ఏళ్లు గడుస్తున్నా... మన ఆర్థిక విధానాలెందుకు మారట్లేదు!!

ఏళ్లు గడుస్తున్నా... మన ఆర్థిక విధానాలెందుకు మారట్లేదు!!
x
Highlights

2018లో ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు రోజుకు 12 శాతం అదనపు సంపాదనతో కోటీశ్వరులుగా మారిపోయారు.. కానీ అదే సమయంలో పేదరికంలో మగ్గిపోయే వారు 11 శాతం మరింత...

2018లో ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు రోజుకు 12 శాతం అదనపు సంపాదనతో కోటీశ్వరులుగా మారిపోయారు.. కానీ అదే సమయంలో పేదరికంలో మగ్గిపోయే వారు 11 శాతం మరింత దిగువకు పడిపోయారు..ధనికులు, పేదల మధ్య రాను రాను పెరుగుతున్న అంతరాలు తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన తగినన్ని చర్యలు తీసుకోకపోతే ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగి అది అస్థిరత, ఆందోళనలకు దారి తీసే ప్రమాదముంది. ఈ అంతరాల వల్ల ఎక్కువగా నలిగిపోయేది మహిళలు, ఆడ పిల్లలే.. కుటుంబాన్ని చక్కదిద్దే భారం, పిల్లల పెంపకంలో ఎక్కువ బాధ్యత తీసుకునేది మహిళలే కాబట్టి..సరైన ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల వారు తగినంతగా శ్రద్ధ పెట్టలేరు. అలాగే ఆడపిల్లలకు సరైన పోషణ, శారీరక, మానసిక వికాసం లేకపోవడం వల్ల వృద్ధి చెందాల్సిన కుటుంబాలు పేదరికంలోనే మగ్గిపోతుంటాయి. మనదేశంలో అభివృద్ధి కి సవాలక్ష అడ్డంకులు ఎ దురవుతుంటాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన ఆడపిల్లలకు సరైన విద్య, ఆరోగ్యం అందడం లేదు.. మెజారిటీ మహిళలు ప్రసవ సమయంలో సరైన వైద్యం అందక చనిపోతున్నారు.. అంతేకాదు.. మహిళలకు మగవారితో సమానంగా వేతనాలు పెరగకపోవడం ఒక కారణం.. మన దేశంలో మగవారికన్నా కష్టపడి పనిచేసే మహిళలకు సైతం 34 శాతం తక్కువ వేతనాలున్నాయి.ప్రపంచంలో మహిళలు పడుతున్న కష్టాన్ని లెక్క గడితే ఆ ఆదాయం విలువ యాపిల్ సంస్థ వార్షికాదాయంకన్నా 43 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆరోగ్య ప్రమాణాలు ఇంత నిరాశాజనకంగా ఉండబట్టే.. మన సంపద పైనా ప్రభావం చూపిస్తున్నాయి. సరైన ఆరోగ్యం లేని వారు సరైన ఆదాయాన్ని సృష్టించలేరు.. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగు పడునోయ్ అన్నట్లుగా ప్రజల్లో అనారోగ్యం, నిరాసక్తత ఉంటే ఇక అభివృద్ధి చెందే మార్గమే ఉండదు.. మనదేశంలో ఆరోగ్య సేవలు, నాణ్యమైన విద్య అన్నవి కేవలం సంపన్నులకు మాత్రమే దక్కుతున్న ఫలాలు.. అందువల్ల పేదల బతుకుల్లో మెరుగుదల కనపడదు. మన దేశంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, లింగ వివక్ష, అవినీతి, పబ్లిక్ సర్వీసులను ప్రైవేటు పరం చేయడం, కీలక శాఖలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం ఈ సామాజిక అంతరాలు పెరగడానికి కారణమవుతున్నాయి. కుల దురహంకారం, దళిత స్త్రీలపై దాడులు, మహిళల పనిని లెక్కించకపోవడం, వారికి మెరుగైన వేతనం ఇవ్వకపోవడం, ఆరోగ్యపరమైన రక్షణ కల్పించకపోవడం లాంటి కారణాలే మన ఆర్థిక అభివృద్ధి మందగమనానికి కారణమవుతున్నాయి. అతి తక్కువ ధరలకే నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామని మన దేశంలో నేతలు చెప్పుకుంటున్నా.. ఈ మధ్య మొదలు పెట్టిన ఆయుష్మాన్ భారత్ తో సహా వైద్య సేవలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నది వాస్తవం. బ్రిటన్ లో ప్రతీ వెయ్యి మంది పౌరులకి ఇద్దరేసి డాక్టర్లుంటే మన దగ్గర కనీసం ఒక్కరు కూడా లేరు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల పనిని ప్రభుత్వాలు లెక్క గట్టక పోవడం వల్ల మహిళల పని అసలు లెక్కలోకే రావడం లేదు.

అయితే సమాజంలో ఇలా అంతరాలు పెరుగుతూ పోతే మన ఆర్థిక భవిష్యత్తే అగమ్యగోచరంలో పడుతుంది. అందుకే సంపన్నులకు పెరుగుతున్న ఆదాయంపై పన్ను శాతాన్ని మరింత పెంచితే తగినంత ఆదాయం పెరుగుతుంది. కుల, వర్గ, లింగ, మత పరమైన అంతరాలు కూడా మన ఆర్థికాభివృద్ధికి బ్రేకులు వేస్తున్నాయి. దీనికి సంపన్నులు పన్ను సక్రమంగా కట్టేలా చూడట మొక్కటే మార్గం..పన్ను ఎగవేత దారులను పట్టుకుని వారి నుంచి రావాల్సిన బకాయిలు ముక్కు పిండి వసూలు చేయగలిగితే ఈ అంతరాలు కొంత మేరకు తగ్గొచ్చు.. కానీ ఆ దమ్ము మన నేతలకుందా అన్నదే ఇప్పుడు రేగుతున్న ప్రశ్న.. సంపన్నుల, కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ..తిరోగమన ఆర్థిక విధానాలను అవలంబిస్తున్న నేతలు తమ విధానాలను మార్చు కోవాల్సిన అవసరాన్ని ఆక్స్ ఫామ్ అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.. మన ఆర్థిక విధానాల్లో సమూలమైన మార్పు తేవాల్సిన అవసరాన్ని ఆక్స్ ఫామ్ అధ్యయనం తెలియ చెప్పింది.. ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసే రాజకీయ పార్టీలు, నాయకులు స్వార్ధం లేకుండా దేశానికి అనువైన ఆర్థిక విధానాల రచన చేసినప్పుడే ఈ ధనిక , పేద అంతరాలు తొలగిపోయేది. అభివృద్ధికి ఈ అంతరాలే అడ్డంకి.

Show Full Article
Print Article
Next Story
More Stories