ఆ కీలకనియోజక వర్గంపై ఏ పార్టీ జెండా ఎగరనుంది...?

ఆ కీలకనియోజక వర్గంపై ఏ పార్టీ జెండా ఎగరనుంది...?
x
Highlights

రాష్ట్రంలోనే కీలకనియోజక వర్గం అదీ. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఆ నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీటుగా...

రాష్ట్రంలోనే కీలకనియోజక వర్గం అదీ. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఆ నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గులాబీ జెండా రెపరపలాడింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 11సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే ఎంపీలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా ప్రత్యర్ధి పార్టీలు అవకాశం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. జనరల్ స్ధానంగా ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలో.. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌కు 1957లో తొలిసారి ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మూడుసార్లు టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించగా స్వతంత్ర అభ్యర్ధికి ఒకసారి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు.

2014 ఎన్నికల్లో తొలిసారి నిజామాబాద్ పార్లమెంట్‌పై టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత.. తన ప్రత్యర్ధి మధూయాష్కీ పై సుమారు లక్షా 70వేల ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ ఐదేళ్ల కాలంలో నిజామాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు పెంచుకున్న కవిత తిరిగి టీఆర్ఎస్ అభ్యర్ధిగా దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మంట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా గెలుపొందటం ఆమెకు కలిసొచ్చే అంశంగా మారింది.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 2009 వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మధుయాష్కీ నిజామాబాద్ ఎంపీగా 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఈ సారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. భువనగిరి నుంచి పోటీకి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్దిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ మధుయాష్కీని పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తుంది ఆయన కాదంటే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలి పేరును సైతం పరిశీలన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ పార్లమెంట్‌పై తెలుగుదేశం మూడుసార్లు జెండాను ఎగురవేసింది. టీడీపీ అభ్యర్దిగా మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి 1991లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం రెండుసార్లు విజయం సాధించారు. రాష్ట్రంలో మారిన పరిణామాలతో ఆ పార్టీ కీలక నేతలు గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ సెగ్మంట్‌లో ఖాతా తెరవలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యెండల లక్ష్మినారాయణ 21.79శాతం ఓట్లు సాధించి మూడోస్ధానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీకి చాలా మంది సీనియర్లు పోటీకి సై అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్ టికెట్టు రేసులో ముందు వరుసలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ టికెట్ ఆశిస్తున్నారు. అర్వింద్ ధర్మపురికి రేసులో ముందు వరుసలో ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్- కాంగ్రెస్- బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన అధికార పార్టీ అదే ఊపులో నిజామాబాద్ పార్లమెంట్‌పై మరోసారి తన జెండా రెపరెపలాడించే అవకాశం ఎక్కువగా ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఐతే ప్రజల నాడి ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories