ప్రియాంకాస్త్రం కాంగ్రెస్‌కు లాభమా...నష్టమా?

ప్రియాంకాస్త్రం కాంగ్రెస్‌కు లాభమా...నష్టమా?
x
Highlights

యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టడంతో, కాంగ్రెస్‌కు ఒంటరిపోరు తప్పలేదు. 80 స్థానాలున్న యూపీ, ఢిల్లీ అధికారానికి కీలకం కావడంతో, తెగించిపోరాడాలని...

యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టడంతో, కాంగ్రెస్‌కు ఒంటరిపోరు తప్పలేదు. 80 స్థానాలున్న యూపీ, ఢిల్లీ అధికారానికి కీలకం కావడంతో, తెగించిపోరాడాలని డిసైడైంది కాంగ్రెస్. వీలైనన్ని సీట్లు, ఓట్లు సాధించి, కనీసం బీజేపీకైనా నష్టం కలిగించాలని భావిస్తోంది. అందుకే ప్రియాంకను రంగంలోకి దింపింది. ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించడంతో, యూపీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మరోసారి యూపీ మీదే ఆశలు పెట్టుకున్న మోడీకి సవాల్‌ విసిరినట్టయ్యింది. కేంద్రంలో మోడీ పాలన, రాష్ట్రంలో యోగి పాలనపై ప్రియాంకతో విమర్శలు చేయిస్తే, జనంలోకి బలమైన ముద్ర వేయొచ్చన్నది కాంగ్రెస్ భావన. ఆహార్యంలో అచ్చు ఇందిరను తలపించే ప్రియాంక పట్ల జనంలో, అభిమానముంది. గత ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ, అమేథిలో, తల్లి, అన్నలకు ప్రచారానికి వెళ్లిన ప్రియాంకకు జనం బ్రహ్మరథం పట్టారు. ఆమె పట్ల, గాంధీల కుటుంబం పట్ల జనాలకు సాఫ్ట్‌కార్నర్ ఉండటం కాంగ్రెస్‌కు ప్లస్సే.

యూపీలో యాదవులు, దళితుల ఓట్లు ఎస్పీ, బీఎస్పీలకే వెళతాయి. ఇక మిగిలిన ఓట్లు ముస్లింలు, అగ్రవర్ణాలు. ముస్లింలలో కొందరు ఎస్పీ, బీఎస్పీకి మళ్లితే, మిగతావారి ఓట్లు కాంగ్రెస్‌వే. ముస్లిం ఓట్ల మీద బీజేపీకి అసలు ఆశల్లేవు. ఇక మిగిలిన అగ్రవర్ణాల ఓట్ల మీదే బీజేపీ ఆశలు. వీటిని చీల్చాలన్నదే కాంగ్రెస్ వ్యూహం. అందుకే అగ్రవర్ణాలను ఆకర్షించేందుకు, ప్రియాంకను అస్త్రంగా ప్రయోగిస్తోంది. ముందు నుంచి ‍యూపీలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కూడా, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలే. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో, వారంతా బీజేపీ వైపు మళ్లారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలతో కాకుండా, కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, అగ్రవర్ణాల ఓట్లు చీలతాయని బీజేపీ భావన. అందుకే మొన్న పదిశాతం రిజర్వేషన్ అస్త్రం ప్రకటించింది. బీజేపీ స్ట్రాటజీని సవాల్ చేసేందుకు, కాంగ్రెస్‌ ప్రియాంకను ప్రయోగించింది. కీలకమైన యూపీని ప్రియాంకకు అప్పగించడంతో, మిగతా రాష్ట్రాలపై రాహుల్‌ దృష్టిపెట్టడానికి వీలుకలుగుతుంది. ఇవన్నీ ప్రియాంక రాకతో కాంగ్రెస్ భావించే లాభాలు.

అయితే ప్రియాంకతో కాంగ్రెస్‌కు మైనస్‌లు కూడా బోలెడున్నాయి. ఎన్నికల టైంలోనే ప్రియాంకను రంగంలోకి దించడంతో, రాహుల్‌ నాయకత్వాన్ని

ప్రశ్నించినట్టయ్యింది. రాహుల్ అసమర్థ లీడర్‌షిప్‌ భయంతోనే, ప్రియాంక వస్తున్నారన్న భావనను, ఇప్పటికే బీజేపీ జనంలోకి తీసుకెళ్తోంది. రాహుల్ కాకుండా, ప్రియాంకనే జనంలో ఫోకస్‌ అయితే, అది రాహుల్ ప్రధాని పదవి ఆశలకే దెబ్బ. యూపీ బాధ్యతలు అప్పగించడంతో, కుటుంబ పార్టీ అని మోడీ కూడా విమర్శలు మొదలుపెట్టారు. భర్త రాబర్ట్ వాద్రా అవినీతిపై బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. ప్రియాంకను కార్నర్ చేయడం కోసం మరిన్ని వెలికితీయొచ్చు. ఇలా ప్రియాంక రాకతో, కాంగ్రెస్‌కు ప్లస్‌లు, మైనస్‌లు చాలా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories