డిల్లీలో ఏ పార్టీ మెరుస్తుందో...!!

డిల్లీలో ఏ పార్టీ మెరుస్తుందో...!!
x
Highlights

సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడిన హస్తిన ప్రజలు. మరో చారిత్రత్మక తీర్పునకు సిద్ధమయ్యారు. ఓటుకు నోటు కాదు.. నోటు చూపిస్తే వేటు వేసుడే అంటున్న ఢిల్లీ...

సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడిన హస్తిన ప్రజలు. మరో చారిత్రత్మక తీర్పునకు సిద్ధమయ్యారు. ఓటుకు నోటు కాదు.. నోటు చూపిస్తే వేటు వేసుడే అంటున్న ఢిల్లీ ఓటర్లు. పబ్లిసిటీ జిమ్మిక్కులకు షాకిస్తామంటున్నారు. దేశ రాజకీయాల్లో కొత్త శకం దేశ రాజధాని నుంచే మొదలుకావాలని ఆరాటపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుదెబ్బకు పరారైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీయాలని ఎదురు చూస్తున్నాయి. మొత్తంగా మూడు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఎవరి బలం ఏంటి? హస్తిన ప్రజలు ఏమనుకుంటున్నారు? దీనిపై హెచ్‌ఎంటీవీ ఢిల్లీ కేంద్రంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

హస్తిన రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం కాబోతోందటున్నారు ప్రజలు. సామాన్యుడిని ఢిల్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టిన హస్తిన ఓటర్లు... నోట్ల కట్టలు కాదు ఎన్నికల్ని శాసించేది. పసలేని విమర్శలు కాదు రాజకీయాలకి కావాల్సింది అంటూ కొత్త నినాదాన్ని వినిపిస్తున్నారు. కోరి తెచ్చుకున్న మార్పు, తమ జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ఢిల్లీ ప్రజానీకం గర్జిస్తోంది. మరి ఐదేళ్ళ పాలనలో అధికార కమలం, ప్రతిపక్ష హస్తం.. సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా? ఢిల్లీ ఎన్నికల నుంచి ఏ పార్టీ ఏ గుణపాఠాన్ని నేర్చుకున్నాయి.?

ఢిల్లీ దేశానికే కాదు సమస్యలకూ రాజధానే. ఆ సమస్యల్ని ఊడ్చేస్తానంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చీపురు పట్టుకొని మరీ రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రమే మారిపోయింది. కేజ్రీవాల్‌ క్రేజ్‌ దేశాన్ని ఊపేసింది. కానీ ఆయనకున్న జనాకర్షక శక్తి గత లోక్‌సభ ఎన్నికల్లో మోడీ హవా ముందు వెలవెలబోయింది. 2014 ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఏడు స్థానాలకు గాను ఏడింట్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. వారణాసిలో మోడీనే సవాల్‌ చేసి కేజ్రీవాల్‌ భంగపడ్డారు. పడిలేచిన కెరటంలా మళ్లీ ఏడాదికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పుంజుకుంది. కాంగ్రెస్‌ అడ్రస్సే గల్లంతైంది. ఆ తర్వాత రెండేళ్లకి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ చతికిలపడింది. ఇలా కేజ్రీవాల్‌ పార్టీకి ఆదరణ పెరుగుతూ, తగ్గుతూ ఉండడంతో ఈసారి ఓటరు నాడి పట్టుకోవడం రాజకీయ పరిశీలకులకు కూడా అందట్లేదు.

2015 నాటికి మారిన సీన్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్‌ మొత్తం మారిపోయింది. ఎవరి అంచనాలకు అందని విధంగా ఏకంగా 54శాతం ఓటు షేర్‌తో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో ఆప్‌ విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 32 శాతం ఓట్లతో మూడు స్థానాల్లో నెగ్గితే, కాంగ్రెస్‌ పార్టీ 9.7 శాతం ఓట్లతో ఒక్క ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపలేక ఘోర పరాజయం పాలైంది.2017లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆప్‌ ఓట్లు సగానికి సగం తగ్గిపోయాయి. కేవలం 24శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తన పాలనా విధానాలతో మధ్యతరగతి, దిగువ తరగతి ఓటర్ల మద్దతు సంపాదించిన కేజ్రీవాల్‌ స్థానిక సమరంలో కాషాయం పార్టీతో పోటీ పడలేకపోయారు. మొత్తం 272 మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్లలో బీజేపీ మూడింట రెండొంతులు మెజారిటీ సాధించి లోకల్‌ కింగ్‌గా మారింది.

ఈసారి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అందరిదీ ఒంటరిపోరాటమే. కాంగ్రెస్, ఆప్‌ పొత్తు విఫలంతో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాని మోడీని ఓడించడానికి ఈసారి చేతులు కలపాలని తుదివరకూ ప్రయత్నించిన కాంగ్రెస్, ఆప్‌లు. చివర్లో ఎవరికి వారు చేతులెత్తేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆప్‌కి స్నేహ హస్తం అందించడమే కాదు, ఏడు నియోజకవర్గాల్లో నాలుగు సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఢిల్లీతో పాటు హర్యాణా, చండీగఢ్‌లో పొత్తు ఉంటేనే తాము చేయి కలుపుతామని ఆప్‌ పట్టు పట్టింది. దీనికి కాంగ్రెస్‌ అంగీకరించకపోవడంతో ఎవరి దారి వారిదే అయింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే ఆప్, కాంగ్రెస్‌లకు పడిన ఓట్లు ఎక్కువ. అందుకే ఈసారి ఈ రెండు పార్టీలు కలిస్తే మోడీ హవాను అడ్డుకోవచ్చునని భావించారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌లు కలిస్తే మోడీ హవాకు అడ్డుకట్ట పడేదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరిది పై చేయిగా మారుతుందో అంతుపట్టని పరిస్థితులున్నాయి.

కానీ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో వినిపిస్తుంది ఒకటే మాట. కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకోగలదా? వాస్తవానికి అయిదేళ్ల చరిత్రను పరిశీలిస్తే... ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభ మసకబారుతూ వస్తోంది. 2013లో షీలా దీక్షిత్‌ సర్కార్‌ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత ఏడాది 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. ఒక్క ఎమ్మెల్యేని కూడా పంపలేక ఎన్నికల పోరాటంలో చతికిలపడింది. కాంగ్రెస్‌ ఓట్లు 10శాతం కంటే తక్కువకి పడిపోయాయి. అయితే ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్లు 22 శాతానికి పెరిగాయి. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాతం ఓట్లు సాధించిన ఆప్‌ పార్టీ స్థానిక ఎన్నికల సమయానికి 26 శాతానికి పడిపోయింది.

ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న లక్ష్యం ఒక్కటే.కనీసం రెండో స్థానానికైనా ఎగబాకాలి. అప్పుడే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయొచ్చునని అంచనాలు వేసుకుంటోంది. అదే జరగాలంటే దళితులు, ముస్లింలు, మురికివాడల ప్రజల్ని మళ్లీ తమ గూటికి తీసుకురాగలగాలి. అది కొంచెం కష్టమైన పనే. ఢిల్లీలో కేజ్రీవాల్‌ సర్కార్‌ విద్యుత్, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. మధ్యతరగతి ఓటర్లంతా ఆప్‌వైపే ఇంకా ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌ ధీమా కాంగ్రెస్‌దే. మోడీ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. ఆప్‌ హామీలన్నీ శుష్కవాగ్దానాలే అని వాయవ్య ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేశ్‌ తిలోతియా అంటున్నారు.

కాంగ్రెస్‌ డార్లింగ్‌ షీలాదీక్షిత్‌

వయసు చూస్తే 81 ఏళ్లు. ఎన్నికల ప్రచారంలో ఆమెలో పొంగిపొరలే ఉత్సాహాన్ని చూస్తుంటే ఇరవై ఏళ్లని అనిపించక మానదు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగడంతో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కళ వచ్చింది. హ్యాట్రిక్‌ విజయాలతో పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని స్థాయిని పెంచిన నాయకురాలు. ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా పేరు తెచ్చుకున్నారు.

అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన అరవింద్‌ కేజ్రివాల్‌ 2013లో ఆప్‌ని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడంతో షీలా అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. కేజ్రివాల్‌తో పోటీ పడలేక ఓడిపోయిన తర్వాత కూడా ఆమె హుందాగానే పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త పార్టీ బలాన్ని తాను అంచనా వేయలేకపోయానంటూ తన వైఫల్యాలను అంగీకరించారు. మొదట్నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. రాజకీయ నాయకులకు రిటైర్‌మెంట్‌ ఉండదన్న నానుడిని గుర్తు చేస్తూ 81 ఏళ్ల వయసులోనూ ఆమెను ఎన్నికలబరిలో దింపింది కాంగ్రెస్‌ అధిష్టానం. బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారీ, ఆప్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ పాండేను ఎదుర్కొంటున్నారు.

ఇక బీజేపీ. ఆరో విడతలో ఏడు లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో పథక రచన చేస్తుంది. కిందటి ఎన్నికల్లో ఏడింటికి ఏడు స్థానాలను తన ఖాతాలతో వేసుకున్న కమలనాథులు అదే ప్రభంజనాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఆ ఏడు చోట్ల కమలం వాడిపోతుందా వికసిస్తుందా?

ఈనెల 12న జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాజధానిలోని అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా మోడీ షా టీమ్‌ వ్యూహరచన చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లోనూ అదే ప్రభంజనాన్ని కొనసాగించాలని ఆత్రుతతో ఉంది. ఇప్పటికే పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండగా, రామ్‌లీలా మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు రెండూ వేర్వేరుగా పోటీ చేసినా ఆ రెండు పార్టీల లక్ష్యం మోడీని గద్దె దింపడమే. కలసి పోటీ చేసినా చేయకపోయినా ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకునే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారాల మధ్య బీజేపీ అప్రమత్తమైంది. క్యాడర్‌ను పూర్తిగా దించేసి. ఏడు స్థానాలను తమ ఖాతాలోకి వేసుకోవాలన్న కదన కుతూహాలాన్ని కనబరుస్తున్నాయి. మరి ఈ వేటలో బీజేపీ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందన్నదే అంతుచిక్కడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories