logo

పొత్తులపై కత్తులు... సేన సైకిల్‌ కలుస్తాయా?

పొత్తులపై కత్తులు... సేన సైకిల్‌ కలుస్తాయా?

పొత్తుంటే తప్పేంటని మొన్న బాబు కామెంట్స్. చంద్రబాబుపై కేసీఆర్-జగన్‌ కక్ష సాధింపులకు దిగుతున్నారని నిన్న పవన్ సాప్ట్‌ కార్నర్. దీంతో సైకిల్‌-గాజు గ్లాసులు కలుస్తాయని ఊహాగానాలు. కానీ నేడు సీన్‌ మొత్తం రివర్స్. పొత్తుల అంచనాలపై కత్తులు. పవన్ కల్యాణ్‌-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం. పవన్ వ్యాఖ్యలతో ఇక టీడీపీ-జనసేన పొత్తు లేనట్టేనని తేటతెల్లమైనట్టేనా..? ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మొన్న కేటీఆర్ జగన్‌ ఫెడరల్ ఫ్రంట్‌ చర్చలు, రాజకీయ పరిణామాలను వేడెక్కిస్తే తాజాగా తెలుగుదేశం, జనసేనల మధ్య కామెంట్లు కాకరేపుతున్నాయి.

కొద్ది నెలల కిందట తెలుగుదేశంతో ఫ్రెండ్‌షిప్‌కు కటీఫ్ చెప్పి, ఒంటరి పోరు చేస్తామని సంకేతాలిచ్చిన జనసేన, మళ్ళీ టీడీపీతో కలిసే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం రెండు పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. పొత్తు గురించి జనసేన నేతలు గుంభనంగా వ్యవహరిస్తుంటే..దోస్తీ ఖాయమంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు చేయడం రెండు పార్టీల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా టీజీ వెంకటేష్ HMTV ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు...టీడీపీ, జనసేన మాటల యుద్ధానికి కారణమయ్యాయి. టీజీ వ్యాఖ్యలపై జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని,...పెద్దరికం నిలబెట్టుకోవాలని సీరియస్ అయ్యారు. జనసేన వద్దనుకున్నందుకే, టీజీకి రాజ్యసభ పదవి వచ్చిందన్న పవన్, తాను అదుపుతప్పి మాట్లాడితే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.

అటు టీజీ, పవన్‌లు డైలాగ్‌ వార్‌ మంటలు ఎగసిపడుతున్న టైంలో, చంద్రబాబు ఆ నిప్పులను ఆర్పే ప్రయత్నం చేశారు. టీజీ వెంకటేష్‌‌పై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అనవసరపు వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేయవద్దని ఆదేశించారు. పార్టీ విధానాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని ఆదేశించిన చంద్రబాబు...ఎన్నికల తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అయితే టీజీ వ్యాఖ్యలు, పవన్ కౌంటర్, వెనువెంటనే బాబు రియాక్ట్ కావడం, చకచకా జరిగిపోయినా, వీటి వెనుక ఏదో లింకుందన్న చర్చ మాత్రం జరుగుతోంది. సరిగ్గా చంద్రబాబుతో సమావేశం ముగిసి, బయటికి వచ్చిన తర్వాత టీజీ వెంకటేష్‌ మాట్లాడటం అనేక సందేహాలకు తావిస్తోంది. చంద్రబాబు-టీజీ సమావేశంలో జనసేన పొత్తు గురించి ఏమైనా చర్చించారా...పవన్‌ను కలుపుకుపోవాలని బాబు ఆలోచించారా....అవే మాటలను బయటికి వచ్చి టీజీ వెంకటేష్‌ చెప్పారా అన్న, డౌట్లు వస్తున్నాయి. గతంలో జనసేనతో పొత్తుపై చంద్రబాబు చేసిన కామెంట్లే, ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. దీంతో మరోసారి జనసేన, టీడీపీతో కలిసి వెళ్తుందన్న విశ్లేషణలు సాగాయి. దీనికితోడు మొన్న కేటీఆర్-జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చలపై పవన్‌ విమర్శించారు. కేసీఆర్-జగన్‌లు కలిసి, చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని, బాబుపై సాఫ్ట్‌ కార్నర్‌తో మాట్లాడారు. దీంతో జనసేన-టీడీపీ కలుస్తాయన్న పుకార్లకు మరింత స్కోప్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే, పవన్‌తో కలవాలని చంద్రబాబు అనేక సంకేతాలిస్తున్నా, పవన్‌ మాత్రం ఒంటరి పోరుకే సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కార్యకర్తల్లో గందరగోళం పెరుగుతుందని భావిస్తున్న పవన్, అందుకే టీజీ వ్యాఖ్యలపై పరుష పదజాలంతో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. ఈ ఘాటు కామెంట్లతో, ఇక తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు ప్రస్తావనే లేదన్న సంకేతాలు పంపినట్టయ్యింది పవన్.

2014లో టీడీపీ-బీజేపీలకు మద్దతిచ్చిన పవన్, ఆ తర్వాత మౌనం దాల్చారు. అనేక సమస్యలపై పోరాటం చేశారు. వాటిపై వెంటనే స్పందించేలా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించారు. అయితే మంగళగిరి సభతో, ఒక్కసారిగా తెలుగుదేశంతో దూరం పెరిగింది. లోకేష్‌పై భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. అయినా టీడీపీ-జనసేన రెండు, ఒకేతాను ముక్కలేనని వైసీపీ విమర్శించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, అంతిమంగా బాబుకు మేలు చేయడమే పవన్ లక్ష్యమన్నట్టుగా మాట్లాడింది. దీంతో టీడీపీతో ఎలాంటి సంబంధం లేదు, ఒంటరిగా పోటీ చేస్తున్నామన్న సంకేతాలు అందేలా, చాలాసార్లు గట్టి విమర్శలు చేశారు పవన్. అయినా జగన్‌ విమర్శలు ఆగలేదు. దీనికితోడు జనసేనతో కలిస్తే తప్పేంటన్న బాబు మాటలు, తాజాగా టీజీ వ్యాఖ్యలు జనసేకు ఇబ్బందిగా మారాయి. ఎన్నికల తరుణంలో ఇలాంటి సందేహాలు, గందరగోళం ఏమాత్రం మంచిదికాదని భావిస్తున్న పవన్, టీజీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వామపక్షాలతో ఒకట్రెండు రోజుల్లో పొత్తులు-సీట్ల పంపకాలపై చర్చలు జరిగి, కీలక ప్రకటన వెలువడే ఛాన్సుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే, తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తుకు ఛాన్సేలేదని అర్థమవుతోంది.

Santosh

Santosh

undefined Contributors help bring you the latest news around you.


లైవ్ టీవి

Share it
Top