లోక్ సభ చివరి దశ ఎన్నికలు పూర్తిగాకముందే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పై రాజకీయాలు ఊపందుకున్నాయి. జాతీయ పార్టీలకు దీటుగా ప్రాంతీయ పార్టీలు కీలకంగా...
లోక్ సభ చివరి దశ ఎన్నికలు పూర్తిగాకముందే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పై రాజకీయాలు ఊపందుకున్నాయి. జాతీయ పార్టీలకు దీటుగా ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి. హంగ్ వస్తుందన్న అంచనాలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయడంలో బిజీ అయిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ యాత్ర చేస్తే తెలంగాణ సీఎం దక్షిణభారతంలో కేరళ యాత్ర చేశారు. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ఈ ఇద్దరు నాయకులు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటు తెలంగాణ సీఎం అటు ఏపీ సీఎం ఇద్దరూ ఇద్దరే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒకరు నేషనల్ ఫ్రంట్ తరఫున ఒకరు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి చక్రం తిప్పేందుకు ఆరాటపడుతున్నారు. కేంద్రంలో తాము కోరుకున్న ప్రభుత్వం వస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలను మరింతగా నెరవేర్చుకోవచ్చన్నదే ఇద్దరి ఉద్దేశం. అయితే ఇద్దరిలో ఒకరు మాత్రమే నెగ్గగలరు. మరి ఆ ఇద్దరిలో ఎవరికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉండే సంకీర్ణ ప్రభుత్వాల హయాం మరోసారి మొదలుకానుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడగలదన్న అంచనాలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును అవకాశంగా తీసుకునేందుకు ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా ప్రయత్నిస్తోంది. ఏపీ, తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలు కూడా అలానే చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ కాలం నాటి వ్యూహ చాతుర్యాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి పేరుతో ఆ రెండు పార్టీలకూ ఆయన దూరంగా ఉన్నారు. మరో వైపున తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ లోకి కమ్యూనిస్టులనూ చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కేరళ యాత్ర చేశారు. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ను కలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. త్వరలోనే మరికొన్ని పార్టీల నాయకులను కలుసుకునే ఆలోచనలో ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కూటమిగా అండగా నిలిచారు. తాజాగా ఆయన ఢిల్లీ యాత్ర చేశారు. హంగ్ రాగలదన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటుగా వివిధ పార్టీలతో కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితాలు రాగానే ప్రభుత్వ ఏర్పాటుకు తమ కూటమి సిద్ధంగా ఉందనే సందేశంతో రాష్ట్రపతిని కలుసుకునేందుకూ వ్యూహాలు రూపొందిస్తున్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్ తరఫున కీలకపాత్ర పోషించడం చంద్రబాబునాయుడికి కలసి వచ్చే అంశంగా మారింది. వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులతో ఉన్న పరిచయాలతో కూటమిని పటిష్ఠం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణ సీఎంలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిగి కేసీఆర్ ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఏపీలో చంద్రబాబు మాత్రం అటు లోక్ సభతో పాటుగా అసెంబ్లీ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఇద్దరు చంద్రులు కూడా కేంద్ర రాజకీయాల వైపు చూస్తున్నారు. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన కారణం కేంద్రం నుంచి రాష్ట్రాలకు భారీగా నిధులు రాబట్టుకోవడం. దేశంలో కొన్నేళ్ళుగా ప్రజాకర్షక పథకాలకు ప్రాధాన్యం పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఓటర్లకు వివిధ పథకాల పేరిట నేరుగా డబ్బులు అందించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి పథకాలను ఎందరో వ్యతిరేకించారు. అలాంటి పథకాలే ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవి సాధిస్తున్న ఫలితాలతో చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. అన్ని పార్టీలు కూడా శక్తికి మించిన స్థాయిలో వాగ్దానాలు చేశాయి. ఇప్పటికే ప్రారంభించిన పథకాలను అమలు చేయాలన్నా కొత్తగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్న భారీగా నిధులు అవసరమవుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీకి నిధుల అవసరం మరింతగా ఉంది. పోలవరం నిర్మాణం, రాజధాని నగర నిర్మాణం లాంటి వాటికి ఎన్ని నిధులు ఉన్నా తక్కువే అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో తాము కోరుకున్న ప్రభుత్వం వస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలను మరింతగా నెరవేర్చుకోవచ్చన్నదే ఇద్దరి ఉద్దేశం.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కూటమికి అండగా నిలుస్తున్నారు. మరో వైపున కేసీఆర్ మాత్రం ఎప్పటిలానే తన మన మనస్సులోని మాట బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీ సమాన దూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే బీజేపీయేతర, కాంగ్రేసేతర కూటమి అంటున్నారు. ఆ కూటమి సంగతి ఎలా ఉన్నప్పటికీ పరిస్థితిని బట్టి కేసీఆర్ నిర్ణయంలో మార్పులు ఉండవచ్చన్న వాదనలూ ఉన్నాయి.
గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి అప్పుడప్పుడూ ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఇటీవలి మాత్రం అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల సందర్భంగా దాని గురించి ప్రముఖంగా చెప్పారు. అందుకు అనేక కారణాలున్నాయి. మైనారిటీల మద్దతు పొందడం కూడా అందుకు ఒక కారణం అయిఉండవచ్చు. తెలంగాణలో మైనారిటీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. కొన్నేళ్ళ నుంచీ కాంగ్రెస్ కూ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలంటే బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకమని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటనలు తీర్చాయి. నిజం చెప్పాలంటే ఫెడరల్ ఫ్రంట్ బాలారిష్టాల్లోనే ఉంది. గతంలో ఒకసారి ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకునేందుకు కేసీఆర్ చేసిన యాత్ర ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మరో వైపున తాజాగా చేసిన యాత్ర కూడా అంతంతమాత్రంగానే సాగింది. కమ్యూనిస్టులను ఆకర్షించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కమ్యూనిస్టులు కలసి వచ్చే అవకాశం ఇప్పట్లో తేలేదేమీ కాదు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ ఏకతాటిపైకి వస్తాయన్న ఆశలూ లేవు. అంతమాత్రాన కేసీఆర్ కే వాటిల్లే నష్టం కూడా ఏమీ లేదు. బలమైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ తెలంగాణలో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఆ సంఖ్యాబలాన్ని బట్టి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం అయ్యే అవకాశం ఉంది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచేవారు. ఆయన ఒక పని ఒక విధంగా చేస్తారని అంతా అనుకుంటే కేసీఆర్ అందుకు భిన్నంగా ఆ పని చేసేవారు. అలా చేసి కూడా విజయం సాధించే వారు. అదే వ్యూహాన్ని నేటికీ కేసీఆర్ కొనసాగించడం విశేషం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ లక్ష్యం ఒక్కటే. తెలంగాణను ప్రగతిపథంలో తీసుకెళ్ళడం. అలా చేయాలంటే కేంద్రప్రభుత్వంతో సఖ్యత అవసరం. కేంద్రప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు మంత్రులుగా ఉంటే మరీ మంచిది. ఈ లక్ష్య సాధననే రేపటి నాడు కేసీఆర్ ను బీజేపీకి చేరువ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే అలా చేయాలనుకుంటే రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు కాస్తంత తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. బీజేపీకి చేరువ కావడాన్ని మజ్లిస్ వ్యతిరేస్తుంది. అలాంటప్పుడు మజ్లిస్ ను వదులుకోవాల్నా కేంద్రంతో స్నేహం వదులుకోవాలా అనేది కేసీఆర్ తేల్చుకోవాల్సి ఉంటుంది.
కేంద్రంలో గనుక బీజేపీ అధికారం చేపట్టే సూచనలు ఉంటే కేసీఆర్ మైండ్ సెట్ ను బట్టి ఆయన మజ్లిస్ ను వదులుకునేందుకు కూడా సిద్ధం కావచ్చు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి దక్కి ఇంకా మద్దతు అవసరమైతే అప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగి బీజేపీకి లోపలి నుంచో....బయటి నుంచో మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. మరో వైపున కేసీఆర్ ప్రస్తుతం అనుసరించిన ధోరణి పై బీజేపీ కూడా ఆగ్రహంతో ఏమీ లేదనే చెప్పవచ్చు. కేంద్ర ఏజెన్సీలతో తెలంగాణలో దాడులతో ఇబ్బంది పెట్టిన సందర్భాలేవీ కూడా లేవు. మరో వైపున కేసీఆర్ అనుసరించిన వ్యూహంతో ఆయనను బీజేపీకి బి టీమ్ గా అభివర్ణిస్తూ విమర్శలు కూడా వెలువడ్డాయి. మొత్తం మీద కేసీఆర్ తన అపర చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారు. తెలంగాణలో ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోంది. మరో వైపున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కొంత రిస్క్ తీసుకునేందుకు కూడా కేసీఆర్ సిద్ధపడే అవకాశం ఉంది.
ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలకూ భారీగా నిధుల అవసరం ఏర్పడింది. ఆ నిధులను పొందేందుకు ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కేంద్రంతో సఖ్యతను కోరుకుంటాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన పార్టీకే అవి మద్దతు పలికే అవకాశం ఉంది. మద్దతు ఇవ్వలేకపోయిన సందర్భాల్లో సఖ్యతగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి అనడంలో సందేహం లేదు. పార్టీ ఏదైనా కేంద్రంతో సఖ్యత ముఖ్యమే అదే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల హక్కులను, కేంద్రం బాధ్యతలను కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం కూడా ముఖ్యమే. ఆ విషయంలోనూ రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఒక స్పష్టమైన వైఖరిని అనుసరించాల్సిన అవసరం ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire