Top
logo

జల్లికట్టు... ఆంక్షలు విధించినా ఆగని ఆచారం

జల్లికట్టు... ఆంక్షలు విధించినా ఆగని ఆచారం
X
Highlights

జల్లికట్టు. ఈ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కొమ్ములు తిరిగిన ఒక బలమైన...

జల్లికట్టు. ఈ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కొమ్ములు తిరిగిన ఒక బలమైన ఎద్దు కళ్లముందు కదలాడుతుంది. కసితో పరుగెడుతున్న పశువు మెదులుతుంది. దొరికినవార్ని దొరికినట్టుగా కుమ్మేసే ఒక బుల్‌ కనిపిస్తుంది. జల్లికట్టంటే, తమిళనాడు గుర్తొస్తుంది. ఒకవైపు సంప్రదాయవాదులు, మరోవైపు మూగజీవాల ప్రేమికులు...ఇది వందల ఏళ్ల చరిత్ర ఉన్న క్రీడంటూ వారు, కాదు జంతువుల రక్తం కళ్లజూస్తున్నారంటూ వీరు....కోర్టుల నిషేదాజ్నలు...ప్రభుత్వాల ఆర్డినెన్స్‌లు....ఇంతగా వివాదం రాజేసింది, రాజేస్తోంది, రాజేస్తూనే ఉంటుంది జల్లికట్టు క్రీడ. పొంగల్‌ సందడి మొదలవుతున్న తరుణంలో, పోట్ల గిత్తలను పోరుకు రెడీ చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పుకు విలువేది? కర్ణాటకలోనూ జల్లికట్టు తరహాలోనే కంభాల పోటీ. పొగరెక్కిన ఎద్దులను ఉరికింంచే పందెమిది. దీనిపైనా సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కానీ సంప్రదాయవాదులు మాత్రం, ఆచారం మానలేదు.

సంక్రాంతి అనగానే, మన తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది కోడింపందేలు. కోర్టులు వద్దంటాయి...కోళ్లు సిద్దమవుతాయ్. పోలీసులు అడ్డుకునితీరతామంటారు...ఆపేదిలేదని పందెంరాయుళ్లు పౌరుషంగా చెబుతారు. కత్తులు వద్దని పాలకులు అంటే, పదునెక్కకపోతే మజాలేదని కత్తులు నూరతారు నిర్వాహకులు. మూగజీవాల పట్ల రాక్షసత్వమేంటని యానిమల్ లవర్స్ అంటుంటే, ఇది మా సంప్రదాయం, సంస్కృతంటూ నాయకులు ఘాటైన సమాధానాలిస్తారు. కర్నూలు జిల్లా దేవరగట్టులోనూ ఇదే పరిస్థితి. దసరా సందర్భంగా మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో జరిగే కర్రల సమరంలో తలలు పగులుతాయి. రక్తపాతమయ్యే బన్నీ ఉత్సవం. దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసుల మోతలు.. బాణాసంచా వెలుగు జిలుగులే. అయితే ప్రమోదం మాటున పొంచున్న శబ్ద, వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ హననంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. దీపావళి వేళ బాణాసంచాను రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే కాల్చాలన్న షరతు విధించింది. కానీ అమలును మాత్రం, పాలకులు గాలికొదిలేశారు.

ఇలా చెప్పుకుంటూపోతే, సాంప్రదాయం-సమానత్వం-హక్కుల మధ్య నిత్య ఘర్షణకు ఆనవాళ్లెన్నో. సమాజంలో కాని, మతంలో కాని సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. ఇస్లాంలో కూడా అనేక దేశాల్లో మార్పులకు గురైంది. క్రైస్తవంలో కూడా ఒకప్పుడు చర్చిదే సర్వాధికారం. శాస్త్రపరిశోధనలను అడ్డుకునేది. ఇప్పుడు దాని ప్రాబల్యం తగ్గిపోయింది. మన హిందూ సమాజంలో కూడా సతీసహగమనం పోయింది. బాల్యవివాహాలు వంటివి బాగా తగ్గాయి. గుళ్లోకి దళితుల నిషేధం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ సంస్కరణల విషయంలో, ఒకప్పుడు మహా సంఘసంస్కర్తలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమం చేశారు. ఇప్పుడు కోర్టులే చేస్తున్నాయి. శనిసింగణాపూర్, హజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలో, మహిళల ప్రవేశానికి ద్వారాలు తెరిచాయి. అయితే, రాజకీయ పార్టీలు మాత్రం, కోర్టు తీర్పుకు ముందు ఒక మాట, తీర్పు తర్వాత మరో మాట మాట్లాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలను పటిష్టం చేసుకుంటున్నాయి. అయోధ్య రామ మందిరంపైనా అనేక గిల్లికజ్జాలు వేస్తున్నాయి. ట్రిపుల్ తలాఖ్‌పైనా ముస్లిం పెద్దలు విడ్డూరంగా వాదిస్తున్నారు. కానీ ఆచారాలు, సాంప్రదాయాలనేవి, సమాజానికి రక్షణ అని సంప్రదాయవాదులు వాదిస్తుంటే, కనపడని సంకెళ్లని మరికొందరు వాదిస్తుంటారు. కానీ చట్టాన్ని పాటించాలి. కోర్టు తీర్పులను గౌరవించాలి. వివాదానికి-విద్వేషానికి మధ్యన ఉన్న గీతను గమనించాలి.ప్రజల మధ్య సామరస్యానికి కృషి చేయాలి. ప్రజలకే నిర్ణయం వదిలేయాలి. అప్పుడే సమానత్వం- సాంప్రదాయం మధ్య ఉన్న భావ సంఘర్షణ, భౌతిక సంఘర్షణకు దారితీయదు. కానీ రాజకీయ పార్టీలు కావాల్సింది ఇది కాదు కదా.

Next Story