మోడీ పఠించింది సమ్మోహన మంత్రమేనా?

మోడీ పఠించింది సమ్మోహన మంత్రమేనా?
x
Highlights

ఎన్నికల వేళ బీజేపి సమ్మోహన మంత్రం పఠించింది. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రైతులు, కార్మికులు,...

ఎన్నికల వేళ బీజేపి సమ్మోహన మంత్రం పఠించింది. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా ఏ ఒక్కరినీ వదల్లేదు. దాదాపు 35 కోట్ల మంది ఓట్లను ఒడిసిపట్టే అతిపెద్ద గాలాన్ని విసిరింది. ప్రధాని మోడీ మరోసారి గణాంకాల గారడీ చేశారు.. అంకెల కనికట్టు చేశారు. ఎన్నికల వేళ గెలుపు కోసం కీలక వర్గాలపై సమ్మోహన మంత్రం వేశారు. ఎన్నికల ముందు సమాజంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రచించిన ఈ ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ ను కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు..

రైతులు, వేతన జీవులు, మహిళలు ఈ ముగ్గురినీ టార్గెట్ చేశారు. ముఖ్యంగా వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. దాదాపు అయిదు లక్షల వార్షికాదాయం ఉన్న వారికి పూర్తి పన్ను మినహాయింపు కల్పించారు. మధ్యతరగతి వర్గాలకు ఇది అతిపెద్ద ఊరట.. మధ్యతరగతి ఓట్లను లాఘవంగా ఒడిసిపట్టే కీలక నిర్ణయమిది. అంటే అయిదు లక్షలు వార్షికాదాయం ఉన్న వారు ఇప్పటి వరకూ 12,500 రూపాయలు పన్ను చెల్లించాల్సి వచ్చేది .ప్రస్తుత విధానంలో అసలు పన్ను కట్టనక్కర లేదు.. ఇది ఖచ్చితంగా మధ్యతరగతి వారిని, పెన్షనర్లను ఆకట్టుకునేదే..దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నిర్ణయంతో ఊరట కలుగుతుంది.గృహ రుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సూరెన్సులు కలిపి6.50 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. అలాగే సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై 2.50 లక్షల వరకూ పన్ను ఉండదు..నెలవారీ స్టాండర్ట్ డిడక్షన్ పరిమితి 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీని పదివేలనుంచి 40 వేలు పెంచారు.

ఇక కార్మిక, కర్షక వర్గాలనూ తన వలలో పడేసుకున్నారు. దాదాపు 35 కోట్లమందికి నేరుగా లబ్ది కల్పించే విధంగా అనేక రకాల వరాల జల్లులు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం లాంటిదే మరో స్కీమ్ ఎనౌన్స్ చేశారు. అయిదెకరాలున్న రైతులకు ఏడాదికి ఆరువేలు పంట పెట్టుడి సాయం అందిస్తారు. ఈ సొమ్ము నేరుగా రైతు ఎక్కౌంట్ లో పడుతుంది. దీనివల్ల దాదాపు12 కోట్ల రైతులకు లబ్ది చేకూరుతుంది. మూడు ఇన్ స్టాల్ మెంట్లుగా ఈ సొమ్ము చేతికందుతుంది.అలాగే అసంఘటిత కార్మికులకు నెలకు మూడు వేలు పెన్షన్ ఇస్తారు..నెలకు వంద రూపాయలు కడితే 60 ఏళ్లు నిండిన వారికి నెల నెలా ఈ పెన్షన్ అందుతుంది. ఇక ఇళ్ల కొనుగోళ్లపై కూడా జీఎస్టీ తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ఇలా సమాజంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మోడీ సమ్మోహన మంత్రం పఠించారు.

ఈ బడ్జెట్ లో రైల్వేలకు 64,587 కోట్లు, జాతీయ విద్యా మిషన్ కు 38,572 కోట్లు ప్రకటించారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని కంప్యూటరైజ్ చేస్తారు.. పన్ను చెల్లింపు దారుడు కాలు కదపనక్కర లేకుండానే చెల్లించొచ్చు.. ఈ ఏడాది పన్ను ఎగవేత దారులు, సంస్థలనుంచి మొండి బకాయిలు 3 లక్షల కోట్లు రికవరీచేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోకే అతిపెద్ద ఆరోగ్యరక్షా కార్యక్రమమని దీనివల్ల పదిలక్షల మంది లబ్ది పొందుతారనీ గోయల్ ప్రకటించారు.మత్య్సకారులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు.ఉజ్వల యోజనా పథకం కింద 8 కోట్ల మంది గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే చలన చిత్ర నిర్మాణాలకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వడం, థియేటర్లపై జీఎస్టీ 12 నుంచి 10 శాతానికి తగ్గించడంతో సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకు పెద్ద ఊరట.

Show Full Article
Print Article
Next Story
More Stories