Top
logo

ఇసుక కథ కంచికి చేరింది.. మరి వినిపించని అసలు కథేంటి?

ఇసుక కథ కంచికి చేరింది.. మరి వినిపించని అసలు కథేంటి?
Highlights

అధికారంలోకి వచ్చి పట్టుమని పదినెలలు కాలేదు. అపుడే ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాల్లో ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య...

అధికారంలోకి వచ్చి పట్టుమని పదినెలలు కాలేదు. అపుడే ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాల్లో ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం మొదలైంది. ఇసుక తవ్వకాల్లో ఇద్దరు నేతల మధ్య వివాదం హద్దు మీరింది. వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చరచ్చ చేస్తోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీపడ్డారు. ఇసుక పంచాయతీ కాస్త సీఎం జగన్‌ వద్దకు చేరింది. ఇద్దరికీ జగన్‌ క్లాస్‌ తీసుకున్నారు. మిగతా మ్యాటర్ సెటిల్‌ చేయాలని సజ్జలను ఆదేశించారు. అక్కడితో కథ సుఖాంతమైంది. ఇద్దరు నేతలు జాయింట్ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఖండించారు. అయితే కథ కంచికి చేరడం వెనక, చాలా కథ జరిగింది. ఇంతకీ వీరిమధ్య శాండ్ ఇష్యూ నిజంగానే బుసలుకొట్టిందా...లేదంటే వీరే చెబుతున్నట్టు విపక్షాల కట్టుకథనా?

నందిగాం సురేష్...బాపట్ల వైసీపీ ఎంపీ. జగన్‌ వెంట నడిస్తే చాలు, తనకేమీ అవసరంలేదని ఆశించిన నందిగాం సురేష్ సురేష్‌‌, పార్టీ అధినేత మనసును గెలిచి, ఏకంగా ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూనే, సెన్సేషన్‌ అయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఈమె కూడా తొలిసారి చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈమధ్య వీరిద్దరి మధ్య ఇసుక వివాదం, రచ్చరచ్చ చేస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఇసుక అక్రమ రవాణా సాగుతోందన్నది వినిపిస్తున్న మాట. శ్రీదేవి సొంత నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో, నందిగాం సురేష్‌ అనుచరులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే శ్రీదేవివర్గం, కొన్నాళ్ల నుంచి ఆరోపిస్తోంది. అందుకే అక్రమ రవాణా చేస్తున్న కొందర్ని అడ్డుకున్నామని, వీరంతా నందిగాం సురేష్‌ అనుచరులేనని శ్రీదేవి వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఇసుక రగడ మొదలైంది. ఎన్నికల ఫలితాల నుంచి నందిగాం సురేష్‌, శ్రీదేవిల మధ్య విభేదాలు భగ్గమంటూనే ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవలే తాడికొండ నియోజకవర్గంలో నందిగాం సురేష్ఫోటోను, శ్రీదేవి వర్గీయులు ప్లెక్సీలో చిన్న ఫోటో వేశారంటూ, ఎంపీ అనుచరులు గొడవపడ్డారు. నియోజకవర్గంలో రెండువర్గాలుగా విడిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు, అనేక ఇష్యూల మీద రగడ చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలే మండిపడుతున్నారు.

గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సురేష్ జన్మస్థలం, తాడికొండ నియోజకవర్గం. దీంతో అనుచరులు, సామాజికవర్గం బలం చూసుకుని, నందిగాం సురేష్ వర్గీయులు, ఇక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని శ్రీదేవి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఇసుక రవాణా ఎలా చేస్తారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో పోలీసులు ఇసుక రీచ్‌లో ఉన్న జేసీబీ, ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఇసుక వాహనాలను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ నందిగాం సురేష్ తక్షణమే వాహనాలు విడుదల చేయాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తన నియోజకవర్గంలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే సహించేదిలేదని, పోలీసుల ఎదుటే సీరియస్‌ అయ్యారట. వివాదం మరింత ముదరడంతో, ఎంపీ, ఎమ్మెల్యేల ఇసుక రచ్చ భగ్గుమంది.

ఇక ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మధ్య గతంలోనే చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఫ్లెక్సీ వివాదంలో నడిరోడ్డుపై దాడి చేసుకున్నారు ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు. వీరి గొడవలను ఒక కంట కనిపెడుతున్న వైసీీపీ అధిష్టానం, టైమ్‌ వచ్చినప్పుడు స్పందించాలని ఓపిక పట్టిందని తెలుస్తోంది. శాండ్‌ ఇష్యూతో ఆ టైమ్ రానే వచ్చింది. రాజధాని వైసీపీ నేతల పంచాయతీ, చివరకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దగ్గరకు చేరింది. ఎంపీ నందిగాం సురేష్ ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సీఎంని కలిసి నివేదించినట్టు తెలిసింది. బాపట్ల ఎంపీగా ఉండి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని సీఎంకు కంప్లైయింట్ ఇచ్చారన్న వార్త సంచలనం సృష్టించింది. దీంతో రాజధాని వైసీపీ నేతల పంచాయతీ మీడియాలో ఒక్కసారిగా ఫ్లాష్‌ అయ్యింది.

ఈ వ్యవహారంలో వెంటనే స్పందించిన సీఎం జగన్, ఇద్దర్నీ పిలిపించి మాట్లాడారు. మీడియాలో రచ్చకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ విషయంలో నందిగాం సురేష్‌ను మందలించినట్టు తెలిసింది. మొన్ననే అధికారంలోకి వచ్చాం, టీడీపీ ప్రభుత్వ ఇసుక అక్రమాలపై ఆందోళనలు చేశాం, అప్పుడు వైసీపీ సర్కారు మీద ఇసుక అక్రమ రవాణా ఆరోపణలేంటని ఆరా తీసినట్టు తెలిసింది. మొదటిసారి ఎన్నికైన ఇద్దరూ, జాగ్రత్తగా పని చేయాలని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. విభేదాలు మరిచి, నియోజకవర్గ అభివృద్దికి అంకితం కావాలని చెప్పారని తెలిసింది. జగన్‌ జోక్యంతో చల్లబడిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి, తమ మధ్య విభేదాల్లేవని, కావాలనే కొందరు సృష్టిస్తున్నారని చెప్పారు. మొత్తానికి ఇద్దరూ కలిసి, విభేదాల్లేవని చెప్పడంతో ఇసుక తుపాను చల్లారినట్టయ్యిందని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే నిజంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందా లేదంటే కేవలం ఆరోపణలా అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.లైవ్ టీవి


Share it
Top