త్యాగాన్ని కోరే ప్రేమ... ఎందుకిలా బలి కోరుతోంది???

త్యాగాన్ని కోరే ప్రేమ... ఎందుకిలా బలి కోరుతోంది???
x
Highlights

నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది.. కానీ నేటి ప్రేమలు బలి కోరుతున్నాయి.. తనకు దక్కనిది మరెవరికీ దక్కరాదన్న అక్కసుతో నేటి యువత ప్రవర్తిస్తోంది....

నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది.. కానీ నేటి ప్రేమలు బలి కోరుతున్నాయి.. తనకు దక్కనిది మరెవరికీ దక్కరాదన్న అక్కసుతో నేటి యువత ప్రవర్తిస్తోంది. దారికి రాకపోతే చంపేయడం.. లేకపోతే చనిపోయేలా మానసికంగా హింసించడం.. టీవీ నటి ఝాన్సీ ఆత్మ హత్యా ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తోంది.

ఆడపిల్లలపై దాడులు ఒకప్పుడు లేవు.. సమాజం మారుతున్న కొద్దీ దాడులూ పెరుగుతున్నాయి.. ఆడపిల్లలు ఆంక్షల బంధనాలు చీల్చుకుని నలుగురిలోకి వచ్చి.. అద్భుతమైన విజయాలు సాధిస్తుంటే.. అభినందించాల్సిన మగవారు ఆత్మ రక్షణలో పడిపోతున్నారా? ఇన్నాళ్లూ ఇంటి పనులు, బయటి పనులన్న తేడాల అంతరాలు ఇప్పుడు తొలగిపోతున్నాయా? ఈ మార్పే మగవారిలో అభద్రతా భావాన్ని కలిగిస్తోందా? ఆడవారిని తమ ఆలోచనలతోనూ, అభిప్రాయాలతోనూ ఇంకా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆడవారు ఎంతలా ఎదుగుతుంటే వారిపై దాడులూ అంతలా పెరుగుతున్నాయి. 70, 80 దశకాల్లో ఇన్ని దాడులు లేవు.. ఇంత హింసాత్మకమూ లేదు..కానీ ఇప్పుుడు తెగింపు ఎక్కువవుతోంది..

చదువు, ఉద్యోగం పేరుతో ఆడపిల్ల బయట ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి ఆమెపై ఆంక్షలు, ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. ఎక్కడి దాకానో ఎందుకు మన ఇంట్లోనే పిల్లల పెంపకంలో స్పష్టమైన తేడాలున్నాయి. ఆడపిల్ల అంటే ఇంటి పనులు, వంట పనులకు పరిమితం.. మగపిల్లవాడంటే అపరిమితమైన స్వేఛ్ఛకు ప్రతిరూపం .. మన సమాజాల్లో మగపిల్లలున్న ఇంట్లో తల్లి దండ్రుల ఆలోచనా విధానం ఇదే.. ఆడపిల్ల అంటే అణుకువతో మసలు కోవాలి.. తిడితే పడాలి. కొడితే అడ్డు చెప్పకూడదు.. ఆడపిల్లలున్నది భరించేందుకే అన్న ధోరణిలోనే మన పిల్లల పెంపకం సాగుతోంది. ఆడపిల్లలను ఆంక్షల వలయంలో బంధిస్తూ .. మగ పిల్లలను మాత్రం హద్దుల్లేని స్వేచ్ఛకు కేరాఫ్ అడ్రస్ లా మనం ట్రీట్ చేస్తున్న విధానమే సకల సమస్యలకూ మూలం.. అన్నది సామాజిక శాస్త్రవేత్తల అంచనా..

ఆడపిల్లలపై మన సమాజంలో గతంలోకంటే మార్పు వచ్చినా.. ఈ మార్పు మధ్యతరగతి సమాజాల్లో మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి.. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో మగపిల్లల పెంపకంలో మనం చేస్తున్న పొరపాట్ల ఫలితమే ఈనాటి సామాజిక సమస్యలకు కారణం.. ఆడపిల్లలను చదువు కోసం బయటకు పంపుతున్నాం సరే.. కానీ మగపిల్లల దృష్టి కోణం మార్చేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. ఆడపిల్లల పట్ల చులకన, తేలిక భావం కలగడానికి తల్లి దండ్రుల పెంపకలోపమే కారణం.. ఆడపిల్లలంటే ఎంత చిన్న చూపు లేకపోతే నిందితుడు భరత్ మధూలికను మట్టు పెట్టడానికి తెగించాడు?తన ప్రేమను నిరాకరిస్తోందన్న కసితో కొబ్బరి బొండాలు నరికే కత్తితో పథకం ప్రకారం దాడికి పాల్పడ్డాడంటే.. నిందతుడికి ఆడపిల్లల పట్ల ఎంత చులకన భావముందో అర్ధమవుతోంది.

తన ప్రేమను తిరస్కరించిన అమ్మాయికి బతికే హక్కు లేదన్నంత మూర్ఖత్వం రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. .ఎదుటి వ్యక్తిని గాయపరచాలన్నంత కోపం, కసి, అక్కసు ఆ యువకుడిలో బలపడటానికి మూల కారణం చిన్నప్పటి నుంచి పెరిగిన తీరే కారణం కావచ్చు.. వస్తువులపై కాంక్ష ఉండొచ్చు.. వాటిని ఏరి, కోరి సాధించుకోవచ్చు.. కానీ వ్యక్తులను ఏకపక్షంగా కోరుకోడం అనైతికం... ఎదుటి వ్యక్తి భావాలను, అభిప్రాయాలను గౌరవించగలిగే సంస్కారం లేని వ్యక్తి సమాజంలో ఉండేందుకే అర్హుడు కాడు. . ఎదిగే మగపిల్లలు ప్రేమకు, కాంక్షకు మధ్య నున్న తేడాని గుర్తించగలిగేలా తల్లి దండ్రుల పెంపకం ఉండాలి.. ప్రేమన్నది ఏకపక్షం కాకూడదని, ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలిస్తేనే ప్రేమ సాధ్యమని తెలియచెప్పాలి.. కుటుంబమే కాదు.. రెండో కుటుంబం లాంటి పాఠశాలలోనూ సామాజికాంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.

మన పాఠ్యపుస్తకాల్లో ఆడ, మగ వివక్షకు దోహదపడుతున్న అంశాలను గుర్తించి పిల్లలకు తెలియ చెప్పేలా పాఠాలుండాలి.. మగ పిల్లలకు జెండర్ సెన్సిటివిటీపై అవగాహన కల్పించే విధంగా మన పాఠ్యపుస్తకాలలో చొప్పించాలి.. నిందితుడు భరత్ బాధితురాలి కుటుంబ సభ్యులని ఇంట్లో గడియపెట్టి బంధించి ఆపై రోడ్డుపై బాలికపై దాడి చేశాడని దర్యాప్తులో తేలింది. మందలించినందుకు బాధిత బాలిక తల్లిదండ్రులకు దక్కిన సన్మానం ఇది.. నిందితుడి హింసా ప్రవృత్తికి ఇంతకన్నా తార్కాణం ఏముంటుంది? పిల్లల పెంపకంలో తల్లి దండ్రుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం ఈ సంఘటన..అలాగే ఘోరమైన నేరాలకు, దాడులకు పాల్పడుతున్న నిందితులకు కఠినమైన శిక్షలు లేకపోవడం కూడా ఆడపిల్లలపై దాడులు పెరగడానికి కారణమవుతోంది. ఏడాది, రెండేళ్ల జైలు శిక్షలకు నిందితులు భయపడటం ఎప్పుడో మానేశారు.. ఎదుటి వ్యక్తికి శాశ్వతమైన నష్టం కలిగేలా గాయపరచి జీవితంతో ఆటాడుకున్న మూర్ఖులకి వారి జీవితకాలం పశ్చాత్తాప పడేంత కఠినమైన శిక్షలు వేస్తే నైనా ఈ ఈగడాలకు అడ్డుకట్ట పడుతుందా?

ప్రవర్తన పరంగా కట్టడి లేని వారికి చట్టపరంగా శిక్షించి దారిలోకి తేవడమొకటే మార్గం.. కానీ ఆ చట్టాలూ లోపభూయిష్టంగా ఉండటం వల్ల బాధితులకు న్యాయం దక్కటం లేదు.. నిర్భయ చట్టం తర్వాత ఆడవారి భద్రత కోసం కఠినమైన చట్టాలు తెచ్చినా వాటి ఆచరణలో సమస్యలు ఎదురవుతున్నాయి. అన్నింటికన్నా మించి తల్లి దండ్రులు పిల్లల పెంపకంలో బాధ్యతతో వ్యవహరించకపోతే ఇలాంటి ఆవారాలు, పోకిరీలు, రికామీలు ఎక్కువవుతారు. వారికి సభ్యత, సంస్కారం నేర్పడం తల్లిదండ్రుల కనీస బాధ్యత..

Show Full Article
Print Article
Next Story
More Stories