2019 సార్వత్రిక ఎన్నికల కోసం భీకర పోరు జరుగుతోంది. ప్రత్యర్ధి పవర్ ఫుల్ పంచ్ లతో చెలరేగుతున్నాడు..అవకాశమొచ్చినప్పుడల్లా అధికార పక్షం కక్ష గట్టి,...
2019 సార్వత్రిక ఎన్నికల కోసం భీకర పోరు జరుగుతోంది. ప్రత్యర్ధి పవర్ ఫుల్ పంచ్ లతో చెలరేగుతున్నాడు..అవకాశమొచ్చినప్పుడల్లా అధికార పక్షం కక్ష గట్టి, రెచ్చగొట్టి, ఆపై నాకవుట్ అంటోంది. అయినా నిదానమే ప్రధానమంటున్నాడీ నేత..అనుభవాల సారం ఆయననలా నడిపిస్తోందా? కుటుంబంపై వ్యక్తిగత విమర్శలతో దాడి పెంచినా ఆయన కూల్ కూల్ గానే ఉండటానికి కారణమేంటి? అన్నింటికీ రాఫెల్ బ్రహ్మాస్త్రమై అడ్డు పడుతుందనుకుంటున్నారా?
2019 సార్వత్రిక ఎన్నికలు విచిత్రమైన వాతావరణాన్ని తెరపైకి తెస్తున్నాయి. బీజేపీ తిరిగి అధికారం దక్కించుకోవడం కష‌్టమేనని దశల వారీగా జరుగుతున్న పోలింగ్ సీన్ చూస్తే అర్ధమవుతోంది. అందుకే మోడీ కూడా ఎమోషన్స్ ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోడమే ధ్యేయంగా తన ప్రచార శైలి మార్చేస్తున్నారు.. విధానాలు, సిద్ధాంతాలకు కాలం చెల్లింది. వ్యక్తిగత దూషణలు శృతి మించుతున్నాయి. కాంగ్రెస్ పై మునుపెన్నడూ లేనంత అక్కసును, వెళ్లగక్కుతున్నారు మోడీ.. వ్యక్తిగత విమర్శల డోసు దాటిపోతోంది. ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని ఎండగట్టడమే ధ్యేయంగా అడుగులేస్తున్నారు. ఇంతటి విషమ పరిస్థితుల్లోనూ అదుపు తప్పకుండా ప్రచారం మొదట్నుంచి చివరి వరకూ ఒకే విధమైన బేస్ లో తన శైలిని కొనసాగిస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ.. గతంలోకంటే అనుభవం, పరిపక్వత సాధించిన రాహుల్ ప్రచార సరళిలో ఎక్కడా తడబడటం లేదు.. రాఫెల్ డీల్ లో అవకతవకలను తొలిసారిగా గళమెత్తి ప్రశ్నించి నిలదొక్కుకున్న ఒకే స్వరం రాహుల్.. రాఫెల్ డీల్ పై ఆరోపణలు చేసి చివరంటా స్థిరంగా నిలబడింది రాహుల్ ఒక్కరే. మోడీ లాంటి వ్యక్తిపై ఆరోపణలు చేసి నిలదొక్కుకోడం రాహుల్ కి కాబట్టి సాధ్యపడింది కానీ మరే ఇతర వ్యక్తయినా.. ఈ ఆరోపణలు కొంత కాలానికి సద్దుమణిగిపోయే పరిస్థితులు కల్పించేది బీజేపీ..
రాఫెల్ డీల్ ఆరోపణలపై రాహుల్ లేవనెత్తుతున్న ప్రశ్నల్లో లాజిక్ ఉంది.. బయటి ప్రపంచానికి తెలియని అంతర్గత ఒప్పందం ఏదో జరిగిందన్న అనుమానాలు రేకెత్తించగలిగాడు రాహుల్.. ఏ ఎన్నికల ప్రచారంలో అయినా ఇదే ప్రధానాస్త్రం చేస్తున్నారు. ప్రతీ వేదికపైనా రాఫెల్ డీల్ పై మోడీని నిలదీసి ప్రశ్నిస్తున్నారు. దేశానికి కాపలాదారుడినంటూ మోడీ చేసుకుంటున్న ప్రచారానికి చౌకీదార్ చోర్ అంటూ రిటార్ట్ ఇచ్చారు. రాహుల్ ఇచ్చిన ఈ నినాదం కాంగ్రెస్ కార్యకర్తల్లో బాగా పాపులర్ అయింది. ప్రియాంక ప్రచారానికి వెళ్లినప్పుడుచౌకీదార్ చోర్ అంటూ రాహుల్ కు మద్దతుగా నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా మోడీ తనపై పాజిటివ్ గా పెంచుకుంటున్న ఇమేజ్ ను రాహుల్ మొదట దెబ్బ తీస్తున్నారు. రైతులకు, సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా రాఫెల్ డీల్లో ఏం జరిగిందో క్షుణ్ణంగా వివరిస్తున్నారు.
ఇది జనాల్ని బాగానే ఆకర్షిస్తోంది. ఆ తర్వాత మోడీ పథకాలను ఒక్కొక్కటిగా ఏకి పారేస్తున్నారు. మోడీకి తాను ఓడిపోతానని తెలుసునని అందుకే ఆయన కంగారు పడుతున్నారని జోరు పెంచుతున్నారు.ఆర్మీ దళాలను ఎన్నికల ప్రచారానికి మోడీ వాడుకుంటున్నారని, దేశ భద్రత కోసం సరిహద్దుల్లో తీసుకుంటున్న చర్యలను సైతం తన గొప్పతనంగా అభివర్ణించుకుంటున్నారని రాహుల్ దుయ్యబట్టారు. సర్జికల్ దాడులను, బాలాకోట్ దాడులను ఇష్టానుసారం ప్రచారానికి వాడుకోవడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు జరిగినా ఎన్నడూ ఇలా ప్రచారం చేసుకోలేదని వివరించారు. మన్మోహన్ సింగ్ ఎంత నిగర్వో.. మోడీ ఎంత ఆడంబరుడో తెలుసు కోవాలంటూ వివరిస్తున్నారు.
ఆరోదశ ఎన్నికల ప్రచారం అదుపు తప్పింది. మోడీ కాంగ్రెస్ పై తన దాడిని మరింత ఉథృతం చేశారు.రాజీవ్ గాంధీ చరిత్రహీనుడనీ, భ్రష్టా చారుడనీ విమర్శిస్తున్నారు. సిక్కు అల్లర్లను, భోపాల్ విషవాయువు ఉదంతాన్ని, బోఫోర్స్ కుంభకోణాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. అయితే రాహుల్ ఈ ప్రచారానికి భయపడలేదు.. తొణకలేదు.. బెణక లేదు. బాధపడలేదు.. అదంతా మోడీలో ఉన్న అభద్రతా భావానికి నిదర్శనమంటూ కౌంటర్ ఎటాక్ చేశారు.ప్రచారంలో నన్ను, నా తండ్రిని తిట్టి పోస్తున్నారు సరే.. రాఫెల్ డీల్ లో మీ నిర్వాకాన్ని కూడా జనానికి వివరించండంటూ ఎదురు తిరుగుతున్నారు.
రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ సుప్రీం కోర్టు కామెంట్ చేసినప్పుడు రాహుల్ కొంత దూకుడు ప్రదర్శించారు. కోర్టు కూడా తన వ్యాఖ్యలను సమర్ధించిందంటూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడి ఇబ్బందుల్లో పడ్డారు.. చివరకు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చౌకీదార్ చోర్ నినాదాన్ని రాహుల్ వదలడం లేదు.. కేంద్రంలో ఉన్న రాజకీయ వాతావరణం, అనిశ్చితి, ఒకవైపు ఏకమైన ఘట్ బంధన్ ఇలా భిన్న రాజకీయాల నడుమ అయిదు దశల పోలింగ్ ముగిసింది. అయితే బీజేపీకి ఏ మాత్రం అనుకూలమైన వాతావరణం లేదని ఈ అయిదు దశలు తేటతెల్లం చేస్తున్నాయన్నది నిపుణుల వాదన. మరోవైపు విశ్లేషకులు కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని అంటున్నారు. ఇక మిగిలిన రెండు దశల ఎన్నికలే పార్టీల గెలుపు, ఓటములను డిసైడ్ చేస్తాయని తేలడంతో అటు అధికారం ఇటు ప్రతిపక్షం రెండూ బాహా బాహీకి దిగుతున్నాయి.
అయిదు దశల పోలింగ్ పూర్తయ్యే సరికి బీజేపీ ఫోకస్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ కుటుంబం పైకి మళ్లించింది. పౌరసత్వ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. రాజీవ్ అవినీతిపరుడంటూ నిందించడమే కాదు .. దమ్ముంటే ఆ ఆరోపణలపై ఎన్నికల యుద్ధానికి రావాలంటూ సాక్షాత్తూ ప్రధానే సవాల్ చేశారు. మరోవైపు బావగారు రాబర్ట్ వాద్రా పై అవినీతి ఆరోపణలూ కాక రేపాయి.అయినా నిండుకుండ తొణకదన్నట్లు రాహుల్ ముక్కు సూటిగానే ముందుకు పోయారు. న్యాయ్ పథకాన్నే నమ్ముకున్నారు.
మోడీ పదునైన పంచ్ లతో విరుచుకుపడుతుంటే.. రాహుల్ ప్రేమతో యుద్ధం చేస్తున్నారు.. మోడీజీ ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన విమర్శలను సహృదయంతో స్వీకరిస్తానని, ప్రేమతో జయిస్తాననీ రాహుల్ చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుని వ్యవహార శైలి గమనించిన వారికి బోధపడేదొక్కటే.. రాహుల్ ప్రేమతోనే శత్రువును సైతం దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.. నిండు సభలో మోడీని కౌగలించుకుని తనది ప్రేమ బాట అని తేల్చేశారు రాహుల్.. రాఫెల్ డీల్ లో తప్పు జరిగింది కాబట్టే మోడీ తన కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నారని విమర్శించారు.
రాజీవ్ కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలోకి లాగి దెబ్బ తీయాలని మోడీ ప్రయత్నిస్తుంటే.. రాహుల్ మోడీ విధానాలను దుమ్మెత్తి పోస్తున్నారు.మోడీజీ మొదట మేకిన్ ఇండియా అన్నారు.. ఆ తర్వాత స్టార్టప్ ఇండియా అన్నారు.. చివరికి సిట్ డౌన్ ఇండియా చేశారంటూ రాహుల్ చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తానంటూ చివరకు పకోడీలు అమ్ముకుని బతకమంటున్నారని ఎద్దేవా చేశారు రాహుల్.. సామాన్యుడి ఎక్కౌంట్ లో సొమ్ములేస్తాననీ, యువతకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తాననీ ఆర్భాటంగా ప్రచారం చేసి చివరికి చేతులెత్తేసిన ఘనత మోడీదేనంటోంది కాంగ్రెస్..
ఎన్నికల ప్రచారంలో రాహుల్ అదను చూసి సంధించిన మరో అస్త్రం న్యాయ్.. సామాన్య ప్రజలకు కుటుంబానికి ఏడాదికి 72 వేలచొప్పున ఎక్కౌంట్లలో వేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం సామాన్యులను ఆకర్షిస్తోంది. పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ లాంటిది న్యాయ్ పథకం అంటున్నారు రాహుల్.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పథకమంటూ ఎన్నికల ప్రచారంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచే శక్తి ఈ పథకానికుందన్నది కాంగ్రెస్ నేతల వాదన. ఇక ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే శక్తి తమకుందని కూడా రాహుల్ చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లో రైతులకు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో కాంగ్రెస్ ఇమేజ్ గ్రాఫ్ పాజిటివ్ గా మారుతోంది.. మొత్తం మీద రాహుల్ చాలా స్థిరమైన, నమ్మకమైన రాజకీయాలు చేస్తున్నారు.. టార్గెట్ 2024 లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. దాంతో మోడీకున్నంత దూకుడుతనం, ఆవేశం ఆయనలో కనిపించడం లేదు.. నిదానమే ప్రధానం అనుకున్నారేమో రాహుల్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. సోదరి ప్రియాంకను యూపీ వ్యవహారాల ఇన్చార్జ్ గా తీసుకోడం కూడా వ్యూహాత్మకమే. ముందు యూపీలో చతికిల బడిన కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేయడానికే ప్రియాంకను తీసుకొచ్చారు. ముందు యూపీలో కాంగ్రెస్ కాస్త నిలదొక్కుకుంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం అభ్యర్ధిగా ప్రియాంకను దింపే అవకాశాలున్నాయి. 2024కి యూపీ తమ చేతికి చిక్కితే, దేశ రాజకీయాలను సునాయాసంగా చేతిలోకి తీసుకోవచ్చన్నది ఈ యువతేజం ఆలోచన.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire