రోడ్ షోలతో అదరగొడుతున్న భోపాల్ అభ్యర్ధులు

రోడ్ షోలతో అదరగొడుతున్న భోపాల్ అభ్యర్ధులు
x
Highlights

భోపాల్ బరిలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి దిగ్విజయ్, బీజేపీ అభ్యర్ధి ప్రగ్యా సింగ్ ఇద్దరూ హిందూత్వ కార్డునే...

భోపాల్ బరిలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి దిగ్విజయ్, బీజేపీ అభ్యర్ధి ప్రగ్యా సింగ్ ఇద్దరూ హిందూత్వ కార్డునే ప్రయోగిస్తుండటంతో ఓటర్లకు ఎవరిని ఎన్నుకోవాలన్నది ప్రశ్నగా మారనుంది. సాధ్వీ ప్రగ్యా పూర్తిగా హిందూ ఎజెండాతో అడుగులేస్తుండగా మొదట్లో సెక్యులర్ పంథాతో సాగిన దిగ్విజయ్ పోల్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ హిందూత్వ కార్డునే బయటకు తీస్తున్నారు.

భోపాల్ పోల్ సీన్ అంతకంతకూ రక్తి కడుతోంది. సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్, కాంగ్రెస్ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్ ఓటర్లను ఆకట్టు కోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ టెర్రరిజం అంటూ బీజేపీపైనా సాధ్వి ప్రగ్యా పైనా విమర్శలు కురిపించిన దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో గెలుపు కోసం అదే కాషాయ వాదాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కంప్యూటర్ బాబాతో మూడు రోజుల పాటూ హవన యాగం నిర్వహించారు. దానికోసం ఏడు క్వింటాళ్ల ఎండు మిర్చి వినియోగించారు. మండుటెండల్లో మూడు రోజుల పాటూ సాధు సంతుల చెంత కూర్చుని ఓపికగా డిగ్గీ దాదా ఈ యజ్ఞం చేశారు. యాగంలో ఎండు మిర్చిని యజ్ఞ కుండంలో వేశారు.

దిగ్విజయ్ సింగ్ ఇలా హిందూ కార్డును తీయడంతో బీజేపీ అభ్యర్ధి ప్రగ్యా సింగ్ సెంటిమెంట్ తో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి చిత్ర హింసల పాల్జేశారని ప్రగ్యా ప్రచారం చేస్తున్నారు. తనను జైలులో చిత్రహింసలు పెట్టిన తీరును హృదయ విదారకంగా వర్ణిస్తూ ఓ పాంప్లెట్ తయారు చేసి రోడ్డు షోలలో దానిని పంచుతున్నారు. జైల్లో పెట్టిన టార్చర్ కి తాను సరిగా నడవలేకపోతున్నానని ప్రగ్యా చెబుతుంటే ఓటర్లు సానుభూతితో వింటున్నారు. ప్రచారం మొదట్లో కొన్ని దూకుడు వ్యాఖ్యలు చేసి ఈసీ అక్షింతలు తిన్న ప్రగ్యా ఆ తర్వాత కాస్త కుదురుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వారం రోజులు కూడా లేకపోవడంతో వేగం పెంచారు. బైక్ పై కూర్చుని ప్రచారానికి వెడుతున్నారు.

అంతేకాదు ఆలయాలలో పూజా మండపాల్లో పూజలు, భజనలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు ప్రగ్యా. ఈ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని తెలుసుకున్న డిగ్గీ దాదా ఆ వయసులో రోడ్ షోలు సైతం చేస్తున్నారు. కంప్యూటర్ బాబా సాయంతో సాధు సంతులను వెంటేసుకుని భోపాల్ వీధుల్లో నడచి వెడుతూ ప్రచారం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 13 అఖాడాలకు చెందిన 7 వేలమంది సాధువులు దిగ్విజయ్ వెంట రోడ్ షోలో పాల్గొన్నారు. ఆరోదశ పోలింగ్ లో భోపాల్ ఎన్నిక లకు వెడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన ఇద్దరు అభ్యర్ధులూ హిందూ కార్డునే నమ్ముకోడంతో భోపాల్ ఎన్నిక ఆసక్తిదాయకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories