అవసరం కాంగ్రెస్‌కా... ప్రియాంకకా? వాద్రా ఎపిసోడ్‌ ఏమంటోంది?

అవసరం కాంగ్రెస్‌కా... ప్రియాంకకా? వాద్రా ఎపిసోడ్‌ ఏమంటోంది?
x
Highlights

కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రియాంకా గాంధీ వాద్రా తురుపు ముక్కగా పనిచేస్తారా.?2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా? ఈ సందేహాలకు సమాధానం...

కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రియాంకా గాంధీ వాద్రా తురుపు ముక్కగా పనిచేస్తారా.?2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా? ఈ సందేహాలకు సమాధానం ఏమోగానీ.. కాంగ్రెస్ కి ప్రియాంక అవసరం కన్నా.. ప్రియాంకకు కాంగ్రెస్ అవసరమే ఎక్కువని ఇవాళతేలిపోయింది. 2019 ఎన్నికలు దేశంలో విచిత్రమైన పరిస్థితులను తెరపైకి తెస్తున్నాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు నెత్తికెత్తుకున్నాక కనీసం ఒక్కటంటే ఒక్క సంపూర్ణ విజయాన్ని చవిచూడని రాహుల్ గాంధీ నాలుగేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. మోడీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వరంగా మారి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగు పడింది తప్ప అది పూర్తిగా రాహుల్ గాంధీ విజయంగా చెప్పుకోలేని పరిస్థితి.. ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికలొచ్చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో విజయం కనిపించడం లేదు. మోడీ ఎన్నో పొరపాట్లు, తప్పిదాలు చేస్తున్నా, దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నా.. వాటి ప్రభావం కాంగ్రెస్ కు మేలు చేయడం లేదు.

మరోవైపు బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అధ్యక్షుడు రాహుల్ గాంధీలపైనా కేసులు బనాయించి వేధిస్తోందన్న ఆరోపణలున్నాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసు వారిని వెంటాడుతూనే ఉంది. ఇవి చాలవన్నట్లు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఆయన అవినీతిగా సంపాదించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈడీ విచారణలెదుర్కొంటున్నారు. రాహుల్ సంధించిన రాఫెల్ కుంభకోణం అస్త్రం బూమరాంగ్ గా మారి వాద్రాకు తగిలింది. యూపీఏ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందాల్లో వాద్రా ప్రమేయం కూడా ఉందంటూ ఆరోపణలు రావడం. యూపీలో, లండన్ లో వాద్రా సంపాదించిన ఆస్తులు అవినీతి మయమేనంటూ ప్రచారం జరగడంతో ప్రియాంకా గాంధీ ఆత్మరక్షణలో పడిపోయారు. భర్తపై ఉన్న అవినీతి కేసుల విచారణ ముందు ముందు ఒంటరిగా ఎదుర్కొనడం కష్టమని తేలిపోయింది. తన వ్యక్తిగత ఇమేజ్ పై పడిన ఈ మరకను తొలగించుకోవాలంటే కాంగ్రెస్ లాంటి పార్టీ అండ ఆమెకు ఉండి తీరాలి.

అప్పుడే వీటిని తమ పార్టీపై కక్ష సాధింపు చర్యల్లా ఆరోపించే వీలుంటుంది. అందుకే రాహుల్ సోదరిని కాపాడటానికే ఆమెకు పార్టీలో తగిన పదవినిచ్చి క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్న అంచనాలు బలపడుతున్నాయి. ప్రియాంకకు రాహుల్ పార్టీ బాధ్యతలు ప్రకటించి పది రోజులు గడుస్తున్నా.. ఆమె ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టడం..మరోవైపు ఈడీ కేసుల్లో వాద్రా విచారణకు తోడుగా రావడం కాకతాళీయంగా అనుకోలేం. లండన్ లో ఉన్న ఫ్లాట్స్ కొనుగోలు అంశంపై వాద్రా ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే ప్రియాంక అక్కడకు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు..భర్త వెంట ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రియాంక ఆయనను లోపలకు పంపి మీడియా ప్రశ్నలకూ సమాధానమిచ్చారు. అవినీతి ఆరోపణలను తమ కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలుగా తేల్చేశారామె.. తన భర్తకు పూర్తి మద్దతు ప్రకటించారు. తద్వారా తన భర్త చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని చెప్పకనే చెప్పారు.. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కి ప్రియాంక అవసరం కన్నా.. ప్రియాంకకు కాంగ్రెస్ పార్టీ అవసరమే ఎక్కువుందని తేలిపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories