Top
logo

భూమా ఫ్యామిలీలో వారసత్వ చిచ్చు రగులుతోందా?

భూమా ఫ్యామిలీలో వారసత్వ చిచ్చు రగులుతోందా?
X
Highlights

కర్నూలు జిల్లా రాజకీయంతో పాటు రాష్ట్ర రాజకీయ ఆ కుటుంబానికి ఓ చ‌రిత్ర ఉంది. బాంబుల గ‌డ్డ ఆళ్లగ‌డ్డ నుంచి...

కర్నూలు జిల్లా రాజకీయంతో పాటు రాష్ట్ర రాజకీయ ఆ కుటుంబానికి ఓ చ‌రిత్ర ఉంది. బాంబుల గ‌డ్డ ఆళ్లగ‌డ్డ నుంచి అసెంబ్లీలో కాలుమోపిన ఆ ఫ్యామిలీ, దాదాపు జిల్లా మొత్తం త‌మ‌కంటూ ఓ బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను ఏర్పరచుకుంది. నంద్యాల పార్లమెంట్ ప‌రిధిలో ఆ కుటుంబం గీసిందే గీత‌.. పెద్ద త‌ల‌కాల‌య ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఇప్పుడా కుటుంబంలో వార‌స‌త్వ పోరు రాజుకుంది. భూమా నాగిరెడ్డి.. శోభానాగిరెడ్డి.. క‌ర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప‌డ‌గ‌లు రాజ్యమేలే నేల ఆళ్లగ‌డ్డలో ఎదురులేని ఆధిప‌త్యం చెలాయించిన దంపతులు. ఎప్పటిక‌ప్పుడు ప్రత్యర్ధుల ఎత్తుల‌ను ముందుగానే ప‌సిగ‌డుతూ, పైఎత్తులు వేయ‌డం ఈ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య‌. పార్టీ ఏదైనా విజ‌యం మాత్రం భూమా వాకిలి దాటేది కాదు. నియోజ‌క‌వ‌ర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా త‌మ‌కంటూ సొంత కేడ‌ర్ క‌లిగిన ఉన్న కుటుంబం కూడా, భూమా కుటుంబ‌మే. త‌మ‌ను న‌మ్ముకున్న వారి కోసం భూమా కుటుంబం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ర‌న్న పేరే అందుకు కార‌ణం..

అయితే 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఆ కుటుంబానికి శోభా నాగిరెడ్డి మ‌ర‌ణం రూపంలో అనుకోని దెబ్బ త‌గిలింది. కొంత కాలానికే భూమానాగిరెడ్డి కూడా కాలం చేయ‌డంతో, ఇద్దరి స్థానంలో త‌న వ‌ర్గాన్ని కాపాడుకునే బాధ్యత‌ల‌ను వారి కుమార్తె అఖిల‌ప్రియ భుజాన వేసుకున్నారు. త‌ల్లి మ‌ర‌ణంతో ఎమ్మెల్యే అయిన అఖిల‌ప్రియ‌, తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత మంత్రి అయ్యారు. కుటుంబం నుంచి వ‌చ్చిన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగించిన ఆమె, జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పుతూ వ‌చ్చారు.. మంత్రిగా, భూమా వార‌సురాలిగా చ‌క్రం తిప్పారు. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప్రభంజ‌నంలో అఖిల‌ప్రియ ఓట‌మిని చ‌విచూశారు. అక్కడి నుంచి భూమా కుటుంబంలో టీ క‌ప్పులో తుపాను మాదిరి వార‌స‌త్వ పోరు మొద‌లైంది. ఇప్పుడు అదే తారాస్థాయికి చేరింది. భూమా కుటుంబానికి అస‌లు వార‌సుడిని తానేనంటూ నాగిరెడ్డి సొద‌రుడు అయిన శేఖ‌ర్‌రెడ్డి కుమారుడు కిశోర్‌రెడ్డి తెర‌మీదికి వ‌చ్చాడు. కార్యక‌ర్తల‌కు అండ‌గా ఉంటూ రాజ‌కీయం న‌డుపుతానంటూ తెర మీదికి వ‌చ్చాడు. మ‌రో అడుగు ముందుకేసి ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పేసుకున్నాడు.

దీంతో నియోజకవర్గంలోని భూమా కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని తికమకలో ఉన్నారు. కర‌వ‌మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నచందంగా తయారైంది వీరి పరిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలన్న ఆలోచనతో సతమతమయ్యారు. అదే స‌మ‌యంలో ఢిల్లీ నుంచి నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన కిషోర్ రెడ్డి, బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆళ్లగడ్డలో ప్రారంభించాలనుకున్నారు. అందుకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఓ భవనాన్ని సిద్దం చేశారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించారు. ఇది ఉమ్మడి ఆస్తి అని, పార్టీ కార్యాలయంగా నిర్వహించకూడదంటూ తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక భూమా కిశోర్ రెడ్డి వెనుదిరిగారు. దీంతో వారసత్వ పోరుకు అంకురార్పణ అయినట్టయ్యింది.

తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన అఖిల ప్రియ, ఆలస్యం చేయకుండా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భూమా వారసుడు, జగత్ విఖ్యాత్ రెడ్డి అంటూ తన సోదరుడిని ప్రకటించారు. వారసత్వ ప్రకటనతో ఇంత వరకు అయోమయంలో కొట్టుమిట్టాడిన కార్యకర్తలు, అభిమానులకు స్పష్టత‌ వచ్చింది. తమకు కాబోయే నేతకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామంటూ కార్యక‌ర్తలు సైతం అఖిల ప్రియకు హామి ఇచ్చారు. 2017 ఉపఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున, అటు కుటుంబం తరుపున ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భూమా నాగిరెడ్డి ఏకైక కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పరిణితి చెందిన రాజకీయాన్ని ప్రదర్శించాడని, ఆ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు.

భూమా వారసులం తామేనని, అఖిల ప్రియ, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రకటించుకున్నా, అటు శేఖర్‌ రెడ్డి కుమారుడు కిశోర్ రెడ్డి సైతం, తామే వారసులమని చెప్పుకుంటున్నారు. బీజేపీ ద్వారా కొత్త రాజకీయం చేస్తామంటూ కార్యకర్తలకు చెబుతున్నారు. అసలైన వారుసులు ఎవరో ప్రజలే తేలుస్తారని అంటున్నారు. ఇలా భూమా ఫ్యామిలీలో వారసత్వపోరు వీధికెక్కింది. కార్యకర్తలు సైతం రెండుగా చీలిపోయారు. దీంతో రాబోయే కాలంలో బయటి శత్రువుల కన్నా, సొంత కుటుంబంలోని వ్యక్తులే ప్రత్యర్థులుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా కార్యకర్తల మధ్య ఘర్షణగా కాకుండా, ఎవరి రాజకీయం వారు చేస్తే మంచిదని స్థానికులంటున్నారు. చూడాలి, భూమా కుటుంబంలో రచ్చకెక్కిన వారసత్వ పోరు, మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో..

Next Story