Top
logo

నువ్వు డైనోసార్.. నువ్వు ఆస్ట్రిచ్.. బీహార్ బరిలో రేగుతున్న మాటల యుద్ధం

నువ్వు డైనోసార్.. నువ్వు ఆస్ట్రిచ్.. బీహార్ బరిలో రేగుతున్న మాటల యుద్ధం
X
Highlights

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులపై విమర్శలు చూస్తుంటాం పార్టీలు ఒకరి నొకరు నిందించుకోవడం చూస్తుంటాం.. కానీ ...

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులపై విమర్శలు చూస్తుంటాం పార్టీలు ఒకరి నొకరు నిందించుకోవడం చూస్తుంటాం.. కానీ ఇప్పుడు కొత్త తరహా తిట్లు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. మామూలు విమర్శలతో రాజకీయం రక్తి కట్టదనుకున్నారో ఏమో.. ఏకంగా జంతు ప్రపంచంలోకి కూడా అడుగు పెట్టాశాయి పార్టీలు ఆ కహానీ ఇప్పుడు చూడండి.

బీహార్ కురుక్షేత్రంలో కొత్త తిట్లు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారాల్లో విమర్శలు పురాణాలు, ఇతిహాసాలు దాటి ఇప్పుడు జంతు ప్రపంచంలోకి అడుగు పెట్టాయి. ఆర్జేడీ నేత లాలూ తనయుడు తేజస్వి యాదవ్ జేడీయూ నేత నితీష్ కుమార్ పై విరుచుకు పడ్డారు. మే 23 తర్వాత జేడీయూ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని, నితీష్ కుమార్ కూడా అంతరించిపోయిన డైనోసార్ లా కనుమరుగవుతారని విమర్శించారు. బీజేపీ దాని అనుబంధ పార్టీలు గెలుపుపై సందేహంతో ఉన్నాయని, అలాంటి పార్టీలు ప్రతిపక్షాలను మహా మిలావట్ అంటూ ఎలా గేలి చేస్తారని నిలదీశారు. రేపు బీజేపీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ మహా మిలావట్ లోని పార్టీలతోనే జతకట్టాల్సి రావొచ్చని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.

మోడీ బీహార్ వచ్చి తమ పార్టీ గుర్తయిన లాంతరును అంతరించిపోయిన వస్తువు అంటూ ఎద్దేవా చేస్తారని, కానీ అదే లాంతరు పట్టుకుని మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారనీ దెప్పి పొడిచారు తేజస్వి.. ఆరునూరయినా బీహార్ లో ఈసారి గెలుపు ఆర్జేడీదేనని, నితీష్ కుమార్ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు.

తేజస్వి మాటలపై మండిపడిన జేడీయూ నేత రాజీవ్ రంజన్ తేజస్వికి రాజకీయ అనుభవం లేదని తిట్టి పోశారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ లా కష్టపడి పైకి వచ్చిన మనిషి కాదని అందుకే ఎన్నికల రాజకీయాలపై అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల యుద్ధంలో తేజస్వి ఆస్ట్రిచ్ అంటే నిప్పు కోడి లాంటి వాడని, ఈదురు గాలులు, తుఫాన్లు వస్తే ఆస్ట్రిచ్ భయపడి తల భూమిలోకి దించేసి దాచుకుంటుందని .. తద్వారా తాను సురక్షితంగా ఉన్నట్లు భ్రమిస్తుందని, తేజస్విఆలోచనా విధానం కూడా అలాగే ఉందన్నారు. మొత్తం మీద బీహార్ యుద్ధంలో ఆర్జేడీ, జేడీయూ నేతలు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు.ఆర్జేడీ కాంగ్రెస్ కు మిత్ర పక్షం కాగా, జేడీయూ బీజేపీకి మిత్ర పక్షం కావడంతో రాష్ట్రంలో రాజకీయం రక్తి కడుతోంది. దశల వారీ పోలింగ్ నెదుర్కొంటున్న బీహార్ లో మొత్తం 40 ఎంపీ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి కావడంతో ఇక్కడ గట్టి పోటీ నెలకొంది. ఎన్నికల వేళ లాలూ దాణా స్కాం తో జైలు పాలవడం, మోడీ అదే స్కాంను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తుండటంతో ఆర్జేడీ ఇబ్బందులు పడుతోంది.

Next Story