Top
logo

దూరతీరాల్లో పుల్వామా ప్రకంపనలు.. యుద్ధం తప్పదా?

Highlights

పుల్వామా ప్రకంపనలు దూరతీరాలకూ విస్తరించాయి. అమెరికా...ఫ్రాన్స్...రష్యా...ఇలా ఒక్కో అగ్రరాజ్యం భారత్ వైఖరికి...

పుల్వామా ప్రకంపనలు దూరతీరాలకూ విస్తరించాయి. అమెరికా...ఫ్రాన్స్...రష్యా...ఇలా ఒక్కో అగ్రరాజ్యం భారత్ వైఖరికి మద్దతు ప్రకటిస్తున్నాయి. మరో వైపున పదుల సంఖ్యలో చిన్నా పెద్ద దేశాలు భారత్ కు అండగా నిలుస్తున్నాయి. పాకిస్థాన్ పై భారత్ తీసుకోబోయే కఠినచర్యలకు ఇవి సంకేతాలుగా ఉంటున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న భారత్ - పాక్ సంబంధాలు పుల్వామా ఘటనతో పూర్తిగా దిగజారిపోయాయి. శాంతి మంత్రం స్థానంలో యుద్ధగీతం వినిపిస్తోంది. ఆలివ్ కొమ్మల స్థానంలోకి ఎక్కుపెట్టిన తుపాకులు వస్తున్నాయి. రెండు దేశాల్లోనూ తుపాను ముందటి ప్రశాంతత నెలకొంది. తుపాను ఏ క్షణంలో ఎక్కడ తీరం దాటుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు తుపాను వస్తుందా...రాదా....తీరం వరకూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందా....తీరం దాటితే అది ఏస్థాయిలో ఉంటుంది....లాంటి సందేహాలు ఇప్పుడు నెలకొన్నాయి.

పుల్వామా ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నది. ఆ సంఘటన సృష్టించింది సాధారణ ఉపరితల ప్రకంపనలు కాదు. భూమికి బాగా లోతులో మొదలైన ప్రకంపనలు ఉపరితలానికి చేరేందుకు కొంత సమయం పడుతుంది. ఆ ప్రకంపనలు ఎంతో శక్తివంతంగా కూడా ఉంటాయి. పుల్వామా ఘటనను అంతర్జాతీయం చేసి....ఆ తరువాత భారీ చర్య చేపట్టాలన్నది భారత్ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో పాకిస్థాన్ పై సర్జికల్ దాడుల విషయంలోనూ అలానే జరిగింది. ప్రపంచదేశాల మద్దతు కూడగట్టిన తరువాతనే అప్పట్లో సర్జికల్ దాడులు జరిగాయి. మరో వైపున సౌదీ యువరాజు పర్యటన అంశం కూడా పాకిస్థాన్ పై చర్య తీసుకోవడంలో కొంత జాప్యానికి కారణమైంది అనే వారూ ఉన్నారు. ఈ వారం రోజుల్లోనూ దేశంలోనూ. అంతర్జాతీయంగానూ రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యాపారపరమైన ఆంక్షలతో మొదలైన ఈ పరిణామాలు.... దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థుల అరెస్టు, కొందరు విద్యార్థులను కాలేజీల నుంచి బహిష్కరించడం, చైనా వస్తువులపై బ్యాన్ విధించాలని కోరడం.....బికనీర్ జిల్లా నుంచి పాకిస్థానీల బహిష్కరణ....కశ్మీర్ లో తయారైన వాటిని కొనవద్దు అనే ట్వీట్ ...ఓ గవర్నర్ దాన్ని రీట్వీట్ చేయడం....దాకా రకరకాలుగా సాగాయి. ఇక క్రీడలపై కూడా దీని ప్రభావం బాగానే పడింది. ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడే మ్యాచ్ లు ప్రశ్నార్థకమయ్యాయి. పలు స్టేడియంలలో పాకిస్థానీ క్రికెటర్ల చిత్రాలను తొలగించారు. ముంబై పై ఉగ్రదాడి సందర్భంలోనూ ఇలానే జరిగింది. సినీరంగంలోనూ దీని ప్రభావం పడింది. పాకిస్థాన్ లో జరిగే సమావేశాలకు హాజరు కావడాన్ని కొందరు సెలెబ్రెటీలు మానుకున్నారు. మొత్తం మీద పరిస్థితి మాత్రం ఓ చిన్నపాటి యుద్ధం దిశగా మారుతోంది అనడంలో మాత్రం సందేహం లేదు. యుద్ధం చేయాలని కొందరు అంటుంటే....శాంతి పాటించాలనీ కోరుకునే వారూ ఉన్నారు.

ఏకు మేకు కావడం అనేదానికి చైనా ప్రత్యక్ష నిదర్శనం. భద్రతామండలిలో చైనా స్థానం పొందడంలో నాటి భారత ప్రధాని నెహ్రూ కీలక పాత్ర పోషించారు. అదే చైనా నేడు కరడుగట్టిన ఉగ్రవాది పై నిషేధం విధించడంలో భారత్ కు వ్యతిరేకంగా వీటోను ప్రయోగిస్తోంది. (బైట్ 13). ఉగ్రవాద దాడులపై భారత్ నిరసన తెలిపినప్పుడు సాక్ష్యాధారాలను చూయించాల్సిందిగా పాక్ డిమాండ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు...భారత్ ఏదైనా చర్య తీసుకుంటే ప్రతిచర్య తీసుకునేందుకు తాము సిద్ధమనేని స్పష్టం చేస్తోంది. సైన్యం చేతిలో కీలుబొమ్మలుగా ఉండే పాక్ ప్రధానమంత్రులంతా అదే మాట అంటుంటారు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అదే మాట అన్నారు. ముంబై దాడులు, పఠాన్ కోట్, యురి, తాజాగా...పుల్వామా.....వీటన్నింటిలోనూ పాక్ సాక్ష్యాధారాలను డిమాండ్ చేసింది. సాక్ష్యాలను అందించిన సందర్భంలోనూ ఉగ్రవాద ముఠాలపై పాకిస్థాన్ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. అలాంటి అడ్డాలపై సర్జికల్ దాడులు జరిగినా ఫలితం లేకపోయింది. అందుకే ఇక భారత్ మరో కఠిన చర్యకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఉగ్రవాదంలో పాక్ హస్తాన్ని నిరూపించే సాక్ష్యాధారాలను అగ్రదేశాలకు అందించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్....తాజాగా రష్యా కూడా భారత్ వాదనను సమర్థించాయి. పుల్వామా ఉగ్రదాడి ని భయానక పరిస్థితిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. పుల్వామా ఉగ్రదాడిని దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఖండించింది.

మొన్న పఠాన్ కోట్...నిన్న యురి...నేడు పుల్వామా...అంతకు ముందు ముంబైపై ఉగ్రదాడి.....ఇలా ఇంకెన్ని దాడులను సహించాలని ప్రశ్నిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. శాంతిని కోరుకోవాలనేది నిజమే. కాకపోతే అశాంతి ని ఎంతకాలం సహించాలన్నది కూడా ముఖ్యమైన ప్రశ్ననే. అశాంతిని తుదముట్టించడం ద్వారా శాంతిని నెలకొల్పాలనే డిమాండ్ కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత్ లో పర్యటిస్తున్న సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సైతం ఉగ్రవాదాన్ని ఖండించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశానికి సహకరిస్తామన్నారు. అయితే...ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. పాకిస్థాన్ కు అత్యధిక సాయం సౌదీ అరేబియా, అమెరికాల ద్వారానే అందుతోంది. ఆ నిధులను పాకిస్థాన్ భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు వెచ్చిస్తోంది. (బైట్ 16). పాకిస్థాన్ పర్యటన సందర్భంగా సౌదీ యువరాజు భారీస్థాయిలో పాకిస్థాన్ కు వరాలు ప్రకటించారు. అక్కడి నుంచి ఆయన భారత్ కు వచ్చారు. పాక్ దుశ్చర్యలను సౌదీ అరేబియాకు వివరించేందుకు దీన్నొక అవకాశంగా ప్రధాని మోడీ భావించారు. అందుకే ప్రొటొకాల్ ను పక్కనబెట్టి విమానాశ్రయానికి వెళ్ళి ఆయనను ఆహ్వానించారు. మోడీ తీసుకున్న ఈ చొరవ ఆశించిన ఫలితాలను అందించే అవకాశం మాత్రం తక్కువే. దశాబ్దాలుగా పాక్, సౌదీల మధ్య పటిష్ఠ స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి.

Next Story