సోషల్‌ మీడియా వేదికగా పొలిటికల్‌ వార్..

సోషల్‌ మీడియా వేదికగా పొలిటికల్‌ వార్..
x
Highlights

తెలంగాణ పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. అభ్యర్థులెవరైనా.. ప్రత్యర్థులను టార్గెట్‌ చేయడానికి సోషల్‌ మీడియానే వాడుకుంటున్నారు. ఎందుకంటే కిందటిసారి...

తెలంగాణ పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. అభ్యర్థులెవరైనా.. ప్రత్యర్థులను టార్గెట్‌ చేయడానికి సోషల్‌ మీడియానే వాడుకుంటున్నారు. ఎందుకంటే కిందటిసారి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌లే కనిపిస్తున్నాయి. అందుకే పార్టీల అభ్యర్థులు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వా ట్సఫ్‌, ఫేస్‌బుక్‌లలో ఒకరకమైన కోల్డ్‌వార్‌ నడుస్తోంది.

ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది ఆయా పార్టీల మధ్య సోషల్‌వార్‌ నడుస్తోంది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ల సాక్షిగా మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రచారంతో పాటు ప్రతీ చిన్న దానికి ఒకరినొకరు వాదోపావాదనలకు దీన్నే ప్లాట్‌ఫామ్‌గా వాడుకుంటున్నారు. నువ్వేంత అంటే నువ్వేంత అనే స్థాయిలో వాదనలు చేసుకుంటున్నారు. ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో వాదనలు, ఆరోపణలు చేసుకున్నారు. గతంలో జరిగిన ఘటనలను పదేపదే పోస్టులు పెడుతున్నారు. మా నాయకుడే గొప్ప అంటే మా నాయకుడే గొప్ప అంటూ ఒకరినొకరు వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సై అంటే సై అనే రీతిలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికి వారుగా వారి పార్టీలకు చెందిన ప్రచారాల వీడియోలు, అనుకూల పోస్టులు పెడుతుంటే వాటికి వ్యతిరేకంగా ఇతర పార్టీల నాయకులు పోస్టుంగ్‌లను పెడుతున్నారు. వాట్సప్‌, ఫేస్‌ బుక్‌లలోనే ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. కొందరైతే ఎదుటి పార్టీల నాయకులపై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ దగ్గరపడుతుండటంతో నెట్టింట ప్రచారం హోరెత్తుతోంది. ఒకరకంగా రాజకీయ పార్టీల నడుమ సోషల్‌ సమరం తారస్థాయికి చేరింది. ఆయా పార్టీల అధిష్ఠానాలు మొదలుకొని అభ్యర్థుల దాకా సామాజిక మాధ్యమాలే వేదికగా పోటాపోటీ యుద్ధం సాగుతోంది. యువతను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా నేతలు విరుచుకుపడుతున్న తీరు, ఆద్యంతం ఆసక్తరంగా మారుతోంది.

లక్షలాది మందికి ఇప్పుడు ఫేస్‌బుక్‌ అకౌంట్స్ ఉన్నాయి. వాట్సాప్‌ గ్రూపుల గురించి చెప్పాల్సిన పనేలేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం వెనుక సామాజిక మాధ్యమాల్లో సాగిన ప్రచారమే కీలకమని పలు సర్వేలు అప్పట్లో నిగ్గుతేల్చాయి. దీంతో ఆయా పార్టీలు ప్రత్యేకంగా సోషల్‌ మీడియా విభాగాలను ఏర్పాటుచేసుకొని స్మార్ట్' ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దీనిని మరింత ఉధృతం చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌... సోషల్‌ మీడియాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాయి. పైసా ఖర్చు లేకుండా తమ సందేశాలను జనాల నెట్టింట్లోకి చేరవేస్తున్నాయి. యువతను ఆకర్షించి, వారితో పాటు ఆయా కుటుంబాల్లోని వయోజనుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి.

తమ పార్టీ ఎన్నికల ఎజెండాతో పాటు తమ ఎజెండానూ ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. కేసీఆర్‌, రాహుల్‌, మోడీ కేంద్రంగా ప్రచారం జోరు మీద సాగుతుంది. కేంద్రంలో రాబోయేది హంగ్‌.. కేసీఆర్‌ కింగ్‌.. అంటూ టీఆర్‌ఎస్‌, రాహుల్‌తోనే లౌకిక, ప్రజాస్వామ్య భారత్‌ అంటూ కాంగ్రెస్‌ నేతలు, మోడీతోనే దేశానికి రక్ష అంటూ బీజేపీ నాయకులు నినదిస్తున్నారు. ఇందుకోసం యూపీఏ, ఎన్‌డీఏ సర్కారుల హయాంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రక్షణ చర్యలతో పాటు అవినీతి, అక్రమాల వివరాలను గణాంకాలతో కూడిన పోటాపోటీ పోస్టింగ్‌లతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.

సోషల్‌ మీడియా ప్రచారం కోసం ప్రధాన పార్టీలన్నీ ఐటీ సెల్' పేరిట ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఇవి పూర్తిగా యాక్టివ్‌ అయ్యాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో ముంచెత్తుతున్నాయి. గత, వర్తమాన పరిణామాలను కళ్లగట్టే ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నాయి. తమకు అనుకూలంగా వచ్చిన సర్వే ఫలితాలను కూడా వేగంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాయి. అధినేతల ఎన్నికల ప్రసంగాలను, ప్రచారం తీరును ఎప్పటికప్పుడు జనాలకు చేరవేస్తున్నాయి. సందేశాలను, ఎన్నికల ఎజెండాను, ప్రసంగాలను, రాత, ఆడియో, వీడియోల రూపంలో వివిధ సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు షేర్‌ చేసేందుకు ప్రత్యేక నిపుణులను నియమించుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు పత్యేక ఫేస్‌బుక్‌లో పేజీలతో పాటు వాట్సాప్‌ గ్రూపులు నడుపుతున్నారు. ఆయా నేతల ఖాతాలను, పేజీలను, గ్రూపులను అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలను తమ ఖాతాలు, గ్రూపుల ద్వారా జనసామాన్యంలోకి చేరుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories