Top
logo

మమతా బెనర్జీ బల ప్రదర్శనా?

మమతా బెనర్జీ బల ప్రదర్శనా?
Highlights

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తనసొంత గడ్డపై నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీ, నిజంగా ఘనమైన సభగానే హోరెత్తింది. ఈ రేంజ్‌లో నాయకులు వస్తారని ఊహించలేదు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తనసొంత గడ్డపై నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీ, నిజంగా ఘనమైన సభగానే హోరెత్తింది. ఈ రేంజ్‌లో నాయకులు వస్తారని ఊహించలేదు. చివరి నిమిషం వరకూ ఎవరొస్తారో, అసలు సక్సెస్ అవుతుందో లేదో కూడా అందరూ అనుమానించారు.

ఐతే, మమతా బెనర్జీ, రాత్రి వరకూ మరోసారి అందరికీ ఫోన్లు చేశారు. కోల్‌కతా సభకు రావాల్సిందిగా కోరారు. నిజంగా 20కి పైగా ప్రాంతీయ పార్టీల అధినేతలను రప్పించారు. సభకు రాని కొందరు నాయకులు వారి తరపున ప్రతినిధులను పంపించారు. వీరందర్నీ కోల్‌కతా గడ్డపై నిలపడంలో, ఆతిధ్యమివ్వడంలో, మమతా బెనర్జీ సక్సెస్ అయ్యారు. ఇది విపక్షాల ఐక్యతా సభ కంటే కూడా, మమతా బెనర్జీ బలప్రదర్శనగానే ఎక్కువగా కనిపిస్తోంది. వేదిక మీద ఆసీనులైన అత్యధిక నేతల ఆశ ప్రధాని పదవిపైనే.

వేదిక మీద కూర్చున్న ప్రతినాయకుడూ, ఉద్దండుడే. భిన్నమైన ప్రాంతీయ పార్టీలు, భిన్నమైన నేపథ్యాలు ఎవరికివారే మహానాయకులుగా, దేశంలో అత్యంత గొప్ప నాయకుల్లా, మోడీకి దీటైన లీడర్లా ఫీలవుతున్నవారే. ఇంకా సూటిగా చెప్పాలంటే, వేదిక మీద కూర్చున్న అత్యధిక నేతలు ప్రధాని పదవి ఆశిస్తున్నవారే. విపక్ష నాయకులందర్నీ రప్పించిన మమత అందులో మొదటి వరుసలో ఉంటారు.

విపక్ష నాయకులు ఐక్యత చాటుకున్నారు సరే. కానీ చీలికలు, పేలికలుగా ఉండి, ఇప్పటికప్పుడు ఏకమైన, ఏకమైనట్టుగా కనిపిస్తున్న పార్టీలన్నింటినీ ముందుండి నడిపించేదెవరు...మోడీకి దీటైన నాయకుడిగా ముందుపెట్టేదెవరు. ప్రధాని అభ్యర్థిగా ఉండేదెవరు...రాహుల్‌ నాయకత్వాన్ని బలపరిచేదెవరు...ఇవన్నీ సమాధానంలేని ప్రశ్నలు. బహుశా ఎన్నికల అయిపోయే వరకు, ఇదే గందరగోళం కంటిన్యూ అవ్వడం ఖాయం. ఫలితాలు వచ్చాక, ఎవరికెన్ని సీట్లు వచ్చాయో తేలాక, వారివారి బలాన్ని బట్టి...అప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్‌ శక్తిని బట్టి, వారి బలహీనతలను బట్టి, అదనుచూసి, పాచిక వేసేందుకు, లోలోపల చాణక్యవ్యూహం రెడీ చేసుకునే ఉన్నారు నాయకులు. కానీ ఇప్పుడు బయటపడరు. అదే కూటమి ముందున్న సవాలు. ఇదే తన సానుకూలాంశమని బీజేపీ కూడా అనుకుంటోంది.

ఇప్పుడు మమతా బెనర్జీ కోల్‌కతాలో సత్తాచాటారు. వేదిక మీదున్న నేతలపై ఒకరకంగా పైచేయి సాధించారు. ఇప్పుడు మమతను ఇతర నేతలు ఫాలో అయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రివాల్ ఢిల్లీలో, కోల్‌కతా తరహాలోనే విపక్షాల ఐక్యతా సభ ఏర్పాటు చేస్తానంటున్నారు. అమరావతిలో చంద్రబాబు కూడా భారీ సభ పెట్టేందుకు రెడీ అంటున్నారు. ఆ తర్వాత లక్నో, ఆ తర్వాత రాహుల్‌ సభ మరోచోట. అందరికంటే తామే మిన్న అనిపించుకునేందుకు, తహతహలాడుతున్నారు పార్టీల అధినేతలు. నేతల ఆలోచనలు, ఆకాంక్షలు ఎలా ఉన్నా, బ్రిగేడ్ మైదానం సాక్షిగా మోడీకైతే సమరసంకేతం పంపడంలో సక్సెస్ అయ్యారు. ఇక వరుసపెట్టి సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.

Next Story