Top
logo

శాంతిమంత్రమా... యుద్ధ తంత్రమా... మోడీ రాజకీయ అడుగులెటు?

శాంతిమంత్రమా... యుద్ధ తంత్రమా... మోడీ రాజకీయ అడుగులెటు?
Highlights

యుద్ధం వాంఛనీయం కాదు...నిజమే...యుద్ధం ఎంతో మందికి విషాదాన్ని అందిస్తుంది. అందుకే ఇప్పటికీ భారత్, పాక్ ల మధ్య ...

యుద్ధం వాంఛనీయం కాదు...నిజమే...యుద్ధం ఎంతో మందికి విషాదాన్ని అందిస్తుంది. అందుకే ఇప్పటికీ భారత్, పాక్ ల మధ్య శాంతి ఏర్పడాలని కోరుకునే వారూ ఉన్నారు. అదే సందర్భంలో శాంతి ప్రయత్నాల్లో తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకునే వారూ ఉన్నారు. అది పరోక్షంగా ఉగ్రవాదం బలపడేందుకు కారణమవుతోందన్న విమర్శలూ ఉన్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాదాన్ని..... మూలాలతో సహా పెకలించేందుకు ఇప్పుడు సమయం వచ్చిందన్నదే సాధారణ ప్రజాభిప్రాయంగా ఉంది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పాకిస్థాన్ తో శాంతి చర్చలు జరపాలని సూచించారు. ప్రతీకార చర్యలు కోరుకునే వారు నిరక్షరాస్యులంటూ నిందించారు. రెండు దేశాల వద్ద కూడా అణు బాంబులు ఉండడాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. మెహబూబా ముఫ్తీ సూచించిన శాంతి మార్గాన్ని ఇరవై ఏళ్ళ క్రితమే భారత్ అనుసరించింది. అప్పట్లో ఉగ్రవాద బీభత్సం...కార్గిల్ యుద్ధం తరువాత భారతదేశం శాంతి మంత్రాన్నే ఎంచుకుంది. నాటి ప్రధాని వాజ్ పేయి పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. రెండు దశాబ్దాల క్రితమే చేసిన ప్రయోగాన్ని....అంతకు ముందు దశబ్దాల పాటు పాటించిన సహనాన్నే ఇంకా కొనసాగించాలనడంలో రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కశ్మీర్ లో పలు పార్టీలు ఉగ్రవాదులకు అనుకూలంగా ఉండడం ద్వారా అక్కడి ప్రజల మద్దతును పొందవచ్చని భావిస్తున్నాయి. అందుకే దేశభద్రతను పణంగా పెట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్ గనుక తిరిగి శాంతి మంత్రాన్నే పఠిస్తే....చేతగానిదేశంగా భారత్ పై ముద్రపడే అవకాశం కూడా ఉంది. భవష్యత్తులో మరెన్నో ఉగ్రదాడులకు అది దారి తీసే అవకాశం ఉంది.

దేశంలో త్వరలో ఎన్నికలు జరుగనుండగా....పుల్వామా ఘటన చోటు చేసుకుంది. దాంతో ఈ అంశాన్ని రాబోయే ఎన్నికల్లోనూ ఉపయోగించేందుకు పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం కార్గిల్ యుద్ధం తరువాత ఇలానే జరిగింది. ఆ యుద్ధం తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ సుస్థిర మెజారిటీ సాధించింది. తాజాగా అదే చరిత్ర ఇప్పుడు పునరావృతం అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తాజాగా ఇందుకు బలం చేకూర్చే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనుసరించిన మైనారిటీ ఉదారవాద విధానాల కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు. మొత్తం మీద దేశంలో తుపాను ముందటి ప్రశాంతత ఉంది. మరో వైపున సరిహద్దుల్లో ప్రకంపనలు కూడా మొదలవుతున్నాయి. ఆ ప్రకంపనలు యుద్ధానికి దారి తీయకపోయినా....ఏదైనా తీవ్రచర్యకు దారి తీసే అవకాశం మాత్రం ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో పార్టీలు రాజకీయ ప్రయోజనాలు చూసుకోకూడదు. అదే సమయంలో మితిమీరిన జాతీయవాదం కూడా అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. అది కశ్మీర్ ప్రజానీకంతో భారత్ అనుబంధాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. కశ్మీర్ లో ఉగ్రవాదానికి మద్దుతు ఇస్తున్న వారు అతి తక్కువే. అందుకే నేటికీ అక్కడ రాజకీయ పార్టీలు మనుగడ సాగించగలుగుతున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మతంతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపైనే అంతా దృష్టి వహించాలి. కార్గిల్ తరహా చిన్న యుద్ధమే రెండు దేశాలపై ఎన్నో ప్రతికూల ప్రభావాలను కలిగించింది. ఆస్తి, జన నష్టం కలిగించింది. మహా యుద్ధం వస్తే మాత్రం అది రెండు దేశాలకూ కోలుకోలేని దెబ్బనే అవుతుంది. అదే సమయంలో భారత్ తీసుకునే చర్య ఉగ్రవాద మూలాలను నాశనం చేయగలిగేలా ఉండాల్సిన అవసరం ఉంది.

Next Story