గీత రాజకీయ రాత మార్చింది ఎవరు?

గీత రాజకీయ రాత మార్చింది ఎవరు?
x
Highlights

ఆమె రాజకీయ రాత బాగాలేదన్నారు. ప్రజల్లో ఆమె గీత సరిగా లేదన్నారు. ఆమెకు పొలిటికల్‌ లైఫ్‌ వద్దని, ఏకంగా రాసేశారు తలరాత. పార్టీలోకి వస్తానంటే, వద్దని గీత...

ఆమె రాజకీయ రాత బాగాలేదన్నారు. ప్రజల్లో ఆమె గీత సరిగా లేదన్నారు. ఆమెకు పొలిటికల్‌ లైఫ్‌ వద్దని, ఏకంగా రాసేశారు తలరాత. పార్టీలోకి వస్తానంటే, వద్దని గీత గీసేశారు. కానీ తన రాత బాగాలేకపోవడం కాదు, ప్రజల్లో తన గీత బాగుందని నిరూపించారు ఆ వనిత. ఆమె పేరు గీత. దురదృష్టవంతులను అందలం ఎక్కించలేరు. అదృష్టవంతుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరన్న మాటకు దీటైన గీత. ఇంతకీ ఆమె రాజకీయ జీవితాన్ని మలుపులు తిప్పిన పార్టీలేవి..? చివరి క్షణంలో ఆమె రాత ఎలా మారింది...?

తాజా రాజకీయాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ వంటి లక్కీయెస్ట్‌ వుమన్‌ ఎవరూ లేరని, రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్న గీత, దశాబ్దకాలంపాటు సామాన్య కార్యకర్త నుంచి చురుకైన నేతగా దూసుకుపోయారు. జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా, తొలుత స్త్రీ సంక్షేమ శాఖ రీజనల్ చైర్ పర్సన్ గా చేశారు. అక్కడి నుంచి మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం, జడ్పీటీసీగా మరో మలుపు తీసుకుని, జడ్పీ చైర్మన్‌గా దూసుకుపోయారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా తిరిగి ఇప్పుడు ఎంపీగా చకచకా సాగిపోయారు.

అయితే తాను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు వంటి కొంతమంది కీలక నేతలు, తన ఎదుగుదలను సహించలేకపోయారని గీత బాధపడ్డారట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. ఏదో అదృష్టం కొద్దీ జెడ్పి చైర్ పర్సన్‌గా అయ్యారు, ఎమ్మెల్యే ఎలా ఇస్తారని అప్పట్లో కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగా విమర్శించారు. కానీ ఆ కామెంట్లను తిప్పటికొట్టేలా విజయంతో బదులిచ్చి, తన రాజకీయ తలరాతకు ఎదురులేదని నిరూపించారు గీత.

ప్రజారాజ్యం తరువాత తిరిగి మాతృసంస్థ టిడిపిలో చేరాలని విశ్వ ప్రయత్నం చేశారు. దానికి కొంతమంది టీడీపీ నేతలు మద్దతు పలికినప్పటికి, పెద్దలు మాత్రం గీతకు అడ్డుగీత గీశారు. నిష్కర్షగా తోసి పుచ్చారు. ఆ దశలో ఆమె ఇంచుమించుగా రాజకీయాల నుంచి దూరమవుతారన్న చర్చ జరిగింది. ఐదేళ్ళ కాలం ప్రజలతో మమేకం కాలేకపోయారు. ఎప్పుడూ ప్రజలతో మమేకం అయ్యే ఆమె, ఒంటరితనాన్ని భరించలేకపోయానని, తన సన్నిహితులతో చెప్పారు.

రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలంటే, తెలుగుదేశం దరిచేరనీయదు. అలాగని కొత్తగా వచ్చిన జనసేన ఆమె వైపు చూడలేదు. అయితే ప్రజల్లో తన పట్ల అపార నమ్మకముందని భావించిన గీత, వైసీపీ గడప తొక్కారు. ఆఖరి నిమిషంలో ఆమెకు రెడ్‌ కార్పెట్ పరిచారు జగన్. పట్టుమని పక్షం రోజులు సమయం లేకున్నా, పిలిచి పిల్లనిచ్చినట్లుగా, ఆమెకు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దురదృష్టవంతులను అందలం ఎక్కించ లేరు, అదృష్టవంతుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అనేందుకు గీత రాజకీయ రాతే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. జడ్పీ చైర్‌పర్సన్‌‌గా ఉన్నప్పుడు జిల్లా అంతటా విస్తృత పరిచయాలను పెంచుకున్న గీత, తన రాజకీయ గీతను పాజిటివ్ ఓట్ బ్యాంకుగా మలచుకోగలిగారు. తెలుగుదేశంతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా కాపు నేతగా అన్ని పార్టీల్లోని నేతలతో కమ్యూనికేషన్ ఉంది.

ముఖ్యంగా చిరంజీవి, ఆ తర్వాత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌తో విస్తృత పరిచయాలున్నాయి గీతకు. అయినా గాని ఏ ఒక్కరూ టిక్కెట్ ఇచ్చి బరిలో దింపాలని కనీసం ప్రయత్నించలేదు. అసలు గీతను పరిగణలోకి తీసుకోలేదు. అంతవరకు వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ ఉంటారని భావిస్తే, ఆయన తెలుగుదేశం వైపు వెళ్లారు. ఈ దశలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో విస్తృత పరిచయాలు ఉన్న గీతపై, వైసిపి నేతల దృష్టి పడింది. అంతే హుటాహుటిన అధినేత జగన్మోహన్‌ రెడ్డి, వద్దకు తీసుకువెళ్లడం, ఒప్పించడం, బరిలోకి దింపడం, విజయ పతాకం ఎగుర వేయడం, అన్నీ అంచెలంచెలుగా, చకచకా జరిగిపోయాయి. గీత రాత బాగుంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా ప్రారంభమైందని, ఆమె సన్నిహితులు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రెండో పర్యాయం పార్లమెంటులో అడుగు పెట్టారు వంగా గీత. ఆమెను తీవ్రంగా వ్యతిరేకించిన కొంతమంది వ్యక్తులు, ఆమె గెలుపును చూసి ఆశ్చర్యపోతున్నారట. అయితే తన గీత, రాత బాగుండబట్టే లక్కీగా ఎంపీ అయ్యానంటే ఒప్పుకోరట వంగాగీత. ప్రజల్లో తన చేతల పట్ల నమ్మకముంది కాబట్టే, తన గీతను, రాతను వారే తీర్చిదిద్దారని చెబుతారామె.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories