Top
logo

చిత్తానికి మాట్లాడితే చిక్కులు తప్పవు!

చిత్తానికి మాట్లాడితే చిక్కులు తప్పవు!
Highlights

మైకు కనిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి కొందరికి. మాట్లాడటం మొదలెట్టాకా ఏ పక్కనుంచైనా చప్పట్ల శబ్దం...

మైకు కనిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి కొందరికి. మాట్లాడటం మొదలెట్టాకా ఏ పక్కనుంచైనా చప్పట్ల శబ్దం వినిపించిందనుకోండి ఇక వాళ్ల ప్రసంగం అనబడే వాగుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. సాధారణంగా ఈ జబ్బు చిన్న చిన్న సమావేశాల్లో తమ ప్రత్యేకతని చాటుకోవడానికి ప్రయత్నించే వ్యక్తుల్లో చూస్తుంటాము. ఇపుడు అది పెద్ద నాయకుల్లో కూడా చూడాల్సి రావడం మం ఖర్మ. రాజ్యాల్ని ఏలేవాళ్ళు కూడా ఇష్టం వాచినట్టు మాట్లాడేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ మాటలు కోటలు దాటేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన దగ్గరనుంచి ఎలా బడితే అలా మాట్లాడేస్తున్నారాయన. దేశ భద్రతను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులను నా సైన్యం అంటూ ఆ మధ్య మాట్లాడి చిక్కులు తెచ్చుకున్నారు. అయినా, ఆయన తీరు మారలేదు. ఇప్పటికీ సైన్యం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆలా మాట్లాడొచ్చా లేదా అన్నది పక్కన పెడితే, రాజకీయ అవసరాల కోసం దిగజారుడుగా మాట్లాడటం సరైనది కాదనేది వాస్తవం. మొన్నటికి మొన్న ఆయన హాస్యాస్పందంగా మాట్లాడి ప్రజల్లో పలుచన అయ్యారు. బాలాకోట్ మెరుపు దాడుల సమయంలో ఆకాశం మేఘావృతంగా ఉందని వైమానిక దళం చెపితే, తాను మబ్బులు ఉన్నపుడు రాడార్లు మన విమానాల్ని గుర్తించలేవని చెప్పి వారిని దాడులకు పంపించానని సెలవిచ్చారు. సరే.. రాడార్లు మబ్బుల్లో విమానాల్ని గుర్తిస్తాయో.. లేదో కాసేపు పక్కన పెడితే, ఆ ఉదంతాన్ని ఊటంకించడం ద్వారా మన వైమానికదళ రహస్యాల్ని బాహ్య ప్రపంచానికి చెబుతున్నామన్న ఆలోచన కూడా లోపించింది ప్రధానికి. స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి.. నడుచుకోవాలి.. కానీ ఎన్నికల ఒత్తిడో.. ఓడిపోతామన్న భయమో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నవ్వుల పాలవుతున్నారు. అభివృద్ధి లేదా చేయబోయే మంచి చెప్పి ఓట్లు అడగాల్సిన నేతలు యుద్ధాన్ని చూపించి ఓట్లు కోరుతున్న దృశ్యం జుగుప్స కలిగిస్తోంది. పాకిస్థాన్ లాంటి దేశాల్లో యుద్ధాన్ని చూపించి అధికారానికి నిచ్చెన వేయడం మొదట్నుంచీ ఉన్న అలవాటు. ఇపుడు మన దేశంలోనూ అటువంటి దౌర్భాగ్యం దాపురించడం విచారించాల్సిన విషయం. ఇక ఈ విషయాన్ని మరిచిపోక ముందే మరోసారి నవ్వులపాలయ్యారు మోడీ. 87-88 సంవత్సరాల్లోనే తానూ డిజిటల్ కెమెరా, కంప్యూటర్ వాడాననీ, అద్వానీ ఫోటో తీసి ఢిల్లీకి మెయిల్ చేశాననీ ఆ ఫోటో తెల్లవారేసరికి పత్రికల్లో కలర్ లో అచ్చయిందనీ చెప్పుకొచ్చారు. ఇపుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మొదటి ఈ మెయిల్ 1992 లో పంపించారనీ, అసలు 87 లో డిజిటల్ కెమెరాలు ఒకటోరెండో ఉండేవని, ఆ సమయంలో చాయ్ అమ్ముకుని బ్రతికిన మీకు ఆ కెమెరా ఎలా వచ్చిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇపుడు మోడీ మానసిక స్థితి పైనా జనాలు విపరీతంగా జోకులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి చెత్త మాటలు మాట్లాడి ప్రధాని పదవికి ఉన్న హోదాని బజారు కీడ్చవద్దని ప్రజలు కోరుతున్నారు. మొత్తమ్మీద మోడీ ఎన్నికల చివరికి వచ్చేసరికి తన ప్రచార ప్రయాణం లో అలసిపోయినట్టున్నారు. పైగా ఎండలూ మండిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ ప్రధానిగా ఉండాలనుకుంటున్న మోడీ ని ఎలా చూడాల్సి వస్తుందోనని జనం బాధపడుతున్నారు.

Next Story