కుప్పంలో బాబు ఆత్మవిశ్వాసం గెలుస్తుందా?

కుప్పంలో బాబు ఆత్మవిశ్వాసం గెలుస్తుందా?
x
Highlights

మూడు దశాబ్దాలుగా ఒక నియోజకవర్గాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న నాయకుడికి ఈసారి ప్రజలు ఇచ్చే బహుమతి ఏంటి? వచ్చే తీర్పు ఏంటి? కనీసం ప్రచారానికి కూడా...

మూడు దశాబ్దాలుగా ఒక నియోజకవర్గాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న నాయకుడికి ఈసారి ప్రజలు ఇచ్చే బహుమతి ఏంటి? వచ్చే తీర్పు ఏంటి? కనీసం ప్రచారానికి కూడా వెళ్లకుండా పోటీ చేయడంలో ఆయనకున్న ధైర్యమేంటి? నామినేషన్ మొదలుకుని పోలింగ్ వరకు ఊరి పొలిమేరల్లోకి అడుగుపెట్టని ఆ నాయకుని ధీమా ఏంటి? కుప్పం నుంచి ఏడోసారి బరిలోకి దిగిన తెలుగుదేశం దేశాధీశుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో బలమేంటి? నడిపిస్తున్న ఆ ఆత్మవిశ్వాసం ఏంటి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రకు తొలిముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడి సుదీర్ఘ రాజకీయాలకు జీవగర్ర చిత్తూరు జిల్లా కుప్పం. అప్రతిహతంగా కొనసాగుతున్న బాబు ప్రజాప్రస్థానానికి ఓట్లేసి బాటలు పరిచారు కుప్పం నియోజకవర్గ ప్రజలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు గెలుపుబాటలలో నడిపించిన ఇక్కడి ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు? ఏడోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబుకు మెజారిటీ పెరుగుతుందా. ఆరుసార్లు ఒక్కరోజైనా ప్రచారానికి వెళ్లిన బాబు ఈసారి మాత్రం కనీసం ఒక్క పూట కూడా వెళ్లకపోవడం వెనుక ఆయన ధీమా ఏంటి? ఇదే రాజకీయాల్లో సాగుతున్న చర్చ

చంద్రగిరి నుంచి తొలిసారి శాసనసభ్యుడుగా గెలిచిన చంద్రబాబు ఆ తరువాత... తెలుగుదేశంలో 1989 నుంచి కుప్పానికి మకాం మార్చారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన కుప్పం నుంచి ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన తరువాతే ఆయన రాజకీయ దశ తిరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినా, కుప్పం నియోజకవర్గానికి మారాక ఆయన రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. బాబుకు ఆయువు పట్టైంది. ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడగా మారింది. ముఖ్యమంత్రి మరింత పట్టుపెరిగింది.

రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా కుప్పం నియోజకవర్గంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు చంద్రబాబు. నియోజకవర్గ విషయాలపై నిత్యం సమీక్షిస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినా కుప్పం నుంచే పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెడతారు. దీంతో కుప్పంలో ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా కచ్చితంగా గెలుస్తామనే ధీమా బాబులో పెరిగింది. చంద్రబాబు రాజకీయ జీవితంలో తొలిసారి నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టకుండా ఎన్నికలకు వెళ్లడం ఈసారే అంటున్నారు ప్రజలు. ఎప్పుడూ ఏదో ఒకరోజు ఆయన పర్యటించే బాబు... ఈసారి నోటిఫికేషన్ వెలువడ్డాక మూడు సార్లు జిల్లాలో పర్యటించినా... తన నియోజకవర్గంలో మాత్రం కాలుమోపలేదు. తన నియోజకవర్గానికి సమీపంలోనే ఉన్న పలమనేరులో బహిరంగ సభలో పాల్గొన్నా కానీ... కుప్పం వైపు చూడలేదంటున్నారు.

కుప్పంలో ప్రచారం చేయకపోవడంపై ఇక్కడి ఓటర్లలలో ఎలా ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా మాత్రం అక్కడ ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది. కుప్పంలో మెజారిటీ తగ్గుతుందా పెరుగుతుందా అన్నది పందెం రాయుళ్ళకు ఓ అంశంగా మారింది. గత ఫలితాలు చూస్తే 2004ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై 49,588 మెజారిటీ, 2009లో 46,066 ఓట్లు, 2014లో 47,121ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు చంద్రబాబు. మరి ఈసారి మెజారిటీ ఎంత వస్తుందన్నది ఆసక్తికరమైన అంశంగా మిగిలింది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు గ్రామ గ్రామాన ఉన్న కార్యకర్తలతో నేరుగా అటాచ్‌మెంట్ ఉంది. గ్రామాలకు వెళ్ళినప్పుడుగానీ, అక్కడి వారు అమరావతికి వెళ్లినప్పుడుగానీ వారిని పేరుపెట్టి సంబోదించే అంతటి అనుబంధం ఉంది. ద్వితయ శ్రేణి నాయకత్వం, మండల స్థాయి నాయకత్వం నేరుగా తనతోనో, లోకేష్‌తోనో మాట్లాడే అంతటి చనువును కూడా బాబు కల్పించారు.

ఇక ప్రత్యర్థి పార్టీ విషయానికొస్తే వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి. చంద్రమౌళి అనారోగ్యం కారణంగా నియోజకవర్గంలో పర్యటించలేకపోయారు. వారి కుటుంబ సభ్యులు, పార్టీ క్యాడర్ మాత్రమే ప్రచారం చేశారు. దీంతో ప్రత్యర్థి ప్రచారం లేని చోట తానెందుకనుకున్నారో ఏమో చంద్రబాబు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదన్న ప్రచారం ఉంది. చంద్రబాబు ప్రచారానికి వెళ్లకపోయినా వైసీపీ అధినేత జగన్‌ ఈ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆయన సభకు అశేషంగా జనం కూడా భారీగానే వచ్చారు. ఈ పరిణామాలు రాజకీయంగా కొంత ప్రాధాన్యాన్ని సంతరించుకునింది. ఆసుపత్రిలో ఉన్న చంద్రమౌళిపై సానుభూతి ఉందని చెప్పుకుంటుంది వైసీపీ.

ఇక తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ గడ్డ బాబు అడ్డా అని అంటున్నారు. కుప్పం గడ్డపైన పసుపు జెండా తప్ప ఇంకో జెండా ఎగరదంటున్నారు. చంద్రబాబు ప్రచారం చేయకపోవడం గెలుపుమీద గానీ మెజారిటీ మీదగానీ ప్రభావం చూపదన్నది వారి ధీమా. ఏమైనా కుప్పంలో గెలుపుకోసం కలలుగంటున్న వైసీపీ పంతం నెగ్గుతుందా... చంద్రబాబు ఆత్మవిశ్వాసం గెలుస్తుందా అన్నది తేలాలంటే... ఫలితాలు వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories