అమెరికా అఘాయిత్యం ఏంటసలు... మనవాళ్లతో ఏంటి సమస్య!!

అమెరికా అఘాయిత్యం ఏంటసలు... మనవాళ్లతో ఏంటి సమస్య!!
x
Highlights

అమెరికా నుంచి భారతీయ విద్యార్థులను రకరకాల కారణాలతో తిప్పిపంపడం గత మూడు, నాలుగేళ్లుగా పెరిగిపోయింది. అదే సందర్భంలో అమెరికా వెళ్దామనుకుంటున్న వారి...

అమెరికా నుంచి భారతీయ విద్యార్థులను రకరకాల కారణాలతో తిప్పిపంపడం గత మూడు, నాలుగేళ్లుగా పెరిగిపోయింది. అదే సందర్భంలో అమెరికా వెళ్దామనుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత పదేళ్ళ కాలంలో వీరి సంఖ్య రెట్టింపు అయింది. తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం ఇది కాస్త తగ్గే అవకాశం ఉంది. అదే సందర్భంలో సాఫ్ట్ వేర్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు విద్యార్థులను ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. గత పదేళ్ళలో భారత్ నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య రెట్టింపయింది. 2017లో 1.86 లక్షల మంది విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చేరారు. 2016తో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అమెరికాలోని ప్రతీ ఆరుగురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారతదేశానికి చెందినవారే. అమెరికాలో విదేశీ విద్యార్థులు విద్య, ఉద్యోగఅవకాశాలు పొందడం అంత తేలికేం కాదు. ఇప్పుడు చైనా, కొరియా, జపాన్ విద్యార్థుల నుంచి పోటీ బాగా పెరిగిపోయింది. ఒక్క ఆరు నెలల కాలంలో వందలాది సంస్థలకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతీ వంద మంది లో పది మంది మాత్రమే మంచి ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మరో వైపున స్థానిక అమెరికన్ల నుంచి కూడా భారతీయ విద్యార్థులకు గట్టిపోటీ ఎదురవుతోంది. అమెరికా పౌరసత్వం, లైసెన్స్, కనీస అనుభవం లాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. జాబ్ మేళా లాంటి వాటిల్లో ఒక 120 సంస్థలకు దరఖాస్తు చేస్తే భారతీయ విద్యార్థికి 5 సంస్థల్లో మాత్రమే అవకాశం లభిస్తే, అమెరికా విద్యార్థికి 115 సంస్థల్లో అవకాశం లభిస్తోంది.

గత ఐదారేళ్ళు గా సాఫ్ట్ వేర్ రంగంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా...ఒక్కో దేశంలో ఒక్కో రకం సిలబస్ ఉంటుంది. ఒక్కో రకం ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. విదేశీ విద్య సందర్భంలో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా విషయానికే వస్తే....ఏరోనాటిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో మేథ్స్ కు బాగా ప్రాధాన్యం ఉంటుంది. భారతీయ విద్యార్థులకు పరిచయం లేని ఎన్నో టాపిక్స్ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే భారతీయ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాటిని తట్టుకోగలగాలి. ఇక ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. డాలర్లను రూపాయిల్లోకి మార్చుకుంటే గుండె గుభేల్ మంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తే రకరకాల ఇబ్బందులు తప్పవు.

భారతదేశంలో సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేతనం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే రెండున్నర రెట్లు తక్కువ. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 5 రెట్లు తక్కువ. ప్రధానంగా ఈ అంశమే భారతీయ విద్యార్థులు అమెరికా లాంటి దేశాలకు వెళ్లేలా చేస్తోంది. అందుకే అనుబంధాలను సైతం వదులుకొని లక్షలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడే అవకాశం కోసం చూస్తున్నారు. అనుబంధాలపై మమకారం ఉన్న వారు మాత్రం కొన్నేళ్ళ తరువాత భారత్ కు తిరుగుముఖం పడుతున్నారు. ఇక్కడి సంస్థల్లో తమకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. జీవించేందుకు డబ్బు అవసరమే....అయితే అది మాత్రమే ప్రధానం కాదు. నైతిక విలువలు, అనుబంధాలు కూడా ముఖ్యమే. జీవితంలో ఉన్నతి సాధించడం ముఖ్యమే. అదే సందర్భంలో ఏదో ఒక స్థాయిలో వచ్చిన దాంతో సంతృప్తి చెందడం కూడా ముఖ్యమే. కొద్దిగా ఎక్కువ కష్టపడితే అమెరికా లాంటి దేశాల్లో సాధించే దానిలో సగమైనా దేశంలోనే సాధించేందుకు అవకాశాలున్నాయి. అలా గాకుండా డబ్బే ప్రధానమనుకుంటే.....అమెరికా లాంటి దీపస్తంభాలు దీపపు పురుగుల్లాంటి విద్యార్థులను ఆకర్షిస్తూనే ఉంటాయి. వారిని ఇబ్బందులపాలు చేస్తూనే ఉంటాయి. ఆలోచనాధోరణిలో మార్పు వస్తే తప్ప విదేశీ ఉద్యోగాలపై వ్యామోహాలను తొలగించడం సాధ్యం కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories