వారణాసిలో మోడీపై ప్రజల వ్యతిరేకతకు ఏం సమాధానం చెబుతారు?

వారణాసిలో మోడీపై ప్రజల వ్యతిరేకతకు  ఏం సమాధానం చెబుతారు?
x
Highlights

మోడీ వారణాసి ఎంపీగా గెలిచాక నగర రోడ్లు మెరుగు పడ్డాయి. స్వచ్ఛ భారత్ బాగా అమలవుతోంది. నదీ తీరాలు అందంగా మారాయి. రోడ్ల విస్తరణ జరిగింది. కానీ పరిశ్రమలు...

మోడీ వారణాసి ఎంపీగా గెలిచాక నగర రోడ్లు మెరుగు పడ్డాయి. స్వచ్ఛ భారత్ బాగా అమలవుతోంది. నదీ తీరాలు అందంగా మారాయి. రోడ్ల విస్తరణ జరిగింది. కానీ పరిశ్రమలు తెస్తాననీ, యువతకు ఉపాధి చూపుతానని, కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తాయనీ, మౌలిక వనరులను పెంచుతాననీ ఆయనిచ్చిన వాగ్దానాలు మాత్రం తీరలేదు. వారణాసి కనెక్టివిటీని పెంచడానికి ఒక రింగు రోడ్డును, ఒక ఫ్లై ఓవర్ ను ఏర్పాటు చేస్తానని మోడీ 2014లో హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆ రోడ్ల పనులు మొదలయ్యాయి. కాశీలో అత్యంత ఇరుకుగా ఉన్న కాశీ విశ్వ నాధ ఆలయాన్ని బ్యూటిఫికేషన్ చేసి రద్దీని తట్టుకునేలా విస్తరిస్తామన్న మాటకు కట్టుబడి మరో ప్రాజెక్టు పనులు కు కూడా కేంద్రం మొదలు పెట్టింది.600 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు స్థానికులకు కష్టాలు మిగులుస్తోంది. ఆలయ విస్తరణ పేరుతో ఇళ్లు, షాపులను తొలగించడంపై స్థానికులు మండి పడుతున్నారు. నగరం పాత కళను కోల్పోయిందని, ఈ ప్రాజెక్టుతో ఇబ్బందులు తప్ప మరేం మిగలలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

మోడీ గొప్ప జాతీయ నేత అని స్థానికంగా ఏం చేయకపోయినా, ఆయనవ్యక్తిత్వం, సమర్ధత మళ్లీ ఓటేసేలా చేస్తున్నాయని కొందరు చెబుతుంటే, నియోజక వర్గంలో మరో ప్రత్యామ్నాయం లేక మోడీనే ఎన్నుకోవాల్సి వస్తోందని మరికొందరంటున్నారు. మోడీ గొప్ప నేతే కావచ్చు కానీ స్థానికంగా మాకు ఉపయోగ పడటం లేదన్నది మరికొందరి వాదన. గత ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పోటీలో నిలబడ్డారు. కానీ ఈసారి ఇప్పటి వరకూ ఈ నియోజక వర్గం నుంచి మోడీ ప్రత్యర్ధులెవరన్నది ఇంకా తేల లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక పేరును పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి. వారణాసి నుంచి పోటీకి సిద్ధమేనని ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక పేరును పరిశీలిస్తోందన్నది మరో కథనం. కానీ ప్రియాంకను యూపీ అసెంబ్లీ సీఎం అభ్యర్ధిగా దింపుతారన్నది మరో టాక్ వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిఎవరన్నది సస్పెన్స్ కాగా, ఎస్పీ, బీఎస్పీ కూటమి కూడా తమ అభ్యర్ధి ఎవరన్నది ప్రకటించలేదు.అయితే రైతులను పట్టించుకోవడం లేదన్న అక్కసుతో తమిళనాడుకు చెందిన 111 మంది రైతులు ఈసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మోడీకి చుక్కలు చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

మొత్తం మీద వారణాసి ప్రజలకు మోడీపై కొంత అసంతృప్తి ఉంది. ప్రత్యర్ధులెవరైనా మోడీని మరోసారి గెలిపించి తీరతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ వాదాన్ని రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్న మోడీ వారణాసిలో తనపై పెరుగుతున్న వ్యతిరేకతకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఏడుదశల ఎన్నికలలో ఆఖరు దశ అయిన మే 19న ఈ నియోజక వర్గం ఎన్నిక జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories