ఆపరేషన్‌ పుల్వామా... రాజకీయ ప్రయోజనమేంటి?

ఆపరేషన్‌ పుల్వామా... రాజకీయ ప్రయోజనమేంటి?
x
Highlights

పుల్వామా ఉగ్రమూకల ఉన్మాదం... ఇప్పుడు పాలక, ప్రతిపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారుతోందా? ఉగ్రదాడిని ప్రపంచదేశాలు కలిచివేసిందని ఖండిస్తుంటే. ఈ ఘటనను మన...

పుల్వామా ఉగ్రమూకల ఉన్మాదం... ఇప్పుడు పాలక, ప్రతిపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారుతోందా? ఉగ్రదాడిని ప్రపంచదేశాలు కలిచివేసిందని ఖండిస్తుంటే. ఈ ఘటనను మన పార్టీలు క్యాష్‌ చేసుకుంటున్నాయా? వచ్చే ఎన్నికల్లో పుల్వామా ఎఫెక్ట్‌ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈ అంశాన్ని వాడుకునేందుకు పార్టీలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి.? సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం కార్గిల్ యుద్ధం తరువాత ఇలానే జరిగింది. ఆ యుద్ధం తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ సుస్థిర మెజారిటీ సాధించింది. అదే చరిత్ర ఇప్పుడు పునరావృతం అవుతుందా? కాంగ్రెస్‌ కత్తులు నూరుతూ కమలంపై దాడి చేసి పీఠమెక్కుతుందా? ఎన్నికల వేళ ఏది జరిగినా... అది క్యాష్‌ చేసుకోవాలనుకుంటాయి పార్టీలు. 20 ఏళ్ల కింద కార్గిల్‌ యుద్దం జరిగినప్పుడు కూడా సేమ్‌ ఇదే సీన్‌. అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ... తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. ముష్కరమూకలను వేటాడే మన సైన్యం పాక్‌ నక్కలను తరిమేసిందని చెప్పుకొంది. జనం నమ్మేశారు. అధికారాన్ని కట్టబెట్టారు. మరిప్పుడేం జరగబోతోంది?

ఒక విషాదం అలుముకున్న వేళ.... అల్లుకుంటున్న వివాదాలు దేశ రాజకీయాలకు కొత్తేమీ కాదు. అందునా ఎన్నికల సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా... దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అలవాటు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. మంచి జరిగితే అదంతా తమ ఘనతేనంటూ... సమాజానికి చెడు జరిగితే... అదంతా కుట్ర అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు కామన్‌. పుల్వామా దాడికి ఎక్కడ, ఎలా బదులు తీర్చుకోవాలన్న విషయంపై సైన్యానికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నామంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను విపక్షాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి అయివుండి దేశభద్రతను సైన్యం చేతికి అప్పజెప్పటం ఏంటంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. దాడి వెనుక బీజేపీ హస్తముందని విమర్శిస్తున్న కాంగ్రెస్‌.... దాడి జరిగే పరిస్థితులకు తావిచ్చింది మాత్రం భద్రతా లోపాలే అన్నది నిజం. ఇదే అదునుగా దాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి, భారతీయ జనతాపార్టీ... దీన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో ఉందంటారు విశ్లేషకులు. ఎందుకంటే రాజకీయంగా మోడీ ఇదివరకంతటి బలమైన స్థానంలో లేరు. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పద్ధతులతో ఆయన ప్రతిష్ఠ అంతకంతకూ దిగజారుతున్న ఈ పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఇలా ఓ చిన్నస్థాయి యుద్ధవాతావరణం ఏర్పడటం వ్యక్తిగతంగా మోడీకి, రాజకీయంగా పార్టీకి లాభించదేంటున్నారు విశ్లేషకులు.

వాస్తవానికి కాశ్మీర్‌లో అశాంతి ఇప్పటిది కాదు. స్వాతంత్రం వచ్చిన సమయంలో మొదలైన ఈ రావణకాండ ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఇందుకు కొన్ని స్వార్థపూరిత రాజకీయ పార్టీల వైఖరి ఓ కారణమైతే, అక్కడి ప్రజల మనోభావాలను గెలుచుకోలేకపోవడం, వారిలో దేశం పట్ల విశ్వాసాన్ని నింపడంలో విఫలం కావడం మరో కారణం. ప్రజల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా విజయం సాధించదనడానికి జమ్ముకశ్మీరే అతి పెద్ద ఉదాహరణగా చెబుతున్న విశ్లేషకులు.. పార్టీలు ఇప్పుడు ఇదే ఆయుధాన్ని రాబయే ఎన్నికల్లో ప్రయోగించాలని అనుకుంటున్నట్టు చెబుతారు విశ్లేషకులు. ఎందుకంటే తామున్నంతవరకూ ఉగ్రవాదులు భారత భూభాగంలో అడుగు పెట్టే సాహసం చేయలేరని బీజేపీ నేతలు చాలాసార్లు చెప్పారు. అదీకాక సర్జికల్ స్ట్రైక్స్‌తో తాము పైచేయి సాధించామని చెప్పుకుంటున్న మోడీ టీమ్‌... రాజకీయాలపైన, ఎన్నికల్లో ఫలితాలపైన ప్రభావితం చూపించేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories