రాయ్‌బరేలిలో రాజీ పడేదెవరు... రాజు అయ్యేదెవరు?

రాయ్‌బరేలిలో రాజీ పడేదెవరు... రాజు అయ్యేదెవరు?
x
Highlights

కాంగ్రెస్ కంచుకోట అయిన రాయబరేలీలో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, మంత్రులు రాయబరేలీకి...

కాంగ్రెస్ కంచుకోట అయిన రాయబరేలీలో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, మంత్రులు రాయబరేలీకి క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారంలో మేము సైతం అని పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పుణ్య తీర్ధం రాయబరేలీ అంటున్నారు ఆ పార్టీ నేతలు.. అయిదో దశ పోలింగ్ ఎదుర్కొంటున్న రాయబరేలీలో సీన్ ఉత్కంఠ రేపుతోంది. ఆరునూరైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని గెలిపించుకుని తీరతామంటోంది కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ రాయబరేలీ ఒక తీర్థ స్థలమని తామంతా భక్తులమనీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాయబరేలీ గెలుపు వెన్నెముక లాంటిదంటున్నారు ఆ పార్టీ నేతలు.. 2014 ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ గెలిచింది రెండంటే రెండు సీట్లే.. అవే అమేథి, రాయబరేలి.. మోడీ ప్రభంజనంలోనూ తల్లి కొడుకులు ఈ రెండు నియోజక వర్గాలను నిలబెట్టుకోగలిగారు..

ఇక సోనియా అయితే అయిదో సారి ఈ నియోజక వర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. పాంచ్వీ బార్ పాంచ్ లాక్ కే పార్ అనే నినాదంతో కాంగ్రెస్ నేతలు రాయబరేలీలో ప్రచారం చేస్తున్నారు. ఈసారి కనీసం అయిదు లక్షల ఓట్ల మెజారిటీతో సోనియా గెలుపొందుతారని వారంటున్నారు. సోనియా గెలుపు కోసం దేశ వ్యాప్తంగా కీలక నేతలంతా రాయబరేలీలో మాటేశారు. ఇంటింటికీ వెళ్లి మరీ ఓట్లడుగుతున్నారు. ఇప్పటికే పంజాబ్ మంత్రి నవజోత్ సిద్ధూ రాయబరేలీ మొత్తం కలియతిరిగి మోడీపై పంచ్ లేస్తూ ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాయబరేలీలో తిష్ట వేసి మరీ ప్రచారాన్ని చూసుకున్నారు.. తమకు బతుకునిస్తున్న పార్టీని గెలిపించుకోవాలని, తల్లిలాంటి సోనియా రుణం తీర్చుకోవాలని ప్రచారంలో పాల్గొన్నారు. రాయబరేలీ, అమేథీల్లో పార్టీ గెలుపు కేవలం యూపీ కాంగ్రెస్ నేతల బాధ్యతే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల బాధ్యతగా భావిస్తున్నారు. ప్రచారానికి పార్టీ పెద్దలెవరూ పిలవకుండానే కాంగ్రెస్ నేతలు ముందుకొచ్చారు. సోనియా గాంధీ లాంటి జైంట్ లీడర్ ఇక్కడ అభ్యర్ధి అయినప్పుడు ఆమెను గెలిపించుకునే బాధ్యత మాది కాకపోతే మరెవరిదని ఎదర ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

మరోవైపు ఈ అయిదేళ్లలో సోనియా అనారోగ్యం కారణంగా ఒకటి రెండు సార్లు మాత్రమే నియోజక వర్గానికి వచ్చి వెళ్లారు. నామినేషన్ వేసిన రోజు తర్వాత అప్పుడప్పుడు ప్రచార ర్యాలీలలో కనిపిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ప్రచారానికి రావడం తగ్గించేశారు.

రాయబరేలీలో బీజేపీ అభ్యర్ధిగా దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా, ప్రియాంక వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన దినేష్ ఈసారి బీజేపీ పంచన చేరి టిక్కెట్ తీసుకున్నారు. మే6న ఎన్నిక జరుగుతున్న రాయబరేలీలో మహా ఘట్ బంధన్ అభ్యర్ధిని నిలబెట్ట లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories