కాగే కాశ్మీరు సమస్యకు రగిలే పరిష్కారం

కాగే కాశ్మీరు సమస్యకు   రగిలే పరిష్కారం
x
Highlights

దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం తనదైన మార్గాన్ని ఎంచుకున్నదా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఐదారు...

దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం తనదైన మార్గాన్ని ఎంచుకున్నదా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఐదారు రోజుల కిందట జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో లద్దాఖ్ ప్రాంతాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక పాలన, రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు. అయితే అది అక్కడితోనే ఆగిపోతుందా? లేదంటే లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు దారి తీస్తుందా అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో లద్దాఖ్ ను కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక డివిజన్ గా ప్రకటించింది. మరో వైపున అది అక్కడితోనే ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే లద్దాఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. అక్కడి ప్రజల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుంటే....కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన లద్దాఖ్ ను యూటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరో వైపున జమ్మూను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. ఇవన్నీ కశ్మీర్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. తాజాగా గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయంతో.......మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచుకొండల్లో మంటలు రగులుకున్నాయి.

జమ్మూ కశ్మీర్ రాష్టం భారత్ లోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైంది. దేశానికి సరిహద్దులో ఉండడం....కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా వివాదం చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుండడం....అందుకు చైనా అండగా నిలవడం....కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించడం....లాంటివి ఒక రకం కారణాలు. ఇక కశ్మీర్ లో అంతర్గతంగా వివిధ ప్రాంతాల మధ్య మరెన్నో వివాదాలు కూడా ఉన్నాయి. జమ్మూ డివిజన్ లో హిందువులు, కశ్మీర్ డివిజన్ లో ముస్లింలు....లద్దాఖ్ డివిజన్ లో బౌద్ధులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ భిన్న సంస్కృతులు ఉన్నాయి. భౌగోళిక, శీతోష్ణ స్థితిగతులు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇవే ఇప్పుడు కశ్మీర్ సమస్యలో కొత్త కోణాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి 1948లో హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని దేశంలో విలీనం చేసేందుకు అనుసరించిన వ్యూహాన్ని గుర్తుకు చేస్తోంది. విలీన తదనంతర అంతర్జాతీయ వివాదాలు రాకుండా ఉండేందుకు నాడు హైదరాబాద్ రాజ్యాన్ని మూడు ముక్కలుగా చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కలిపివేశారు. తద్వారా భౌగోళికంగా హైదరాబాద్ స్టేట్ అనేది లేకుండా చేశారు. తాజాగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రం విషయానికి వస్తే.....జమ్మూ, లద్దాఖ్ ప్రాంతాలు గనుక వేరైపోతే..... ఇక వివాదమైనా....ఉగ్రవాదమైనా....ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమై పోతుంది. ఆర్సెస్సెస్ సూత్రీకరణలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.

లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆరెస్సెస్ కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉంది. 2002లో జూన్ నెల చివర్లో కురుక్షేత్ర లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ అనే మూడు ముక్కలుగా చేయాలని ఆరెస్సెస్ వాదిస్తోంది. జమ్మూను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కూడా 2002లోనే ఆరెస్సెస్ డిమాండ్ చేసింది. అందు కోసం పోరాటం చేసేందుకు 2002 జూలై 14న జమ్మూ స్టేట్ మోర్చా ను కూడా ఏర్పాటు చేసింది. మొన్నటి వరకూ ఆ రాష్ట్రంలో జమ్మూ, కశ్మీర్ అనే రెండు డివిజన్లు మాత్రమే ఉండేవి. తాజాగా లద్దాఖ్ ను ప్రత్యేక పాలన, రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆరెస్సెస్ వ్యూహాన్నే బీజేపీ అమలు చేసింది. ఇక మిగిలింది లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే. 2014లోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ కూడా లద్దాఖ్ ను యూటీ గా చేసేందుకు అనుకూలంగా ఉండింది. లద్దాఖ్ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో యూటీ హామీ స్పష్టంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న లద్దాఖ్ డిమాండ్ కు అండగా ఉంటామని కాంగ్రెస్ అప్పట్లో స్పష్టంగా ప్రకటించింది. లద్దాఖ్ పార్లమెంటరీ సీటు కు జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఈ మేనిఫెస్టో ప్రకటించింది. అప్పట్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

రాష్ట్రం గవర్నరు పాలనలో ఉన్న సమయంలో లద్దాఖ్ ను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, రాష్ట్రంలో గనుక ప్రజా ప్రభుత్వం ఉండి ఉంటే....లద్దాఖ్ డివిజన్ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. లద్దాఖ్ డివిజన్ లో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. లద్దాఖ్ ను ప్రత్యేక డివిజన్ గా చేయడం వల్ల పోలీస్ తో సహా సుమారు 20 విభాగాల ఉన్నతస్థాయి కార్యాలయాలు లేహ్ లో ఏర్పాటు కానున్నయి. అవన్నీ స్థానిక స్వపరిపాలనను మరింత సులభం చేయనున్నాయి. లేహ్ ప్రాంతం సంవత్సరంలో ఆరు నెలల పాటు మంచుతో నిండిఉంటుంది. ఆ సమయంలో బాహ్యప్రపంచంతో అక్కడి ప్రజలకు సంబంధాలు తెగిపోతాయి. తాజాగా లేహ్ డివిజన్ ప్రధాన కేంద్రం కావడం వల్ల అక్కడి ప్రజలు తమ అధికారిక పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకే ఏళ్ళ తరబడి అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. తమ ప్రాంతానికి పూర్తిస్థాయి విశ్వవిద్యాలయాన్ని సాధించుకునేందుకు కూడా లేహ్ ప్రాంత ప్రజలు ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. ఇటీవలే వారి కోరిక తీరింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించి అక్కడి వారికి వరాలు ప్రకటించారు. ఇక జమ్మూ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

లద్దాఖ్ డివిజన్ లో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. డివిజన్ ప్రధాన కేంద్రంగా లేహ్ ను ప్రకటించడంపై కార్గిల్ లో చిచ్చు రేపింది. రెండు జిల్లాలకు సమన్యాయం చేయాలని కార్గిల్ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక డివిజన్ కు శీతాకాలంలో లేహ్ ను ప్రధాన కేంద్రంగా, వేసవి కాలంలో కార్గిల్ ను ప్రధాన కేంద్రంగా చేయాలని వారు కోరుతున్నారు. కార్గిల్ పై వివక్షను తొలగించాలని కోరుతూ వారం రోజులుగా వారు భారీస్థాయిలో ఆందోళనలు చేపట్టారు. మరో వైపున లద్దాఖ్ ను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించడం.....దానికి లేహ్ ను ప్రధాన కేంద్రంగా ప్రకటించడంపై లేహ్ లో వేడుకలు జోరుగా సాగాయి. అక్కడ బౌద్ధులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తమ తదుపరి లక్ష్యం కేంద్రపాలిత ప్రాంతం కావడమేనని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories