Top
logo

రక్తపుటేరులు పారుతున్న.. అగ్నిగుండంలా కాశ్మీర్‌

రక్తపుటేరులు పారుతున్న.. అగ్నిగుండంలా కాశ్మీర్‌
X
Highlights

అక్కడ హింస... నిత్యాగ్ని హోత్రంలా మండుతూనే ఉంటుంది. పాక్‌ సైనికుల వీరంగానికి బలయిపోయిన అమాయకుల...

అక్కడ హింస... నిత్యాగ్ని హోత్రంలా మండుతూనే ఉంటుంది. పాక్‌ సైనికుల వీరంగానికి బలయిపోయిన అమాయకుల ఆర్తనాదాలు వినిపిస్తూనే వుంటాయి. ఎక్కడో ఏదో జరిగిందన్న గాలి వార్తలు ఆ హింసను రాజేస్తూనే ఉంటాయి. తినడానికి తిండి లేక, సరైన ఉపాధి మార్గం లేక కడుపు మండిన భారత-పాక్‌ సరిహద్దు పౌరులు అల్లాడిపోతుంటారు. సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో బోర్డర్‌ గ్రామాల్లో విధ్వంస దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారతావనికి శిరస్సులా భాసిల్లుతున్న ఈ మంచుకొండల్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు శ్మశాన వైరాగ్యం కనిపిస్తున్నాయి. మొత్తంగా భారత్-పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? వార్‌జోన్‌ నుంచి హెచ్ఎంటీవీ గ్రౌండ్‌రిపోర్ట్‌ ఇప్పుడు చూద్దాం.

మంచుకొండల్లో బడబాగ్ని రగులుకుంటోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక కల్లోలమయంగా మారుతోంది. భారత్‌-పాక్‌ దేశాల మధ్య నెలకొన్న సంఘర్షణపూరిత వాతావరణంతో రెండు దేశాల సరిహద్దు గ్రామాలు చిగురుటాకుల వణుకుతున్నాయి. కాశ్మీర్‌ లోయలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా బోర్డర్‌ గ్రామాల ప్రజలు బితుకుబితకుమంటూ కాలం గడుపుతున్నారు.

సరిహద్దు పొడవునా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకల పీచమణిచేందుకు భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరిట జరిపిన వ్యూహాత్మక మెరుపు దాడి తర్వాత ఇండో-పాక్‌ సరిహద్దుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. జమ్మూ, కాశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖకు దాదాపు పది కిలోమీటర్ల లోపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో 4 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, పొలాలు గట్రా వదిలేసి బరువెక్కిన హృదయాలతో దూర ప్రాంతాలకు వెళ్లుతున్నారు.

నిన్నా మొన్నటి వరకూ అదో భూతల స్వర్గం ప్రకృతి సోయగాలకు కేరాఫ్ అడ్రస్ కానీ ఇపుడు రక్తపుటేరులు పారుతున్న అగ్నిగుండం.. అందాల కాశ్మీరం ఇపుడు ఆవేశంతో రగిలిపోతోంది. ఆందోళనలతో భయపడుతుంది. ఏ క్షణాన్నైనా అగ్నిపర్వతం బద్దలవుతుందోనన్న బెంగతో దిగాలుపడుతోంది. అసహనం, ఆందోళన, ఆవేశం కలగలిపి భారత్‌-పాక్‌ సరిహద్దు గ్రామాలు బందూకుల మధ్య బతుకులు వెళ్లదీస్తున్నాయి.

భారత్‌-పాక్‌ నడుమ సరిహద్దు ప్రాంతాల ప్రజలు బతుకు యుద్ధం చేస్తున్నారు. మోర్టార్ల మోతలు హోరెత్తిస్తుండగా చెవులు చిల్లులు పడేలా యుద్ధ విమానాల శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. బతుకు భయంతో కొందరు ఇళ్లలోనే ఉండిపోగా మరికొందరు ప్రాణభయంతో దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. మొత్తంగా కాశ్మీర్‌ లోయలో పరిస్థితి దయనీయంగా ఉంది.

జమ్మూలోని సాంబ, ఆర్‌ఎస్‌పురా సెక్టార్లలో సరిహద్దులకు ఆనుకొని ఉన్న ఆర్నియా, సోహగ్‌పూర్‌, హన్సా, మోథా, లాంగ్రియాల్‌, ఫతేపుర్‌, జేడ్రా, షాహపూర్‌ గ్రామాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భారత సైన్యం ఆ గ్రామాలను ఖాళీ చేయిస్తుంటే కొన్నిచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సరిహద్దుకు నాలుగైదు కిలోమీటర్ల దూరానికి తరలి వెళ్లిపోతున్నారు.

గతంలో సర్జికల్‌ దాడులు జరిగినప్పుడు పాకిస్థాన్‌ బలగాలు సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడ్డాయని అక్కడి ప్రజలు హెచ్ఎంటీవీతో చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేస్తున్నామని ఆవేదనగా చెప్పారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయని, ఫోన్లలో త్రీజీ సదుపాయం లేదని, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టంగా మారిందంటున్నారు అక్కడి ప్రజలు. ఈ సీనంతా ఏ ఒక్క గ్రామానికో కాదు దాదాపు సరిహద్దులకు ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఆకాశం నుంచి ఎలాంటి శబ్దం వినిపించినా ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో మిగిలిన వారు అప్పుడప్పుడు గుంపులుగా వీధుల్లోకి వచ్చి చర్చించుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది అక్కడ. బిక్కు బిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్న సరిహద్దు గ్రామాల కాశ్మీరీ పౌరులు ఎప్పుడే ఉత్పాతం జరుగుతుందోనని నిరంతరం అభద్రతా భావంతో బతుకుతున్నారు.

Next Story