ సమానత్వంతో సాధించిన గొప్ప పేరు ఆయన్ను అందనంత ఎత్తులో నిలబెట్టింది. శివకుమార స్వామిని కన్నడిగులు మాత్రమే కాదు ఏపీ, తమిళనాడులలో కూడా అశేష భక్త జనం పెద్ద సంఖ్యలో ఆరాధిస్తారు. ప్రధాని మోడీ నుంచి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వరకూ శివకుమార స్వామి భక్తులే.. చాపకూటితో సమతను నేర్పిన మహానుభావుడాయన.. సంఘ సేవా కార్యక్రమాలకు ఆయన పెట్టింది పేరు.9 దశాబ్దాలుగా సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన శివకుమార స్వామి నిప్పులాంటి మనిషి.. స్వామీజీలపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న రోజులివి.. స్కాములు, రాజకీయాలకు అతీతంగా స్వామీజీలను చూడలేని ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటికీ భిన్నంగా తత్వబోధన చేసిన గురుతుల్యుడు శివకుమార్ స్వామీజీ.. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవు.

కడిగిన ముత్యంలా, జ్ఞాన జ్యోతులు ప్రసరించే చైతన్య జ్యోతిలా భాసిల్లారు. సిద్ధగంగ మఠాధిపతిగా ఆయన కన్నడిగులకు చేసిన సేవలు అనన్య సామాన్యం.. లక్షల్లో విద్యార్ధులు ఆయన విద్యాసంస్థల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అదంతా ఆయన చలువే.. విద్యాబుద్ధులతో పాటూ, ప్రతీ వ్యక్తిలోనూ క్రమశిక్షణను, రుజు వర్తనను పెంపొందింప చేసిన మహనీయుడు శివ కుమార స్వామి.. అన్నదానం, విద్యాదానం, అనాధలకు ఆశ్రయం కల్పించి లక్షల మంది జీవితాలను తీర్చి దిద్దారు..

Santosh

Santosh

undefined Contributors help bring you the latest news around you.


లైవ్ టీవి

Share it
Top