అమేథీ పై రాహుల్ నమ్మకం తగ్గడానికి కారణమేంటి?

అమేథీ పై రాహుల్ నమ్మకం తగ్గడానికి కారణమేంటి?
x
Highlights

కంచుకోట అమేథీ పై రాహుల్ నమ్మకం తగ్గడానికి కారణమేంటి? ఉత్తరాది నేతలకే కీలక పదవులు కట్టబెట్టే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ లో రాహుల్ ఈసారి దక్షిణాది వైపు...

కంచుకోట అమేథీ పై రాహుల్ నమ్మకం తగ్గడానికి కారణమేంటి? ఉత్తరాది నేతలకే కీలక పదవులు కట్టబెట్టే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ లో రాహుల్ ఈసారి దక్షిణాది వైపు చూడటానికి కారణాలేంటి? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల వ్యూహంలో తడబడుతున్నారా? గాంధీ కుటుంబం కంచుకోట అయిన అమేథీలో పోటీకి ఈసారి భయపడుతున్నారా? ఓటమి భయంతోనే మరో చోటు నుంచి పోటీకి సిద్ధపడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

అమేథీలో గత ఎన్నికల్లోనే రాహుల్ అతి కష్టం మీద గెలిచారు. అప్పట్లో రాహుల్ కు లక్షా ఏడు వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. రాహుల్ కు పోటీగా బరిలో దిగిన బీజేపీ మంత్రి స్మృతీ ఇరానీ.. ముందు నుంచీ ఆ నియోజక వర్గాన్ని తరచుగా సందర్శిస్తూ కొంత పట్టు పెంచుకున్నారు.. గత ఎన్నికల్లో రాహుల్ ఓటమి ఖాయమనే వాదనలు వినిపించినా చివరికి ఎలాగోలా విజయం రాహుల్ ని వరించింది. అయితే ఓడిపోయినా ఆ నియోజక వర్గంపై పట్టు వదులుకోలేదు స్మృతీ ఇరానీ. ఈసారి కూడా ఆమె అదే నియోజక వర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న స్మృతి ఈ నాలుగేళ్లు క్రమం తప్పకుండా అమేథీ వెళ్లి వస్తూనే ఉన్నారు. నిజానికి అమేథీ ఎంపీ రాహుల్ అయినా ఆ నియోజక వర్గాన్ని రాహుల్ పట్టించుకున్నదే లేదు ఓడి పోయిన స్మృతి మాత్రం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. అమేథీ ప్రజలు రాహుల్ కన్నా స్మృతీనే ఇష్ట పడుతున్నారన్న వార్తలూ ఆనోటా ఆనోటా వినిపిస్తున్నాయి.

ఈ కారణాలన్నింటి వల్లా రాహుల్ సేఫ్ సైడ్ గా మరో నియోజక వర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. మధ్య ప్రదేశ్ లోని ఛింద్వారా లేక మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తారనే వార్తలొస్తున్నాయి. ఛింద్వారా సీటుకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడాయన సీఎం కావడంతో ఆ సీటు ఖాళీగానే ఉంది. ఇక మహారాష్ట్రలోని నాందేడ్ లో 2014లో మోడీ వేవ్ కు ఎదురొడ్డి కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల రాహుల్ కి అది సేఫ్ సీట్ అనే భావన కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రాహుల్ ఈసారి దక్షిణాదిన తమిళనాడు, లేక కర్ణాటకల నుంచి పోటీ చేస్తారన్నది మరికొందరి ఊహాగానం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ పోటీపై ఊహాగానాలు చేశారు. రాహుల్ ఖమ్మం లేదా నల్లగొండ నుంచి బరిలోకి దిగుతారంటూ టీ కాంగ్రస్ నేతలు సంచలన ప్రకటనలు చేసినా అవన్నీ ఉత్త మాటలే అని తేలిపోయింది. ఈ ప్రతిపాదనల మాటెలా ఉన్న తమిళనాట కూడా రాహుల్ కి ఆహ్వానం ఉంది. తమ రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ చేయాలంటూ మిత్ర పక్షం డీఎంకే కూడా ఆహ్వానించింది. ఇక సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం రాహుల్ ను తమిళనాడు నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య రాహుల్ ను పోటీకి ఆహ్వానిస్తున్నారు. నాయనమ్మ ఇందిర1978లో చిక్మగళూర్ నుంచి గెలవగా, అమ్మ సోనియా1999లో బళ్లారి నుంచి పోటీ చేసి గెలిచారని ఆయన గుర్తు చేస్తున్నారు.

అయితే చిక్మగళూరు సీటును మిత్రపక్షమైన జేడీ ఎస్ కు ఇప్పటికే కాంగ్రెస్ కేటాయించింది. ఉత్తర, దక్షిణ భారత దేశం మధ్య అగాధాన్ని పూడ్చాలంటే రాహుల్ లాంటి నేత పోటీకి దిగాలని కర్ణాటక యూత్ కాంగ్రెస్ అంటోంది. గాంధీల కంచుకోట అమేథీని వదులుకోకూడదని, అక్కడ పోటీకి రాహుల్ ఇష్టపడకపోతే ప్రియాంకను బరిలోకి దింపాలంటూ కాంగ్రెస్ లోనే కొందరు సీనియర్లు సూచిస్తున్నారు.. మొత్తం మీద రాహుల్ అమేథీని తమ కంచుకోట ఎంత మాత్రం కాదని భావించే రోజులొచ్చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories