Top
logo

మోడీని మళ్లీ మోస్తారా... అందలమెక్కిస్తారా?

మోడీని మళ్లీ మోస్తారా... అందలమెక్కిస్తారా?
Highlights

యూపీఏ పదేళ్ల అవినీతి పాలనతో జనం విసిగిపోయిన సమయం, మరోవైపు గుజరాత్‌లో హ్యాట్రిక్ విజయాలు, అభివృద్ది నమూనాతో...

యూపీఏ పదేళ్ల అవినీతి పాలనతో జనం విసిగిపోయిన సమయం, మరోవైపు గుజరాత్‌లో హ్యాట్రిక్ విజయాలు, అభివృద్ది నమూనాతో నరేంద్ర మోడీ. ఆ క్షణంలో మోడీ తిరుగులేని నేతగా, దేశానికి దిక్సూచిగా జనానికి కనపడ్డారు. అందుకే 2014లో తిరుగులేని విజయం కట్టబెట్టారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ అంటూ నినదించిన మోడీ-షా ద్వయం, ఆ తర్వాత రాష్ట్రాల్లోనూ, హస్తంపార్టీ వేళ్లను పెకలించేశారు. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, గుజరాత్‌, గోవా, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, త్రిపుర, జమ్మూ కశ్మీర్‌... ఇలా ప్రతీ రాష్ట్రాన్నీ హస్తం నుంచి లాగేసుకున్నారు. అది తమ క్రెడిట్‌గా ప్రచారం చేసుకున్నారు మోడీ, షా. అయితే మోడీ జైత్రయాత్రకు బ్రేకులు వేసింది 2018. కర్ణాటకలో అధికారాన్ని చేజక్కించుకోలేకపోయింది బీజేపీ. ఫూల్‌పూర్‌, గోరఖ్‌పూర్‌ సహా దాదాపు 14, బై ఎలక్షన్స్‌లో కమలం వాడిపోయింది. తరువాత సెమీఫైనల్స్‌గా భావించిన మూడు కీలక హిందీబెల్ట్‌ రాష్ట్రాలు- మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌లలోనూ, పరాజయం తప్పలేదు. మోడీ మానియా మసకబారుతోందని, విపక్షాల చేస్తున్న ప్రచారానికి సెమీఫైనల్స్‌ బూస్ట్‌‌నిచ్చాయి.

పార్లమెంట్‌ ఎన్నికల్లో మిషన్‌ 350 అంటూ మూడేళ్ల ముందే టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్నారు మోడీ అమిత్ షా. మిషన్‌ 350 కాదు కదా, కనీసం 272 కూడా అయ్యేట్టు లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే నాలుగున్నరేళ్లలో వ్యతిరేకతను బాగానే మూటకట్టుకున్నారు. నల్లధనం వెలికితీసి, జనం అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్న హామీ, నిజంగా జుమ్లాగా మారిపోయింది. పెద్ద నోట్ల రద్దు, ఇప్పటికీ పీడకలగానే జనం మదిలో ఉండిపోయింది. జీఎస్టీతో చిరువ్యాపారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక ఆర్బీఐ, ఈడీ, సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల్లో మితిమీరిన జోక్యం‌ దేశమంతా చూసింది. దీనికితోడు కాంగ్రెస్ ముక్త్ భారత్‌ అంటూ కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి మరకలు మోడీకి బాగానే అంటుకున్నాయి. వరుసగా మూడు రాష్ట్రాల్లో పరాజయం కూడా, మోడీ పనితీరుకు నిదర్శనమన్న వ్యాఖ్యానాలు, మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ఒకవేళ మోడీ సొంతంగా మెజారిటీ సాధించకపోతే, ఆయన రాజకీయ జీవితానికే సంక్షోభం కావచ్చు. సంకీర్ణమే వస్తే, మోడీని మిత్రపక్షాలు వ్యతిరేకించే అవకాశమే ఎక్కువ. ఇప్పటికే మోడీ-షా ఒంటెత్తు పోకడలు పోతున్నారంటూ, నివురుగప్పిన నిప్పులా, సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. యశ్వంత్ ‌సిన్హా, అరుణ్‌ శౌరి, నేరుగా అటాక్ చేస్తున్నారు. గడ్కరీ కూడా స్వరం పెంచుతున్నారు. పూర్తి మెజారిటీ రాకపోతే, మోడీపై బాహాటంగా విమర్శలు చేసేవారి సంఖ్య మరింత పెరగొచ్చు. ఇలాంట ిపరిస్థితులే వస్తే, మోడీ రాజకీయ జీవితమే తెరమరుగు కావచ్చు. నాలుగున్నరేళ్ల పాలనకు, నరేంద్ర మోడీ సమాధానం చెప్పుకోవడం కాదు, సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకే సంస్కరణల పథం వదిలి, సంక్షేమ బాటపట్టి, నాలుగున్నరేళ్ల వ్యతిరేకతను, వచ్చే నాలుగు నెలల్లో చెరిపివేయాలని మోడీ తలపోస్తున్నారు. రైతు బంధులాంటి పథకం, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మెరుగైన పంటల బీమా వంటి పథకాలకు ప్రణాళిక వేస్తున్నారు. అంతేకాదు, ఐదేళ్ల పాలనలో, తాను ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలను ఎకరువుపెట్టాలనుకుంటున్నారు. ప్రధాన పథకాలైన ఉజ్వల స్కీం, ఆయుష్మాన్‌ భారత్‌, రైతాంగానికి వరాలు, అనేక సరుకులకు జీఎస్టీ రేటు తగ్గింపు, పటుతరమైన నాయకత్వం, రక్షణ, విదేశాంగ రంగాల్లో దూకుడు.. మొదలైనవి అస్త్రంగా ప్రయోగించాలని భావిస్తున్నారు.

కొత్త సంవత్సరంలో పార్లమెంట్‌ ప్రచార సమరాన్ని ముందే మొదలుపెడుతున్నారు మోడీ. 20 రాష్ట్రాల్లో వంద సభలకు ప్రణాళిక రెడీ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో ప్రచారం ప్రారంభించబోతున్నారు. గత ఎన్నికల్లో తాము ఓడిపోయిన 123 సీట్లను గెలిచేందుకు ''మిషన్‌ 123'' పేరిట ఓ కార్యాచరణ సిద్ధమైంది. ఈ 123 నియోజకవర్గాలను 25 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు, ఒక్కో సీనియర్‌ నేతను ఇన్‌చార్జిగా నియమించి విజయ బాధ్యతలను అప్పజెప్పారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. 15 వేల మంది హాజరయ్యే ఈ సమావేశాల్లో కిందిస్థాయి నేతలకు దిశానిర్దేశం జరుగుతుంది. 2014 తర్వాత మీడియాకు ముఖం చాటేసిన మోడీ, చాలా ఏళ్ల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. సంస్కరణల నిర్ణయాలను సమర్థించుకున్నారు. విపక్షాలను తిట్టిపోశారు. ఇక కాస్కోండి వస్తున్నా అన్నట్టుగా, న్యూఇయర్‌ ఇంటర్వ్యూతో తొడకొట్టారు. ఒకవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓటమి, మరోవైపు విపక్షాల మహాకూటమి, ఇంకోవైపు వాగ్దాన భంగం, నాలున్నరేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, సొంత పార్టీలోనే అసంతృప్తి, ఇలా సకల సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మోడీకి, 2019 నిజంగా అగ్నిపరీక్ష. గెలిస్తే, చరిత్ర సృష్టించినట్టే. ఓడితే మాత్రం, చరిత్రలో కలిసిపోవడం ఖాయం. అందుకే 2019ని జీవన్మరణంగా భావిస్తున్నారు నరేంద్ర మోడీ. మరి మోడీని జనం మళ్లీ అందలమెక్కిస్తారా...

Next Story

లైవ్ టీవి


Share it