ఢంకా బజాయిస్తున్న రాజ్‌ఠాక్రే..

ఢంకా బజాయిస్తున్న రాజ్‌ఠాక్రే..
x
Highlights

ఆయనే కాదు ఆయన పార్టీ కూడా లోక్‌సభ బరిలో లేదు. అయినా ఆయన ప్రచార సభలకి జనం వెల్లువెత్తుతున్నారు. ఒక్కో మాట తూటాలా పేలుతుంటే ఈలలు, చప్పట్లతో సభలు...

ఆయనే కాదు ఆయన పార్టీ కూడా లోక్‌సభ బరిలో లేదు. అయినా ఆయన ప్రచార సభలకి జనం వెల్లువెత్తుతున్నారు. ఒక్కో మాట తూటాలా పేలుతుంటే ఈలలు, చప్పట్లతో సభలు మార్మోగిపోతున్నాయి. ఆయన టార్గెట్‌ ప్రధానమంత్రి మోడీ. ఒకప్పుడు వీరభక్తుడుగా ఉన్న ఆ నాయకుడు... ఇప్పుడు అరవీర భయంకర శత్రువు. సరికొత్త ప్రచారంతో మోడీ పక్కలో బల్లెంలా మారిన ఆ నేత ఎవరు? ఆయన చేస్తున్న ప్రచారం ఎలా ఉంది? దాని ప్రభావం ఎంత ?

ఇదిగో ఇందా చెప్పుకుంది ఈ నాయకుడి గురించే. పేరు రాజ్‌ఠాక్రే. మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ్‌ సేన అధినేత. ఈయన పార్టీ ఇప్పుడు లోక్‌సభ బరిలో లేదు. అయినా ప్రచారానికి వెళ్తారు.. ప్రత్యర్థిని చీల్చిచెండాడతుంటాడు. ఎన్నికల బహిరంగ సభ ఎక్కడైనా రాజ్‌ఠాక్రే వస్తున్నారంటే ఇసుక వేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. తమ ప్రియ తమ నాయకుడు ఏం చెబుతారా అన్న ఆసక్తి అక్కడికొచ్చిన వారందరిలోనూ కనిపిస్తోంది.

రాజ్‌ఠాక్రే లక్ష్యం ప్రధాని మోడీ. టార్గెట్‌ను బేస్‌ చేసుకొని ఆయన చేసే ప్రసంగం సూటిగా సుత్తి లేకుండా సాగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే అదొక రియాల్టీ చెక్ అంటారు ఆయన అభిమానులు. మోదీ చెప్పిన మాటల్లో నిజానిజాలెంతో సాక్ష్యాధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేయడం రాజ్‌ఠాక్రేకు అలవాటుగా మారిందిప్పుడు. మోడీ చెప్పిన ప్రతీ మాటకి రాజ్‌ ఠాక్రే నుంచి కౌంటర్‌ తూటాలా పేలుతుంది. మోడీ ఇచ్చిన హామీలు ఎలా గాల్లో కలిసిపోయాయో, మోదీ, షా ద్వయం ఎన్ని అబద్ధాలు చెప్పారో, ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో గణాంకాలతో సహా వివరిస్తున్నారు. 51 ఏళ్ల వయసులోనూ రాజ్‌ ఠాక్రే తన ప్రసంగాలతో జనంపై సమ్మోహనాస్త్రం వేస్తున్నారు.

మహారాష్ట్ర మీడియా రాజ్‌ సభలకి అద్భుతమైన కవరేజ్‌ ఇస్తోంది. అదే సమయంలో మోడీ సభ లైవ్‌ వస్తున్నా కట్‌ చేసి మరీ రాజ్‌ఠాక్రే సభనే చూపిస్తున్నారంటే ఆయన చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం ఎంతలా జనంలోకి చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. రాజ్‌ చేస్తున్న ఈ ప్రచారం ఎన్నికల్లో ఓట్లు వేసినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పెద నాన్న, మరాఠీ టైగర్‌ బాల్‌ఠాక్రే తనని శివసేనకు వారసుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్న రాజ్‌ఠాక్రే అవి అడియాసలు కావడంతో 2006లో పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. కొత్త పార్టీ పెట్టాక రాజ్‌ఠాక్రే చేసే రెచ్చగొట్టే ప్రసంగాలకు జనం మంత్రముగ్ధులయ్యారే తప్ప ఆయనకు ఓట్లు మాత్రం రాలలేదు. రాజ్‌ఠాక్రే జనాకర్షక నాయకుడే కానీ ఓట్లు రాబట్టే నాయకుడు కాదన్న పేరు కూడా ఉంది. మరి ఈ సారి ఠాక్రే చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఏ మేరకు ఓట్ల పంట పండిస్తుందన్నది చూడాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.!!

Show Full Article
Print Article
Next Story
More Stories