Top
logo

గూర్ఖాలాండ్ ఉద్యమం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తోందా?

గూర్ఖాలాండ్ ఉద్యమం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తోందా?
Highlights

పశ్చిమ బెంగాల్ ను ఒక కుదుపు కుదిపిన గూర్ఖాలాండ్ ఉద్యమం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తోందా? ప్రత్యేక రాష్ట్రం...

పశ్చిమ బెంగాల్ ను ఒక కుదుపు కుదిపిన గూర్ఖాలాండ్ ఉద్యమం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తోందా? ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడిన ఈ ప్రాంత నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? జాతీయ పార్టీలు సైతం ఈ సమస్యపైదృష్టి పెట్టక పోవడానికి కారణాలేంటి?

బెంగాల్ ను ఒకప్పుడు అట్టుడికించిన గూర్ఖాలాండ్ ఉద్యమం ఈ సారి ఎన్నికల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించడం లేదు. గూర్ఖాలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం,రాజ్యాంగంలోని ఆరవ అధికరణం అమలు జరపడం ప్రధాన డిమాండ్లుగా గత ఎన్నికలవరకూ గూర్ఖా ఉద్యమం నడిచింది. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ ఈ ఉద్యమం గురించి రాజకీయ పార్టీలు కంగారు పడేవి. కానీ ఈసారి ఈ డిమాండ్ పెద్దగా వినిపించడం లేదు. గూర్ఖా ఉద్యమానికి మూల కారణమైన జీజేఎం, జీఎన్ ఎల్ ఎఫ్ పోరాట సంస్థలు వ్యూహం మార్చాయి. తమ ప్రాంతలో శాంతి పునరుద్ధరణను, అభివృద్ధిని కోరుతున్నాయి. మరోవైపు బీజేపీ కానీ, తృణమూల్ కానీ గూర్ఖా లాండ్ ఉద్యమాన్ని అసలు ఎన్నికల అంశంగా పరిగణించడం లేదు.

కీలకమైన డార్జిలింగ్ లోక్ సభ స్థానంలో గెలుపు ఓటములను నిర్ణయించే ఉద్యమ సంస్థలు సైతం ఎందుకో ఈసారి మౌనమే దాల్చాయి. గూర్ఖా కొండల్లో సర్వతో ముఖాభివృద్ధి కావాలని, స్వయం ప్రతిపత్తి తర్వాత అంశమనీ ఆ సంస్థలు అంటున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధే తమ మొదటి డిమాండ్ అంటున్న గూర్ఖా ఉద్యమ నేతలు అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఏనాడూ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల్లో సైతం నిలబడుతున్న ఈ ఉద్యమ పార్టీలు ప్రజావసరాలు తీరకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడటం సరికాదనే నిర్ణయానికొచ్చాయి. డార్జిలింగ్ నియోజక వర్గం నుంచి 2009లో బీజేపీ ఎంపీలుగా జశ్వంత్ సింగ్, 2014లో సురీందర్ సింగ్ అహ్లూ వాలియా గెలిచారు. అయితే ఈసారి పోటీ జీజేఎం, జీఎన్ ఎల్ ఎఫ్ మధ్యనే ఉండబోతోంది. జీజేఎం తృణమూల్ కాంగ్రెస్ ని సమర్ధిస్తుండగా, జీఎన్ ఎల్ ఎఫ్ బీజేపీని సమర్ధిస్తోంది. తాగునీరు, కరెంట్, విద్య, నిరుద్యోగం లాంటి అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ దృష్టి పెట్టగా బీజేపీ మాత్రం గూర్ఖా కొండల్లో శాంతి స్థాపన ధ్యేయంగా అడుగులేస్తోంది. తేయాకు కార్మికులకు కనీస వేతనాలు, మూతపడిన తేయాకు గార్డెన్స్ ను తెరవడం ఎన్నికల ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి.ఈ కొండల్లో ఎక్కువగా లెప్చాస్, షెర్పాస్, భుటియాలు ఉంటారు.

ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ సుభాష్ ఘీషింగ్ ఉద్యమించడంతో 1980లలో తొలిసారి గూర్ఖాలాండ్ ఉద్యమం వార్తలకెక్కింది. అప్పటినుంచీ దశాబ్దాలుగా ఈ ఉద్యమం రాజుకుంటూనే ఉన్నా.. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇది ఎజెండా కాలేదు. స్థానిక గూర్ఖా నేతలు తెలివిగా రాజకీయ పార్టీలలో చేరి తమ ప్రాంత అభివృద్ధి కోసం డిమాండ్ చేస్తుండటంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చల్లారినట్లే కనిపిస్తోంది.

మోడీ ప్రసంగాల్లోగానీ, దీదీ మాటల్లో కానీ ఈ అంశం ప్రస్తావనకు కూడా రాలేదు. ఈనెల 18న పోలింగ్ జరిగే ఈ ప్రాంతంలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Next Story

లైవ్ టీవి


Share it