పొత్తులు కుదుర్చుకోడంలో రాహుల్ విఫలమవుతున్నారా?

పొత్తులు కుదుర్చుకోడంలో రాహుల్ విఫలమవుతున్నారా?
x
Highlights

కాలం కలసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు కేంద్రంలో ఏక పార్టీ పెత్తనం కరిగిపోయిన వేళ సంకీర్ణ రాజకీయల హవా కొనసాగుతున్న వేళ అందివచ్చే ఆప్త మిత్రులను...

కాలం కలసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు కేంద్రంలో ఏక పార్టీ పెత్తనం కరిగిపోయిన వేళ సంకీర్ణ రాజకీయల హవా కొనసాగుతున్న వేళ అందివచ్చే ఆప్త మిత్రులను కలుపుకుపోడంలో యువరాజు రాహుల్ విఫలమవుతున్నాడా? భావి ప్రధాని అని పార్టీ చెప్పుకుంటున్నా ఆ పరిణతి ఈ యువ నేతలో కనిపించడం లేదా? మిత్రులకు స్నేహ హస్తం చాపేబదులు రిక్త హస్తం చూపడం బలమా? బలహీనతా?

2019 ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ దగ్గర వ్యూహాలే కరువయ్యాయా? రాజధాని ఢిల్లీలో బీజేపీపై పోటీకి ఆమ్ ఆద్మీతో పొత్తు కుదుర్చుకోలేక పోయిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో సైతం మిత్ర పక్షాలతో పొత్తులు కుదుర్చుకోడంలో విఫలమవుతోందన్న విమర్శలు పెరుగు తున్నాయి. బీజేపీతో నేరుగా తలపడే ఆస్కారమున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరి పోటీకే మొగ్గు చూపుతోంది. అవి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు. వీటిలో ఒంటరిగానే తలపడాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక యూపీ, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, జమ్మూ కశ్మీర్,బీహార్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మాత్రం పొత్తులతోనే ముందుకు పోవాలని హస్తం ఆలోచిస్తోంది. ఢిల్లీ పీఠానికి వయా రూట్ గా చెప్పుకునే యూపీలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ దెబ్బ తింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రియాంకను సీఎం అభ్యర్ధిగా రంగంలోకి దించాలన్న ఉద్దేశంతో మిత్ర పక్షాలతో పొత్తులకు కాంగ్రెస్ మొదట ముఖం చాటేసింది. కాంగ్రెస్ ఎత్తుగడలను గ్రహించిన మాయావతి తెలివిగా ఎస్పీ, ఆర్ ఎల్డీలతో పొత్తు కుదుర్చుకున్నారు. అంతేకాదు.. తమ కూటమి యూపీలోనే కాదు మరే ఇతర రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదని తేల్చేశారు.యూపీలో మహాకూటమికి కాంగ్రెస్ ఏడు స్థానాలు వదలగా మహా ఘట్ బంధన్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. యూపీలో మొత్తం 80 సీట్లకూ కూటమి పోటీ పడాలని నిర్ణయించింది.

పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ అటు మమతతో కానీ, వామపక్షాలతో కానీ జత కలవకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది.దీనివల్ల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోయి బీజేపీ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒడిషాలో 21 ఎంపీ సీట్లుండగా ఇక్కడ కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. దీనికి వైరి పక్షంగా అధికార బిజూ జనతాదళ్ పోటీ చేస్తోంది. అధికార నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయే అవకాశముంది.

దేశంలో కీలకమైన ఈశాన్య ప్రాంతంలో ఏ ప్రాంతీయ కూటమితోనూ కాంగ్రెస్ కు పొత్తులు లేవు.పౌరసత్వ సవరణ బిల్లు ఈ సారి బీజేపీ కొంప ముంచేలా ఉంది. ఈశాన్య ప్రాంత పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతం మొత్తం మీద 25 సీట్లుండగా, బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. పంజాబ్, హర్యానా, గోవా, ఢిల్లీలలో కాస్త బలమైన నేపధ్యమున్న ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోలేకపోయింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో పొత్తు విషయమై ఆప్ తో మంతనాలు జరుపుతున్నా సీట్ల పంపకంలో స్థానికాంశాలు అడ్డుపడుతున్నాయి.

ఓపక్క ఆప్ తో పొత్తే అవసరం లేదంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోని13 సీట్లలో నాలుగు సీట్లు తమకే కేటాయించాలని ఆప్ పట్టబట్టడం కాంగ్రెస్ కి నచ్చలేదు. పది సీట్లున్న హర్యానాలోనూ, రెండు సీట్లున్న గోవాలోనూ కాంగ్రెస్, ఆప్ మధ్య ఇవే గొడవలున్నాయి. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లుండగా ఆప్ తో పొత్తుకు కాంగ్రెస్ లో రెండు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పొత్తు వద్దే వద్దని అంటుండగా కాంగ్రెస్ ఇన్చార్జ్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మేకన్ మాత్రం పొత్తు ఉంటేనే మంచిదంటున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడటంతో రాహుల్ ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సమయంలో ఆప్ తో పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయని రాహుల్ ప్రకటించడం విశేషం. జమ్మూ కశ్మీర్ విషయానికొస్తే అక్కడ నేషనల్ కాన్ఫరెన్సుతో కాంగ్రెస్ అవగాహన కుదుర్చుకుంది. అక్కడున్న ఆరు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ జమ్మూ, ఉధంపూర్ సీట్లలో, నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ సీటులో పోటీ పడతాయి. ఇక అనంతనాగ్, బారాముల్లా నియోజక వర్గాల్లో ఈ రెండు పార్టీల మధ్య స్నేహ పూర్వక పోటీలున్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పోటీ ఉంది. లద్దాక్ లోక్ సభ సీటుపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అధికారానికి కీలకమైన బీహార్ లో పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, సీపీఐ ఎంఎల్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. మొత్తం 40 సీట్లున్న బీహార్ లో ఆర్జేడీ 20 సీట్లకు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకు పోటీ పడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories