దశాబ్దాల పోరాటం తీరిన వేల.. అగ్రవర్ణాలు ఏమంటున్నాయ్‌ మరి!!

దశాబ్దాల పోరాటం తీరిన వేల.. అగ్రవర్ణాలు ఏమంటున్నాయ్‌ మరి!!
x
Highlights

రిజర్వేషన్ల కోసం దేశంలో అగ్రవర్ణాలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. పేరు గొప్ప కులంలో పుట్టినా, బతుకు దుర్భరమైన తమను ఆదుకోవాలని ఉద్యమాలు...

రిజర్వేషన్ల కోసం దేశంలో అగ్రవర్ణాలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. పేరు గొప్ప కులంలో పుట్టినా, బతుకు దుర్భరమైన తమను ఆదుకోవాలని ఉద్యమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన మూవ్‌మెంట్‌ నడుస్తోంది. ఉత్తరాదిలో కోల్పోతున్న ప్రభను తిరిగి పొందేందుకే, మోడీ సర్కారు రిజర్వేషన్ అస్త్రం ప్రయోగించింది. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం, దేశంలో ఎస్సీల జనాభా 19.59 శాతం. ఎస్టీలు 8.63. అందరికంటే ఎక్కువున్న జనాభా ఓబీసీలు. దాదాపు 40.93 శాతమున్నారు. మిగిలిన వర్గాల జనాభా 30.83 శాతం. కులవివక్ష, సామాజిక అంతరాలు తొలగించేందుకు, అగ్రకులాలతో సమానంగా ఎస్టీ, ఎస్టీలను పురోగతి పథంలో తెచ్చేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రతిపాదించారు. అయితే, అగ్రకులాలుగా పిలిచే బ్రహ్మణులు, క్షత్రియులతో పాటు ఓసీలోని అనేక కులాల్లోనూ పేదలున్నారు. బతుకు దుర్భరమైనవారున్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కారణంగా, మిగిలిన కోటాలో పోటీపడలేక సతమతయ్యేవారున్నారు. అందుకే రిజర్వేషన్లపై పెద్ద కులాల్లో ఆగ్రహముంది. ఇదే నేపథ్యంలో అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి.

మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్లతో పోల్చదగ్గ వర్గం గుజరాత్‌లో పటేల్‌ అనే పాటిదార్లు. రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. హార్థిక్‌ పటేల్ ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గుజ్జర్లు, రాజ్‌పుత్‌లు, జాట్లు కోటా కోసం చేసిన ఆందోళన హింసాత్మకమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు సైతం రిజర్వేషన్ల కోసం భారీగా ఉద్యమం చేశారు. దాదాపు 13 రాష్ట్రాలల్లో అప్పర్‌ క్యాస్ట్‌ పాపులేషన్, పోరాటాలు చేసింది. అనేక రాజకీయ పార్టీలు కూడా వీరికి హామినిచ్చాయి. ఇలా దశాబ్దాలుగా వినిపిస్తున్న అగ్రవర్గాల రిజర్వేషన్‌ డిమాండ్‌కు, ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు కార్యరూపం దాల్చింది. దీంతో అగ్రవర్ణాల్లోని పేదలకూ న్యాయం జరగబోతోంది. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో లబ్దిపొందే కులాలు ఏవంటే, బ్రహ్మణులు, బనియాలు, భూమిదార్లు, రాజ్‌పుత్‌లు, జాట్లు, గుర్జర్లు, ముస్లింలు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కమ్మా, రెడ్లు, వెలమలు, వైశ్యులు, రాజులుగా పిలిచే, క్షత్రియుల్లోని పేదలు సైతం 10 శాతం రిజర్వేషన్‌ పొందబోతున్నారు.

ఎస్సీ, ఎస్టీ వంటి నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల విధానం రాజ్యాంగంలో పొందుపర్చారు. నాటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించారు. ఈ రిజర్వేషన్లు పదేళ్ల వరకు మాత్రమే ఉండాలని రాజ్యాంగంలో పొందుపర్చారు. అయినా రిజర్వేషన్‌ ఇంకా కొనసాగిస్తున్నాం. మండల్ కమిషన్‌ నివేదికతో ఓబీసీలకూ రిజర్వేషన్లు దక్కాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆ సమయంలో సుప్రీం కోర్టే, ఒక తీర్పులో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హద్దు గీసింది. ఇప్పుడు ఆ గీత చెరిపేసేందుకు నరేంద్ర మోడీ సర్కారు సిద్దమైంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీం గీతను చెరిపేసిన తొలి రాష్ట్రం తమిళనాడు. 1994 నుంచి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలవుతోందక్కడ. ఇందుకోసం 45/94 చట్టం తెచ్చి, నాడు కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ సహకారంతో పార్లమెంట్ ఆమోదం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించింది. ఇదే నిదర్శనంగా తెలంగాణలోనూ ముస్లింలకు 12 శాతం డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్‌. అయితే అగ్రవర్గాల్లో బలమైన బీజేపీ, మరింత బలపడేందుకు, ఉత్తరాదిలో తిరిగి పుంజుకునేందుకు, 10 శాతం రిజర్వేషన్‌ తెరపైకి తెస్తోంది. కానీ ఎలా ఆమోదం పొందుతుందన్న సందేహమే అందరిలోనూ గందరగోళం రేపుతోంది. లోక్‌సభలో బలముంది కాబట్టి రాజ్యాంగ సవరణ సాధ్యమవుతుంది. రాజ్యసభలో కష్టమే. అందులోనూ చివరి సమావేశం. చివరి ఒకట్రెండు రోజులు. ఒకవేళ రెండు సభల్లోనూ పాసయినా, సుప్రీంలో నిలబడుతుందా అన్నది మరో అనుమానం. అందుకే మోడీ సర్కారు నిర్ణయంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం మేమైతే అగ్రకులాలకు రిజర్వేషన్ ఇచ్చాం, విపక్షాలు, కోర్టులు అడ్డుకున్నాయన్న నినాదం బీజేపీకి తెరపైకి తేవచ్చు. అధికారంలోకి వస్తే, తప్పకుండా ఇస్తామని ప్రచారం చేసుకుని, గట్టెక్కుదామన్న ఆలోచన కావచ్చన్న విశ్లేషణ సాగుతోంది.

అయితే రిజర్వేషన్లు అన్ని పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయాలయ్యాయి. అందుకే ఏడు దశాబ్దాలు దాటినా ఎస్సీ,ఎస్టీలు, బీసీల్లో ఆశించినంత అభివృద్దిలేదు. రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందలేదు. రిజర్వేషన్లు పొందుతున్న వారే తిరిగి పొందుతూ, ధనికులవుతున్నారే, కానీ విడిచిపెట్టడం లేదు. ఇందుకు రాజకీయ నాయకులూ మినహాయింపు కాదు. అగ్రవర్ణాలతో సమానంగా అనేక కులాలు ఇంకా ఎదగలేదు. రిజర్వేషన్లయితే గొప్పగా ప్రకటిస్తున్నారు కానీ, విద్యావ్యవస్థలో నాణ్యతను గాలికొదిలేశారు. ప్రైవైటైజేషన్ చేస్తూ, పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. కోటాలు పెరుగుతున్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. మొక్కుబడి రిజర్వేషన్లు కాదు, ఆచరణీయ కార్యక్రమాలు పట్టాలెక్కాలి. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తేవాలి. అసలు రిజర్వేషన్లు అవసరమే లేని పోటీ వాతావరణం రావాలి. నాణ్యమైన మానవ వనరులను తీర్చిదిద్దాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories