ఖమ్మం సీటు... యమ హాట్‌ గురు!!

ఖమ్మం సీటు... యమ హాట్‌ గురు!!
x
Highlights

ఆ పార్లమెంట్ సీటు, కాంగ్రెస్‌ నేతలందరికీ స్వీటు. హాట్‌ కేక్‌లా నోరూరిస్తోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హస్తం పార్టీ ఉద్దండులు, ఆ స్థానంపై...

ఆ పార్లమెంట్ సీటు, కాంగ్రెస్‌ నేతలందరికీ స్వీటు. హాట్‌ కేక్‌లా నోరూరిస్తోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హస్తం పార్టీ ఉద్దండులు, ఆ స్థానంపై కర్చీఫ్ వేసేందుకు పోటీపడుతున్నారు. టికెట్‌ ఇవ్వకుంటే, రాజీనామా చేస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంతకీ ఏదా స్వీటు...ఎందుకంత హాటు....? తెలంగాణ‌లో మొత్తం 17 లోక్‌స‌భ సీట్లుండ‌గా.. ఖ‌మ్మం పార్లమెంట్ సీటు మాత్రం హ‌స్తం పార్టీలో హ‌ట్ కేక్‌లా మారింది. ఇప్పుడు పార్టీలో అంద‌రి చూపు ఖ‌మ్మం పార్లమెంట్ పైనే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఖ‌మ్మం సీటు ఒక్కటే సేఫ్ ప్లేస్ అని నేత‌లు అంచనాలు వేస్తున్నారు. అందుకే ఖమ్మం సీటుకు అంత‌లా డిమాండ్ పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం పార్లమెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ మ‌ధిర, కొత్తగూడెం, పాలేరు సీట్లు గెల‌వ‌గా, మిత్రప‌క్షంగా ఉన్న టీడీపీ స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేట అసెంబ్లీ సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ కేవ‌లం ఖ‌మ్మం అసెంబ్లీకి మాత్రమే పరిమితమైంది. దీంతో ఎలాగొలా, ఖ‌మ్మం ఎంపీ టికెట్ సాధిస్తేచాలు, విజ‌యానికి స‌గం చేరువ‌లో ఉన్నట్లే అని నేతలు నమ్ముతున్నారు.

గ‌తంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన రేణుకా చౌద‌రి.. ఇప్పుడు ఖమ్మం టికెట్ ద‌క్కించుకునే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, తన‌కే హైక‌మాండ్ టికెట్ ఇస్తుంద‌న్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ తనను పక్కకి పెడితే రాజీనామా అస్త్రం వాడేందుకు రేణుక సిద్ధమవుతున్నారు. అయితే రేణుక నాన్ లోక‌ల్ అని, సీటు త‌న‌కే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి. ఇదే సీటుపై మ‌న‌సు పారేసుకున్నారు ఏఐసీసీ కార్యద‌ర్శి వి. హ‌నుమంత్‌ రావు. గాంధీ ఫ్యామిలికి న‌మ్మిన బంటున‌ని, త‌నకు టికెట్ ఇస్తే.. త‌ప్పక గెలిచి.. రాహుల్ గాంధీకి కానుక‌గా ఇస్తానంటున్నారు వీహెచ్.

ఖమ్మం జిల్లా యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా పేరుపొందిన గాయత్రీ గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ సీటుకు దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిన రవిచంద్ర, లోక‌ల్ కోటాలో, టికెట్ కోసం ఢిల్లీ పెద్దల వద్ద తనకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన బడా వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా టికెట్ కోరుతూ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు

. ఖమ్మం ఎంపీ టిక్కెట్ రేసులో కొత్తగా మాజీ ఎంపీ విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న రాములమ్మ, ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. అందుకు ఖమ్మం లోక్‌సభ సీటు అయితే మంచిదన్న భావనలో ఉన్నారట రాములమ్మ.

ఖ‌మ్మం లోక్‌సభ సీటుపై కాంగ్రెస్‌ నేత‌లు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఎలాగైనా సీటు ద‌క్కించుకునేందుకు ఎవ‌రికి వారు లాబీయింగ్‌ ముమ్మరం చేస్తున్నారు. ఈ పోటీలో సీనియ‌ర్ , జూనియ‌ర్.. లోకల్- నాన్ లోక‌ల్.. అన్న తేడా లేకుండా.. ఉద్దండులు సైతం పోటీకి సై అంటున్నారు. దీంతో సీటు ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి ఖమ్మం సీటును అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories